Karonda Tree: తెలంగాణలో చాలా చోట్ల అడవి పందుల బెడద ఎక్కువగా ఉంది. ఆదిలాబాద్ ప్రాంతంలో వీటి బెడద మరీ ఎక్కువ.ఇవి కొండ ప్రాంతాల్లో, గ్రామాల శివార్లలోని పొదల్లో, ముఖ్యంగా అడవులకు దగ్గరగా ఉన్నగిరిజన ప్రాంతాల్లో నివసిస్తాయి.ఇవి అన్నిరకాల పంటలను ధ్వంసం చేస్తూ రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. వివిధ అంచనాల ప్రకారం పంటనష్టం సుమారు 15-20% వరకు ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలను అడవి పందుల బెడద కారణంగా పండించలేని పరిస్థితి కూడా ఉంది. కృషివిజ్ఞాన కేంద్రం, ఆదిలాబాద్ అడవి పందుల నుంచి పంటలను కాపాడడానికి వివిధ రకాల ధ్వనులు చేసే పరికరాలు రైతులకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా గిరిజన ఉపప్రణాళిక కింద వాక్కాయ మొక్కలు ఆదివాసి రైతులకు వారి పంట పొలాల్లో జీవ కంచెగా ఏర్పాటు చేసుకొని పంటలను కాపాడుకోవాలని ఇచ్చారు. వాక్కాయ చెట్టును ఆంగ్లంలో కరోండాగా పిలుస్తారు. ఇది ముళ్ల పొదలుగా సుమారు ఒక మీటర్ నుంచి ఒకటిన్నర మీటర్ల ఎత్తు పెరుగుతుంది. కరోండా అనేది సతత హరిత పొద. రెండు భాగాలుగా పొట్టి కాండం,బలమైన ముళ్ళతో ఉంటుంది. బలమైన ముళ్లపొద, కరువును తట్టుకొని వివిధ రకాల వాతావరణ పరిస్థితులు, నేలలో పెరుగుతుంది. వాక్కాయ మొక్కలను చేనుకు నాలుగు వైపులా కంచెలాగా నాటినట్లయితే పాడి పశువులు,మేకలు, గొర్రెలు, కోతులు, అడవి పందులు చేనులోకి దూరకుండా పటిష్టమైన జీవకంచేగా పొలాన్ని రక్షిస్తుంది.
మార్చి – ఏప్రిల్ మాసాలలో వాక్కాయ చెట్లు పూతకు వస్తాయి. పూలు కాయగా మారి పరిపక్వతకు రావడానికి సుమారు 120 నుంచి130 రోజుల సమయం పడుతుంది. ముఖ్యంగా ఆగస్టు మాసంలో చెట్లు ఎంతో రుచికరమైన, పోషక విలువలు కలిగిన పండ్లను అందిస్తాయి. ప్రతి కరోండా చెట్టు 4-5 కిలోల పండ్లను ఉత్పత్తి చేస్తుంది. పండ్లలో అధిక తేమ శాతం, చాలా మృదువైన గుజ్జు ఉండడం వల్ల నిల్వకాలం తక్కువగా ఉంటుంది. పండ్లు కోసిన వెంటనే వివిధ రకాల విలువ ఆధారిత ఉత్పత్తులు లేదా పండ్లను కోసి ఎండబెట్టినట్లయితే ఎక్కువ కాలం నిలువ చేసుకోవచ్చు. వాక్కాయ పండ్లలో ఎక్కువ మోతాదులో సూక్ష్మపోషకాలు, విటమిన్లు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, యాంటీఆక్సిడెంట్లు దొరుకుతాయి. కరోండా పండు రక్తస్రావ నివారిణి,యాంటీస్కార్బుటిక్, రక్తహీనతను అధిగమించడానికి, పైత్యానికి, చికిత్సగా సంప్రదాయ వైద్యంలో వాడినట్టు రుజువులు ఉన్నాయి. పండ్లలో యాంటీ మైక్రోబియల్,యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి.పాత గాయాలను శుభ్రం చేయడానికి దీని రసాన్ని ఉపయోగిస్తారు.వాక్కాయ పండ్లు తగిన మోతాదులో తినడం వల్ల ఆరోగ్యమైన పెరుగుదలతో పాటు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు తీసుకొచ్చిన ఈట్ రైట్ ఇండియా, ఫిట్ ఇండియా కార్యక్రమంలో కాలానుగుణంగా మీ ప్రాంతంలో లభించే వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పులను విరివిగా తింటే సరైన పోషణ లభించి దేశ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు అనే ఉద్దేశంతో “సహీ పోషణ్ దేశ్ రోషన్” అనే అంశాన్ని తెర ముందుకు తీసుకొచ్చారు. వాక్కాయ చెట్టు మెరుగైన పోషణ, ఆహార వైవిద్యం, చేనుకు జీవ కంచె, విలువ జోడిస్తే పోషకాహార భద్రత, జీవనోపాధి, పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది.
విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ:
వాక్కాయ పచ్చడి తయారీ: వాక్కాయ పచ్చడి తయారీ కోసం దోరగా పక్వానికి వచ్చిన పుల్లని వాక్కాయ పండ్లను ఎంచుకొని, వాటిని క్లోరినేటెడ్ నీటిలో శుభ్రంగా కడిగి, పొడిబట్టతో తేమ లేకుండా తుడవాలి. తరువాత వాక్కాయ పండ్లను నాలుగు ముక్కలుగా కట్ చేసి, లోన ఉన్న విత్తనాన్ని తీసివేయాలి. అలానే ఉంచి కట్ చేస్తే పచ్చడి వగరుగా ఉండే అవకాశం ఉంది.కట్ చేసిన ముక్కలను మరో గిన్నెలో తీసుకొని తగిన మోతాదులో ఉప్పు, కారంపొడి, మెంతుల పొడి, ఆవాల పొడి, పొట్టు తీసిన వెల్లుల్లి పాయాలను మిక్సీలో క్రష్ చేసి ముద్దచేసి, కొంచెం పళ్లి నూనె వేసి బాగా కలపాలి. మరో బాణీలో నూనె వేడి చేసి తాలింపు గింజలను వేయించాలి.చల్లారిన తాలింపు గింజలు,నూనెను పచ్చడి మిశ్రమానికి కలపాలి. తరువాత శుభ్రమైన గాజు సీసాలో గాని, ప్లాస్టిక్ కంటైనర్స్ లో గాని, స్టాండప్ పెట్- పాళీ ఇథైలిన్పౌ చెస్ లో ప్యాక్ చేయడం ద్వారా సుమారు 6-9 నెలల వరకు నిల్వ పచ్చడిగా తినవచ్చు.
పచ్చడి తయారీకయ్యే ఖర్చు వివరాలు:
100 కిలోల బ్యాచ్ కి కావాల్సిన పదార్ధాలు:45 కిలోల వాక్కాయ పండ్లకు కిలో రూ.40 చొప్పున రూ.1800, అయోడైజ్డ్ ఉప్పు కిలో 20 చొప్పున 15 కిలోలకు రూ.300, కారప్పొడి కిలో 250 చొప్పున 5 కిలోలకు రూ.1250, వంట నూనె కిలో 140 చొప్పున 20 కిలోలకు రూ. 2800 , ఆవాల పొడి కిలో 110 చొప్పున 5 కిలోలకు రూ.550, మెంతుల పొడి కిలో 125 చొప్పున 2.5 కిలోలకు రూ. 312.5, పొట్టుతీసిన వెల్లుల్లిపాయలు కిలో 250 చొప్పున 7.5 కిలోలకు రూ.1875 కలిపి మొత్తం వీటన్నిటికీ ఉత్పత్తి వ్యయం రూ.8887.5 అవుతుంది. ఈ సరుకుల ధరలలో వ్యత్యాసం ఉండే అవకాశం కూడా ఉంటుంది.
