ఆంధ్రప్రదేశ్వార్తలు

Mango cultivation: ముందస్తు సస్యరక్షణతో మామిడితో అధిక దిగుబడులు

0

Mango వేసవిలో మెట్ట రైతులకు ప్రధాన ఆదాయం మామిడి నుంచే వస్తుంది. ప్రధానంగా రూరల్‌ జిల్లాతో పాటు సెమీ అర్బన్‌గా అభివృద్ధి చెందుతున్న పెందుర్తి నియోజకవర్గంలో ఎక్కువగా సబ్బవరం, పరవాడ రైతులకు మామిడే ప్రధాన ఆదాయ వనరు.

మామిడి ఉత్పత్తిలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నా ఆదాయం అంతంత మాత్రమేనని పలువురు రైతులు వాపోతున్నారు. దీనికి ప్రధాన కారణం మామిడి పూత దశలో రైతులు సరైన సస్యరక్షణ చర్యలు తీసుకోకపోవడమేనని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఎక్కువ పెట్టుబడులు పెట్టడం, సరైన సస్యరక్షణ చర్యలు తీసుకోకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టాలు చవిచూస్తుంటార ని అంటున్నారు. మామిడి ఎక్కువగా పూత, పిందె దశ మాసాలు జనవరి, ఫిబ్రవరి మాత్రమే. ఈ నెలల్లో రైతులు సరైన సస్యరక్షణ చర్యలు తీసుకుంటే అత్యుత్తమ ఫలితాలు సాధించి, లాభాల బాట పడతారని జిల్లా ఉద్యాన శాఖ అధికారి జి.రాధిక తెలిపారు. పెందుర్తి నియోజకవర్గంలో మామిడి తోటలు ప్రస్తుతం పూత దశలో ఉన్నాయి. గతేడాది కూడా పూత బాగా వచ్చినప్పటికీ, వాతావరణం అనుకూలించకపోవడంతో దిగుబడులు ఆశించినంతగా రాలేదు. ఈ ఏడాది బాగా వచ్చిన పూతను కాపాడుకునేందుకు ఫిబ్రవరి, మార్చిలో కూడా తీసుకునే జాగ్రత్తలతో రైతులు ఆశించిన ఫలితాలు సాధించవచ్చు.

తీసుకోవలసిన జాగ్రత్తలు

  • పూత ఏర్పడే దశలో ఫార్ములా-4 (సూక్ష్మ పోషక మిశ్రమం)ను లీటరు నీటికి 3 గ్రాములు చొప్పున కలిపి పూత బాగా తడిసేలా పిచికారీ చేసినట్టయితే పూత బాగా నిలుస్తుంది.
  • పూత పిందెగా మారే దశలో బోరాక్స్‌ పొడి ఒక లీటరు నీటికి 2 గ్రాములు చొప్పున కలిపి పిచికారీ చేస్తే మంచి పిందె కట్టడానికి దోహదపడుతుంది.
  • పూతంతా ఒకేసారి రావడానికి, అలాగే పిందెగా మారడానికి0.45(మల్టీ కె పొటాషియం)ను ఒక లీటరు నీటికి 10 గ్రాములు చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
  • పిందె కట్టిన తోటల్లో పూత, పిందె రాలకుండా ప్లానోసిక్స్‌ 2 ఎమ్‌ఎల్‌ చొప్పున 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.
  • తోటలు పూర్తిగా పూత మీద ఉన్నప్పుడు ఎక్కువ నీటిని ఇవ్వకూడదు. దీని వల్ల పూత అధికంగా రాలిపోతుంది. పిందె కట్టిన తరువాత తేలికపాటి తడుపులను ఇవ్వవచ్చు. కాయ పరిమాణం, నాణ్యత పెరగడానికి0.45 అనే ఎరువు బాగా పిచికారీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

పూత దశలో సస్యరక్షణ చర్యలు

మామిడి పూత దశలో ఉన్నప్పుడు అనేక రకాల పురుగులు ఆశిస్తాయి. వీటిలో తేనె మంచు పురుగులు, తామర పురుగులు, లద్దె పురుగులు, పిండినల్లి ప్రధానమైనవి. అయితే తోటలు పూర్తిగా పూత మీద ఉన్నప్పుడు ఎటువంటి పురుగు మందులు పిచికారీ చేయకపోవడమే ఉత్తమం.

ఈ కాలంలో పురుగు మందులు పిచికారీ చేయడం వల్ల సంపర్కానికి దోహదపడే మిత్ర పురుగులు చనిపోతాయి. కాబట్టి పిందె కట్టకుండా పూత రాలిపోతుంది. అందువల్ల సస్యరక్షణ పురుగు మందులన్నీ పూత బఠాణీ గింజ సైజు పిందె కట్టిన తరువాత మాత్రమే పిచికారీ చేయాలి. కాగా రసం పీల్చు పురుగుల నివారణకు ఇమిడాక్లోప్రిడ్‌ 1 మిల్లీ లీటరు లేదా, ఫిప్రోనిల్‌ 2 మిల్లీ లీటర్లు, లేదా ప్రొఫినోఫాస్‌ 2 మిల్లీ లీటర్లు, అలాగే కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ 3 గ్రాములు చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పొగాకు లద్దె పురుగు వంటి ఆకులను తినే పురుగుల నివారణకు క్లోరీఫైరీఫాస్‌ 2 మిల్లీ లీటర్లు లేదా ఇమామెక్టిన్‌ బెంజోయేట్‌ 1 గ్రాము, అలాగే మాంకోజెల్‌ 2 గ్రాములు చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే, పురుగుల బారి నుంచి తోటలను కాపాడుకోవచ్చు. తోటలు పూత దశలో ఉన్నప్పుడు మాత్రం సహజమైన సస్యరక్షణ చర్యలైన నీలం రంగు జిగురు అట్టలను అక్కడక్కడా చెట్ల మొదళ్లుకు కట్టడం, లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేయడం, తవుడు, బెల్లం, మోనోక్రోటోఫాస్‌ మందుతో ఎర ఉండలను తయారు చేసి మొదళ్లలో చల్లడం వంటి చర్యల ద్వారా మాత్రమే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. రైతులు ఈ జాగ్రత్తలు పాటిస్తే మామిడిలో నాణ్యమైన అధిక దిగుబడులను సాధించవచ్చు..

Leave Your Comments

Coconut Cultivation: కొబ్బరి సాగు లో ఎరువుల యాజమాన్యం

Previous article

Gypsum: వ్యవసాయంలో జిప్సం పాత్ర

Next article

You may also like