మూసధోరణికి స్వస్తిపలికి కూరగాయలు పండిస్తూ ఎక్కువగా లాభాలు ఆర్జిస్తున్నారు ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటకు చెందిన యువరైతు సంకూరి శంకర్. 19 సంవత్సరాలపాటు ఉపాధి కోసం సౌదీకి వెళ్లిన ఆయన గల్ఫ్ బాట వీడి వ్యవసాయంవైపు మళ్లారు. తనకున్న ఎకరం భూమిలో అరెకరం విస్తీర్ణంలో 2016 లో కూరగాయల సాగుకు శ్రీకారం చుట్టారు. మేలు జాతి విత్తనాలు వినియోగిస్తూ పందిరి సాగు విధానంలో బీర, కాకర, టమాట, చెర్రీ టమాటా, సొర, చిక్కుడు, మిరప, వంకాయ తదితర కూరగాయలు పండిస్తున్నారు. రాయితీపై లభించిన వంద స్తంభాల పందిరితోపాటు బిందుసేద్యం పరికరాలను అరెకరాకు విస్తీర్ణంలో అమర్చారు. కూరగాయల పంటకాలం పూర్తియ్యే దశకు చేరుకోగానే విరామం ఇవ్వకుండా మళ్లీ పంట చేతికందడానికి అనుగుణంగా 10 గంటల చొప్పున భూమిని రెండు విభాగాలుగా చేశారు. మల్చింగ్ పేపర్ ను కప్పుతూ పూర్తిగా సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండిస్తున్నారు. ఒకసారి విత్తనాలు వేస్తే మూడుమాసాల వరకు కూరగాయలు చేతికి అందుతుండగా మట్టికట్టలు వేయడం భూమిని చదును చేయడం తదితర పనులకు కూలీల ఖర్చు, పెట్టుబడి వ్యయం రూ.15 వేల వరకు చేస్తున్నారు. కూరగాయలను సమీప వారసంత లో విక్రయిస్తున్నారు. సీజన్ లో సగటున రూ. 30 వేలు ఆర్జిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం శంకర్ తోటలో బీర, కాకర, టమాటా, మిరప విరగకాశాయి. వీటి పంటకాలం పూర్తియ్యే దశకు చేరుకోగానే రెండోభాగంలో 10 గుంతల విస్తీర్ణం సాగుకు సిద్ధంగా ఉంది. శంకర్ తోటలో రకరకాల కూరగాయలు ఆకర్షణగా నిలుస్తున్నాయి. అరెకరం విస్తీర్ణంలో అక్కడక్కడా ఖాళీస్థలంలో కొలంబో కంది విత్తనాలు నాటారు. కిలో విత్తనాలు వేస్తే 90 కిలోల కందులు చేతికందాయని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ పంటకాలం మూడేళ్ల వరకు ఉంటుందని, ఒకసారి కోత కాగానే మొక్కల శాఖలను తుంచితే సరిపోతుందని తెలిపారు. తక్కువ నీటితో ఎక్కువ లాభాలు వచ్చే కూరగాయల సాగుపై అన్నదాతలు దృష్టి సారించాలి. నూతన పద్ధతులతో పెట్టుబడి ఖర్చులు తగ్గి లాభాలు పెరుగుతాయి.