Mango మామిడికాయల సీజన్ వచ్చేస్తున్నది. ఇప్పుడిప్పుడే మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. అయితే, పుణెలోని ఏపీఎంసీ మార్కెట్‌లో జరిగిన తొలి వేలంలో అల్ఫోన్సో రకం మామిడిపండ్లు అత్యధిక ధర పలికింది.
ఓ వ్యాపారి అల్ఫోన్సో మామిడి పండ్ల బుట్టను రూ.31 వేలకు కొనుగోలు చేయడంతో కొత్త రికార్డు నమోదైంది. 50 ఏండ్లలో ఇదే అత్యంత ఖరీదైన కొనుగోలు అని వ్యాపారులు చెప్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతున్నది. ఇందులో మామిడికాయల బుట్టకు పూలదండల వేసి వ్యాపారం బాగా సాగాలని వ్యాపారులు ప్రార్థిస్తూ కనిపించారు.
మామిడి పండ్ల వ్యాపారులకు బిడ్డింగ్ చాలా ముఖ్యం. మార్కెట్‌లోకి లాట్ రాగానే ఈ విధంగా వేలం వేస్తామని డబ్బాను కొనుగోలు చేసిన వ్యాపారి ఒకరు తెలిపారు. వీటిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీ పడతారు. మొదటి బుట్ట పండ్లను కొనుగోలు చేయడం వల్ల సీజన్ అంతా బాగా వ్యాపారం జరుగుతుందని వ్యాపారులు భావిస్తుంటారు. ఈ ఏడాది అల్ఫోన్సో వేలం రూ.5,000 నుంచి ప్రారంభమై ఒక్కో క్రేట్ రూ.31,000 కు చేరుకోవడం విశేషం.
అల్ఫోన్సో మామిడి ప్రత్యేకతలు
అల్ఫోన్సోను ‘కింగ్ ఆఫ్ మ్యాంగో’ అని కూడా పిలుస్తారు. ఇది మామిడి పండ్లలో ఉత్తమమైనది, రుచికరమైనది. ఇతర మామిడి పండ్ల కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మహారాష్ట్ర, కర్నాటక, గుజరాత్‌లలో ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఒక్క మహారాష్ట్ర నుంచే ఏటా దాదాపు 13,000 మెట్రిక్ టన్నుల అల్ఫోన్సో మామిడిపండ్లు ఎగుమతి అవుతాయి. వీటి బరువు 250 గ్రాముల నుంచి 300 గ్రాముల వరకు ఉండి.. వారం రోజుల వరకు పాడవకుండా ఉండడం దీని ప్రత్యేకత.
ఈ రకం మామిడి పండ్లు తొలుత పోర్చుగీస్‌లో ఉత్పత్తి అయ్యాయి. ఈ మామిడిపండ్లకు ‘అల్ఫోన్సో డీ అల్బుకెర్కీ’ అనే సైనిక నిపుణుడి గౌరవార్థం అల్ఫోన్సో అని పేరు పెట్టారు. అల్ఫోన్సో డీ అల్బుకెర్కీ భారతదేశంలో పోర్చుగీస్ కాలనీని స్థాపించిన వ్యక్తిగా చరిత్రలో నిలిచారు.