పచ్చడి తయారీలో తాలింపు పదార్థాల ఖర్చు:
300 గ్రా.ఎండిన ఎర్రటి మిరపకాయలకు రూ. 60, శనగపప్పు 250 గ్రాములకు 35, ఆవాలు 250 గ్రాములకు రూ.30, జిలకర 200 గ్రాములకు రూ. 50, కరివేపాకు 500 గ్రాములకు రూ.15 కలిపి ఉత్పత్తి వ్యయం రూ.190 అవుతుంది.
100 కిలోల పచ్చడి తయారీకి ఖర్చువివరాలు (రూ.లలో):
100 కిలోల ముడిపదార్థాల మొత్తం ఖర్చు: 8887 +190 = రూ. 9077.
కూలీల ఖర్చు (ఒక్కొక్కరికి రోజుకి రూ.150 రూపాయల చొప్పున 6 రోజులకు): రూ. 900
ప్యాకింగ్ ఖర్చు ( 200 ప్లాస్టిక్ కంటైనర్): రూ. 240.0
మొత్తం ఉత్పత్తి ఖర్చు: రూ. 10217
పచ్చడి అమ్మకం, లాభాల వివరాలు:
మొత్తం పచ్చడి కంటైనర్లు (500 గ్రా. పరిమాణము): 180
ఒక కంటైనర్(500 గ్రా.) కనీస అమ్మకపు ధర: రూ.120
మొత్తం 180 కంటైనర్ల అమ్మకపు విలువ: రూ. 21600
మొత్తం ఉత్పత్తి ఖర్చు : రూ.10217
నికర లాభం: 21600 -10217 = రూ.11383
ఖర్చు: ఆదాయం నిష్పత్తి ( సుమారు 45 కిలోల వాక్కాయ
పండ్లకు): 1:1.89
వాక్కాయ పండ్లు ఎండబెట్టడం:
శుభ్రంగా కడిగిన వాక్కాయ పండ్లను కోసి, వేడినీటిలో 30 సెకన్ల నుంచి ఒక నిమిషం వరకు ఉంచి, చల్లటి నీటిలో నుంచి తీసి ఎండబెట్టినట్లయితే మంచి రంగు, రుచితో ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఎండిన వాక్కాయ పండ్ల ముక్కలను వరుగులుగా వివిధ పప్పులు, కూరలు వండుకునే సమయంలో కలిపినట్లయితే మంచి పుల్లని రుచితోపాటు మంచి పోషక విలువలు మనకు దొరుకుతాయి.
మౌత్ ఫ్రెష్ నర్: ఎండిన వాక్కాయ ముక్కలను, మసాలాలతో కలిపితే వాటిని సహజమైన మౌత్ ఫ్రెష్ నర్ గా వాడుకోవచ్చు.
వాక్కాయ పండ్లతో డ్రై ఫ్రూట్ లడ్డు: పండ్లు ఎండిన తర్వాత పల్లీలు, నువ్వులు, బాదం, జీడిపప్పు, బెల్లంతో పాకం చేసి కలిపి ముద్దలాగా కట్టి వాక్కాయ పండ్ల డ్రై ఫ్రూట్ లడ్డూలు చేసుకోవచ్చు
బేకరీ ఉత్పత్తులు, రెడీమిక్స్:
మనం మార్కెట్లో చాలా రకాల బేకరీ ఉత్పత్తులు చిరుధాన్యాలతోనే కాకుండా వివిధ రకాల ధాన్యాలతో తయారుచేసి, వివిధ రకాల పండ్ల పొడి లేదా పండ్ల ముక్కలు కలిపి అమ్ముతున్నారు.వాక్కాయ పండ్లతో క్యాండీస్, మురబ్బా,
వాక్కాయ టూటీ ఫ్రూటీ,ఎండబెట్టిన వాక్కాయ వరుగులు వివిధ రకాల బేకరీ మిక్సర్ కు కలిపి కుకీస్, బ్రెడ్, కేక్స్,బిస్కెట్స్,పాన్ కేక్స్( దిబ్బ రొట్టెలు) రెడీమిక్స్ కూడా తయారు చేసుకోవచ్చు. దీనికి గోధుమపిండి, మొలకెత్తిన జొన్న పిండి లేదా రాగి పిండి, బెల్లం, బేకింగ్ పౌడర్ కలిపి అమ్మవచ్చు. ఈ రెడీ మిక్స్ కు నీళ్లు లేదా పాలు, తగినంత వెన్న కలిపి బేకింగ్ చేసినట్లయితే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన పోషక విలువలతో కూడిన ఆహారం మనకు దొరుకుతుంది.
