PJTSAU : ప్రస్తుత విద్యా సంవత్సరం( 2024- 25) లో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రత్యేక కోటా కింద అదనంగా 200 సీట్లను బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సులో పెంచుతున్నట్లు ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన ఉపకులపతి ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య ప్రకటించారు. ప్రస్తుతం సాధారణ కేటగిరీలో 615 సీట్లు, ప్రత్యేక ఫీజుతో సుమారు 227 సీట్లు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరంలో అదనంగా పెంచిన ఈ 200 సీట్లని ఈ కౌన్సిలింగ్ ద్వారానే భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.
భారీగా తగ్గిన ఫీజులు:
ప్రస్తుతం ప్రత్యేక కోటాలో ఉన్న బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సుకు నాలుగు సంవత్సరాలకి కలిపి మొత్తం పది లక్షల రూపాయలు ఫీజు ఉండగా, దానిని 5 లక్షల రూపాయలకు తగ్గించినట్లు ఆయన తెలిపారు. అలాగే ప్రవేశ సమయంలో ఒకేసారి మూడు లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉండగా.. దానిని తగ్గించామని రూ.65000 మాత్రమే చెల్లించే విధంగా నిర్ణయం తీసుకున్నామని, తద్వారా విద్యార్థులకు వెసులుబాటు కల్పించామని వివరించారు . ఇప్పటివరకు సాధారణ సీట్ల ప్రవేశాల కోసం మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తయింది. విద్యార్థుల నుంచి ముఖ్యంగా గ్రామీణ విద్యార్థుల నుంచి అనూహ్యంగా డిమాండ్ పెరగడాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
గుర్తింపు లేని ప్రైవేటు సంస్థల్లో చేరొద్దు:
వ్యవసాయ విద్యకు పెరుగుతున్న డిమాండ్ ను ఆసరాగా తీసుకొని సాంకేతికపరమైన గుర్తింపులేని కొన్ని ప్రైవేటు సంస్థలు లక్షలకు లక్షల రూపాయలు ఫీజులు పెట్టి లేనిపోని మాయమాటలు చెప్పి విద్యార్థులను ఆకర్షిస్తున్నారని, వ్యవసాయ డిగ్రీ కోర్సును నడపడానికి కావాల్సిన కనీస వసతులు, సిబ్బంది కూడా లేకపోయినా కొన్ని ప్రైవేటు సంస్థలు వ్యవసాయ విద్యకు పెరుగుతున్న డిమాండ్ ను ఒక వ్యాపారంగా మార్చుకుని దోపిడీకి పాల్పడుతున్నారని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులని వారి తల్లిదండ్రులు ఇలాంటి గుర్తింపు లేని ప్రైవేటు సంస్థలలో చేర్చి విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేయవద్దని ప్రొఫెసర్ జానయ్య సూచించారు.
- రాష్ట్ర ప్రభుత్వ అవసరాలను, విద్యార్థుల్లో పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని అదనంగా సీట్లు పెంచాలని ఈరోజు ( అక్టోబర్ 21 న ) జరిగిన సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న దృష్ట్యా నైపుణ్యంతో కూడిన వ్యవసాయ పట్టభద్రుల సంఖ్య గణనీయంగా అవసరం పడనుంది.
- రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ప్రవేశపెడుతున్న వివిధ కోర్సులతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలకి సంబంధించిన స్వల్పకాలిక కోర్సులను కూడా రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రవేశపెట్టనున్నట్లు ప్రొఫెసర్ జానయ్య తెలిపారు.
- రాష్ట్రంలో ప్రస్తుతం వ్యవసాయ కళాశాలలు లేని నిజామాబాద్, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో కూడా నూతనంగా వ్యవసాయ కళాశాలలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు ఉపకులపతి తెలిపారు. అదనంగా పెంచుతున్న సీట్ల వివరాలను యూనివర్సిటీ వెబ్ సైట్ లో రెండు, మూడు రోజుల్లో ఉంచనున్నట్లు వివరించారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఉపకులపతి ప్రొఫెసర్ జానయ్య సూచించారు.
Leave Your Comments