జామ్ ని బ్రెడ్ కి రాసుకొని తింటే మహా రుచిగా ఉంటుంది. చాలా మందికి ఇది అల్పాహారం. బ్రెడ్డే కాదు ఇంకా చాలా ఆహార పదార్థాలతో జామ్ తినొచ్చు. ఇందుకు మార్కెట్లో చాలా రకాల జామ్ లు దొరుకుతాయి. కానీ మన రాష్ట్రంలోని లంబసింగి నుంచి వచ్చే జామ్ ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది అక్కడి రైతులు పండించిన స్ట్రాబెర్రీ నుంచి తయారు చేసినది. ఈ జామ్ మిగతా వాటికంటే సూపర్ టెస్ట్. మృదుఫలంగా పిలిచే స్టాబెర్రీ ని జామ్ లా జుర్రుకు తినొచ్చు. ఇదెలా సాధ్యమైందంటే విశాఖ జిల్లా చింతపల్లి మండలంలోని మన్యం గ్రామాలైన లంబసింగి, రాజుపాక గ్రామాల రైతులు స్ట్రాబెర్రీ పండించడంలో దిట్టలు. మూడేళ్ళుగా రికార్డు స్థాయిలో పంట దిగుబడి సాధిస్తున్నారు. లంబసింగి ప్రాంతాలకు వచ్చే పర్యాటకులకు స్ట్రాబెర్రీ పండ్లను విక్రయిస్తూ మంచి ఆదాయాన్ని గడిస్తున్నారు. కోవిడ్ కారణంగా గతేడాది లంబసింగి ప్రాంతానికి పర్యాటకుల రాక తగ్గింది. దీంతో స్ట్రాబెర్రీ విక్రయాలకు తీవ్ర అవరోధం కలిగింది. పండ్లను పారబోసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. భారీగా పెట్టుబడులు పెట్టిన రైతులు అయోమయంలోకి వెళ్లారు. ఈ విషయం వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ తోలేటి జానకి రామ్, పరిశోధన సంచాలకులు డాక్టర్ ఆర్ వీ ఎస్ కే రెడ్డి, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ విభాగ అధిపతి డాక్టర్ డి. వెంకటస్వామి దృష్టికి వచ్చింది. వారు స్ట్రాబెర్రీ రైతుల సమస్యకు పరిష్కారాన్ని కనుగొన్నారు. రైతులు పండించిన స్ట్రాబెర్రీలను వెంకట్రామన్నగూడెంలోని పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ విభాగానికి రప్పించారు. వాటిని ఇక్కడ సహజ విధానాలతో శుభ్రం చేయించి తాజా పండ్లకు వాణిజ్య హంగులు అద్ది ప్యాకింగ్ చేసి విక్రయించే ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ మిలిగిపోయిన పండ్లను గుజ్జుగా మార్చారు. ఆ గుజ్జును పంచదారతో మిశ్రమం చేసి జామ్ గా తయారు చేశారు. దానిని సీసాల్లో పోసి అందంగా ప్యాకింగ్ చేశారు. లంబసింగి రైతులు పండించిన తాజా స్ట్రాబెర్రీలను వినియోగించడంతో 250 గ్రాముల జామ్ బాటిల్ ధర రూ. 250 ధర పలికింది. అంటే కిలోకు రూ. వెయ్యి దక్కింది. ఎకరానికి 800 కేజీల స్ట్రాబెర్రీ పండ్ల దిగుబడి వస్తుంది. ఆ పండ్లను కిలో రూ. 150 చొప్పున విక్రయిస్తుంటారు. ఆ విధంగా పండ్లను నేరుగా విక్రయిస్తే రైతుకు రూ. 1,20,000 ఆదాయం లభిస్తుంది. కానీ ఆ పండ్ల నుంచి గుజ్జు తీస్తే 546కిలోలు వస్తుంది. దీనిని ప్రాసెసింగ్ చేసి 250 గ్రాముల చొప్పున బాటిల్ ప్యాకింగ్ చేయించారు. 2,025 బాటిల్స్ వచ్చాయి. రిటైల్ మార్కెట్లో 250 గ్రాముల స్ట్రాబెర్రీ జామ్ సీసా రూ. 250 పలుకుతోంది. రైతులు గుత్తుగా ఒక్కో సీసాను రూ. 75 చొప్పున విక్రయించగా రైతుకు రూ. 3,54,375 ఆదాయం లభించింది. సాగు తోపాటు రవాణా, ఇతర అన్నిరకాల ఖర్చులు కలిపి రూ. 1,35,000 అయినట్టు అంచనా వేశారు. ఖర్చులన్నీ పోను రైతుకు ఎకరానికి రూ. 2.20 లక్షల నికరాదాయం లభించినట్టు తేల్చారు. పండ్లగా విక్రయించడం కంటే జామ్ రూపంలో విక్రయిస్తే ఎకరానికి అదనంగా రూ. లక్ష వరకు అదనపు ఆదాయం వస్తుంది. పండ్లగా విక్రయించే సందర్భంలో అవి కుళ్లిపోయినా ధర తగ్గినా పండ్లు అమ్ముడుకాకపోయినా ఆ మేరకు రైతు నష్టపోతాడు. జామ్ చేయడం వల్ల ఒక్క పైసా కూడా నష్టం ఉండదు. పైగా ఇది 9 నెలలు నిల్వ ఉంటుంది.