. చట్టాలకు పదును పెడుతున్న తెలంగాణ వ్యవసాయశాఖ
. అమాయక రైతులకు అంటగడుతున్న దళారులు
. రైతుల ఉసురు పోసుకుంటున్న అక్రమార్కులు
. ప్రధానంగా పత్తి, మిర్చి, సోయా, కంది విత్తనాల్లో కల్తీ
వ్యవసాయంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా కల్తీ విత్తనాల విషయంలో ఉపేక్షించేది లేదన్నారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. పత్తి రైతులకు అందించే విత్తనాలు నాణ్యంగా ఉండాలని.. కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతుల సమస్యలపై హైదరాబాద్ లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న మంత్రి పత్తి పంట మరియు కల్తీ విధానాలపై మాట్లాడారు. వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం ప్రధాన రంగంగా గుర్తించిందని, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తే దాని అనుబంధ రంగాలు బలోపేతమై రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని విత్తనోత్పత్తిలో జాతీయ, అంతర్జాతీయంగా మనకున్న ఖ్యాతి ఇనుమడించేలా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. పత్తి రైతుకు నాణ్యమైన విత్తనం అందించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో దాదాపు 35 వేల ఎకరాలలో పత్తి విత్తనోత్పత్తి జరుగుతోందని తెలిపారు. రాబోయే కాలంలో తెలంగాణలో పత్తి సాగు విస్తీర్ణం మరింత పెరగాలని సూచించారు. ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా లేని విత్తనాలను పశువులకు దాణా కింద మార్చి వాడుకోవాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు, విత్తన కంపెనీల ప్రతినిధులు, విత్తనోత్పత్తి రైతులు పాల్గొన్నారు.
#MinisterNiranjanReddy #CottonSeedProduction #agriculturenews #eruvaaka