తెలంగాణవార్తలు

Mirchi Price: మిర్చి ఒక క్వింటాల్ రూ.16350- ఆసియాలోనే రెండో అతి పెద్ద మార్కెట్ ఖమ్మంలో

0

Mirchi Price: మిర్చి రైతుకు ఇది సంతోషకరమైన వార్తే. మిర్చి ధర ఒక క్వింటాల్ రూ.16350 పలికింది.క్వాలిటీతో నిమిత్తం లేకుండా క్వింటా రూ.11-12 వేలు పలుకుతోంది. తాలుకాయ క్వింటాల్ కు రూ.8000 లభిస్తోంది. గతంలో ఇలా మిర్చి ధర రూ.20 వేలు పైచిలుకు పలికిన సందర్భాలు కూడా ఉన్న విషయం తెలిసిందే. మిర్చి పంటకు ఖమ్మం మార్కెట్‌ ఆసియాలోనే రెండో అతి పెద్దది కావడం విశేషం. గుంటూరు తర్వాత రెండో అతి పెద్దదైన ఖమ్మం మార్కెట్‌కు పీక్‌ సీజన్‌లో రోజుకు లక్ష బస్తాలు కూడా వచ్చే పరిస్థితి ఉంది. మామూలు సీజన్‌లో రోజుకు ఏభై వేల బస్తాలు తగ్గకుండా సరకు వస్తుంటుంది. ఇక్కడి నుంచి ఐరోపా, అమెరికా ఖండాలకు ఎగుమతి అవుతుంటుంది. ఇక్కడ నల్లరేగడి నేలల్లో పండే తేజ రకం మిర్చికి ఎనలేని డిమాండ్‌ ఉంది.

Mirchi Price

Mirchi Price

ఈ మార్కెట్‌కు ఖమ్మం జిల్లాలోని రైతులతో పాటు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మహబూబాబాద్‌, సూర్యపేట, నల్గొండలతో పాటు ఏపీలోని కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి నిత్యం ఇక్కడకు మిర్చి పంట వస్తుంటుంది. వాస్తవానికి ఈ ఏడాది పంట ఆశించిన మేర పండలేదని చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఆర్థిక పరిపుష్టి ఉన్న రైతులు, వ్యాపారులు ఏసీ గోడౌన్లలో నిల్వ ఉంచిన మిర్చి పంటను మొత్తం ఖాళీ చేస్తున్న పరిస్థితి ఉంది. నిత్యం ఇలా రెండు విధాలా వచ్చే సరకుతో యార్డు నిండిపోతోంది. మంచి నాణ్యమైన సరకు వస్తే ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని ఎక్స్‌పోర్టు మార్కెట్‌లో పనిచేసే ట్రేడర్‌ భాజా ఉపేందర్‌ ‘న్యూస్‌18 తెలుగు’ ప్రతినిధితో చెప్పారు.

Chilli Cultivation

Chilli Cultivation

Read Also:  వేలాది ఎకరాల్లో పంట నష్టం…మిర్చి రైతులను నిండా ముంచిన తామర పురుగు

ఓ మోస్తరు నాణ్యత ఉన్న రకాలు కూడా రూ.11 నుంచి 12 వేలు ధర పడుతోందని, చివరకు తాలుకాయలు కూడా కనీస ధర రూ.8 వేలు పడుతోందన్నారు. ధర పరంగా చూస్తే రైతుకు ఇది సంతోషకరమే అయినా, వాతావరణ పరిస్థితులు, తెగుళ్లతో ఈ ఏడాది ఆశించిన మేర దిగుబడులు రాలేదని, మరికొన్ని రోజల్లో ఎగుమతులు మొదలైతే ధరలు ఇంకా పెరిగే పరిస్థితి కూడా ఉందన్నారు. రోజురోజుకు ధర పెరుగుతూ ఉండడంతో సగటున నిత్యం ఏభైవేల బస్తాల మిర్చి మార్కెట్‌కు వస్తోంది.

ఖమ్మంలో పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు వరంగల్‌లో మాత్రం మార్కెట్‌ మాయాజాలంతో రైతులు ఆగ్రహిస్తున్నారు. వరంగల్‌ మార్కెట్‌కు కూడా నిత్యం ముప్పై వేల బస్తాల సరకు వస్తుంటుంది. ఇక్కడ మాత్రం వ్యాపారులు, అడ్తీదారులు సిండికేట్‌గా మారి ధరను పెరగకుండా కృత్రిమంగా నియంత్రిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్కనే ఉన్న ఖమ్మంలో సగటున 15 వేలు రేటు పడుతుండగా, వరంగల్‌లో మాత్రం జెండా పాట రూ.17,200 గా ఫిక్స్‌ చేసి, రెగ్యులర్ రేటు మాత్రం ఎంత నాణ్యత ఉన్నా ఏదో ఒక వంక చూపుతూ రూ.7 వేల నుంచి 13 వేలకు మించకుండా రైతులను దోచుకుంటున్నారని అన్నదాతలు ఆక్రోశిస్తున్నారు.

Chilli

Chilli

దీంతో నిత్యం ఇక్కడి యార్డులో రైతులు ఆందోళనలకు దిగుతున్న దాఖలాలున్నాయి. సోమవారం నాడు ధరను మరీ తగ్గించడంతో రైతులు ఆగ్రహించారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి తమకు ధర రాకుండా చేస్తున్నారంటూ యార్డు ఎదుట ఆందోళనకు దిగారు. ఒకే రకం నాణ్యత ఉన్న మిర్చి పంటకు ఏకంగా ఒక్కో క్వింటాలుకు రూ.6 వేలకు పైగా ధరలో వ్యత్యాసం ఉండడం ఏంటని వరంగల్‌ రైతులు ప్రశ్నిస్తున్నారు. ఏడాదంతా కష్టపడి, ప్రకృతి ప్రకోపాలకు ఎదురీది మార్కెట్‌కు వస్తే ఇలా తమను దోపిడీ చేయడం సరికాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిత్యం మార్కెట్‌లో నిఘా ఏర్పాటు చేసి తమకు నాణ్యత పరంగా న్యాయంగా గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Read Also: కుండీలో… పచ్చని మిర్చి

Leave Your Comments

Success Story: మినీ ట్రాక్టర్ తయారీతో స్ఫూర్తిగా నిలిచిన కర్నూలు రైతు

Previous article

Rythu Bandhu: ఆన్లైన్లో రైతు వారిగా పంటల సాగు విస్తీర్ణం

Next article

You may also like