Paddy Procurement: ఉల్లి, పత్తి, సోయాబీన్ మరియు ద్రాక్ష ఉత్పత్తికి మహారాష్ట్ర ప్రసిద్ధి చెందింది. అయితే ఈ రోజుల్లో కనీస మద్దతు ధరకు వరి సేకరణ ఊహించని విధంగా పెరుగుతోంది. ఇక్కడి రైతులు 2018-19 సంవత్సరంలో రూ.1504 కోట్ల విలువైన వరిని ఎంఎస్‌పికి విక్రయించగా, 2019-20లో రూ.3164 కోట్లకు, 2020-21లో రూ.3547 కోట్లకు చేరుకుంది. ఉత్పత్తి పెరుగుతోందని, అందుకే కొనుగోళ్లు కూడా పెరుగుతున్నాయని కొందరు వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. 2019-20లో రాష్ట్రంలో 28.97 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి జరిగింది. ఇది 2020-21లో 34.47 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది.
జాతీయ ప్రగతిశీల రైతుల సంఘం (ఆర్‌కెపిఎ) అధ్యక్షుడు బినోద్ ఆనంద్ మాట్లాడుతూ.. గోధుమలు మరియు వరి వంటి తక్కువ దిగుబడినిచ్చే పంటల ఉత్పత్తిలో రైతులను నిమగ్నం చేయడానికి ఇది సమయం కాదని అన్నారు. రైతులకు తక్కువ ధరకే ఎక్కువ ధర లభించేలా ఉద్యానవన పంటలు, ఇతర పంటలపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైంది. వరి వేయడం ద్వారా రైతులకు నష్టం వాటిల్లుతుందని, మహారాష్ట్ర ప్రభుత్వం వాణిజ్య పంటలకు బదులు వరి పంటకు ఎందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందో అర్థం కావడం లేదన్నారు ఆయన.
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) ప్రకారం.. 2018-19లో మహారాష్ట్రలో కనీస మద్దతు ధరలకు వరిని విక్రయించిన మొత్తం రైతుల సంఖ్య 2,69,148 కాగా, 2020-21లో అది 6,24,292కి పెరిగింది. 2018-19 సంవత్సరానికి ముందు ఇది చాలా తక్కువగా ఉంది. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2020-21లో మహారాష్ట్ర రైతులు వరిని విక్రయించడం ద్వారా మొత్తం రూ. 3547.32 కోట్లు పొందారు. ఇందులో అత్యధికంగా గోండియా జిల్లా రైతులు దక్కించుకున్నారు. ఇక్కడ రూ.1346.34 కోట్లు రైతుల ఖాతాలోకి వెళ్లాయి. గోండియా జిల్లాలో వరి ప్రధాన పంట. దీనిని రైస్ సిటీ ఆఫ్ మహారాష్ట్ర అని కూడా అంటారు.
భండారా జిల్లా రైతులకు1044.40 కోట్లు, గడ్చిలోరికి 549.06 కోట్లు, చంద్రాపూర్‌కు 223.42, నాగ్‌పూర్ ప్రజలకు 113.23 కోట్లు వచ్చాయి. ఈ విషయంలో రాయగడ, థానే, రత్నగిరి, సింధుదుర్గ్, పాల్ఘర్, నాసిక్, కొల్హాపూర్, పుణె, అహ్మద్‌నగర్, నాందేడ్ చాలా వెనుకబడి ఉన్నాయి. రెండేళ్ల క్రితం అంటే 2018-19లో పరిస్థితి పూర్తిగా భిన్నం. అప్పుడు గడ్చిలోరి రైతులు వరిని విక్రయించడం ద్వారా గరిష్టంగా రూ.709 కోట్లు పొందారు. 370 కోట్లతో చంద్రాపూర్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం వరిసాగు ద్వారా అత్యధికంగా ఆదాయం పొందుతున్న గోండియా జిల్లా రైతులకు అప్పట్లో రూ.269 కోట్లు మాత్రమే అందింది.