వివిధ రకాల ఆహార ఉత్పత్తులు: వాక్కాయ పండ్లతో క్యాండీస్, మురబ్బా వివిధ రకాల శీతల పానీయాలు ముఖ్యంగా రెడీ టు డ్రింక్ బెవరేజెస్, స్క్వాష్, షర్బత్ మొదలైనవి తయారు చేసి తాగినట్లయితే ఆరోగ్యంతో పాటు మంచి పోషకాలు మన శరీరానికి అందుతాయి. వాక్కాయ బేవరేజస్, స్క్వాష్, షర్బత్ చేయడానికి జ్యూస్ తీసి ఫిల్టర్ చేసి, కేంద్ర ఆహార భద్రత ప్రమాణాల సంస్థ ప్రకారం తగిన మోతాదులో చక్కెర,
సిట్రిక్ యాసిడ్, ప్రిజర్వేటివ్స్ కలిపి పాశ్చరైజేషన్ చేసి వివిధ రకాల ఫ్లేవర్స్ కలిపి సీసా/ బాటిలింగ్/ప్యాకింగ్ చేసి అమ్మినట్లయితే మార్కెట్లో దొరికే సింథటిక్ శీతల పానీయాల కన్నా ఎంతో ఆరోగ్యకరమైనవి. నిమ్మ జ్యూస్, పచ్చి అల్లం జ్యూస్, పచ్చి పసుపు జ్యూస్ మొదలైన ఫిల్టర్ చేసిన వాక్కాయ జ్యూస్ కు కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాక్కాయ పండ్లతో ఫ్రూట్ బార్: వాక్కాయ పండ్ల గుజ్జు, పెక్టిన్, చక్కెర మొదలైనవి కలిపి మామిడి తాండ్రల్లాగా పరచాలి. ఎండిన తర్వాత బార్ షేపులో కట్ చేసి, ప్యాక్ చేసి అమ్మినట్లయితే ఇతరులకు ఆరోగ్యం ఇవ్వడంతో పాటు మనం ఆదాయాన్ని పొందవచ్చు.
వాక్కాయ పండ్లతో జామ్, జెల్లీ, ఫ్రూట్ చెట్ని: వాక్కాయ పండ్ల గుజ్జు తీసి, తగిన మోతాదులో చక్కెర,సిట్రిక్ యాసిడ్,పెక్టిన్ కలిపి వండినట్లయితే మనకు వాక్కాయ జామ్ తయారవుతుంది. పండ్ల చట్నీలాగా రుబ్బి దానికి తగిన మోతాదులో చక్కెర, మసాలాలు కలిపి వాక్కాయ చట్నీ తయారు చేయవచ్చు. నేటి బాలలే రేపటి పౌరులు కావున చిన్న పిల్లలకు, కిశోర బాలికలకు, ఎదిగే పిల్లలకు స్థానికంగా కాలానుగుణంగా దొరికే వివిధ పోషక విలువలు కలిగిన
వాక్కాయ వంటి పండ్లతో తయారుచేసిన వివిధ రకాల ఆహార పదార్థాలను అందుబాటులోకి తీసుకురావాలి. తద్వారా మంచి పోషణ వైవిధ్యం అందించడం వల్ల భవిష్యత్తులో ఆరోగ్యమైన భారత్ ను నిర్మించడంలో మనమందరం
పాత్రులమవుతాం.
ఎ.పోశాద్రి, జి. శివ చరణ్, డి.మోహన్ దాస్, ఎం.సునీల్ కుమార్, కె.రాజశేఖర్,
వై. ప్రవీణ్ కుమార్,
కృషి విజ్ఞాన కేంద్రం,
ఆదిలాబాద్.
Also Read: Management of fertilizers in Cashew Crop: జీడీ మామిడిలో దిగుబడులు పెరగాలంటే..ఎరువుల కీలకం