ఎవిఎన్ ఇన్‌ఫ్లూఎంజా (బర్డ్ ఫ్లూ) అనేది వివిధ రకాల పక్షులను ప్రభావితం చేసే వైరస్ ద్వారా సంక్రమించే వ్యాధి. ఇది అన్ని రకాల కోళ్ళ జాతులు, పెరటి కోళ్లు, బాతులు, వలస పక్షులు (Poultry) మరియు అడవి పక్షులకు సోకుతుంది. ఇది ఆర్థోమిక్సోవైరిడే(Orthomyxoviridae)కుటుంబానికి చెందిన ఇన్ఫ్లుఎంజా–A వైరస్ కారణంగా సంభవిస్తుంది. ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా కోళ్లు, తెల్ల కోళ్లు, బాతులు వంటి పక్షులకు తీవ్రమైన నష్టం కలిగిస్తుంది. ఈ వ్యాధి మానవులకు వ్యాపించే అవకాశం తక్కువగానే ఉన్నా, ఒకసారి వ్యాప్తి చెందితే అది తీవ్రమైన ప్రభావాన్ని చూపించగలదు. కాబట్టి, ప్రజల్లో అవగాహన పెంచడం అత్యవసరం.
చారిత్రక నేపథ్యం
మొదటిసారిగా 1959లో అత్యంత ప్రమాదకరమైన పక్షుల జబ్బు గా (HPAI) గుర్తించబడింది. అయితే, 1996లో చైనాలో H5N1 అనే రకం వైరస్ కోళ్ల మందలలో స్థిరంగా వ్యాపించడం ప్రారంభమైంది. ఈ వైరస్‌ను అదుపు చేయడానికి కోట్లాది పక్షులను తొలగించడం, టీకాల కార్యక్రమాలు వంటి ప్రయత్నాలు జరిగినప్పటికీ, తక్కువ ప్రమాదకరమైన వైరస్‌లతో (new strains) కలిసి కొత్త రకాలుగా మారి, అడవి పక్షుల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఈ వ్యాధి చరిత్ర, దాని ప్రభావం మరియు ప్రస్తుత పరిస్థితిని తెలుసుకుందాం.
బర్డ్ ఫ్లూరకాల వర్గీకరణ
ఎవిఎన్ ఇంఫ్లూయెంజా వైరస్‌లను వాటి తీవ్రతను బట్టి రెండు రకాలుగా వర్గీకరించవచ్చు:
- తక్కువ ప్రమాదకరమైన ఎవిఎన్ ఇంఫ్లూయెంజా (Low Pathogenic Avian Influenza – LPAI)
- తేలికపాటి శ్వాసకోశ సమస్యలు కలిగించగలదు.
- అడవి పక్షుల్లో సాధారణంగా కనపడుతుంది, కానీ కొన్ని సందర్భాల్లో పెరటి కోళ్లకు కూడా వ్యాపించగలదు.
- కొన్ని సందర్భాల్లో, ఈ వైరస్ ఎక్కువ ప్రమాదకరమైన రూపానికి మారగలదు.
- ఎక్కువ ప్రమాదకరమైన ఎవిఎన్ ఇంఫ్లూయెంజా (Highly Pathogenic Avian Influenza – HPAI)
- ఇది కోళ్లు, ఇతర పక్షుల్లో అత్యధిక మరణాలను కలిగించే ప్రమాదకరమైన వ్యాధి.
- ముఖ్యమైన వైరస్ శ్రేణులు: H5N1, H7N9, H5N8
- కొన్ని రకాల వైరస్‌లు మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉంది (అందువలన జూనోటిక్ ప్రమాదం కింద పరిగణించ వచ్చు).
బర్డ్ ఫ్లూవ్యాప్తి విధానం
ఈ వ్యాధి నేరుగా మరియు పరోక్షంగా వ్యాపిస్తుంది:
- నేరుగా వ్యాప్తి:
- వైరస్ ఉన్న పక్షుల లాలాజలం, ముక్కు కారటం, మలం ద్వారా వ్యాపిస్తుంది.
- పరోక్షంగా వ్యాప్తి:
- మురికి నీరు, ఆహారం, పక్షుల సదుపాయాలు, పనివస్తువులు ద్వారా వ్యాధి సోకుతుంది.
- గాలి ద్వారా వ్యాప్తి:
- కోళ్ల షెడ్డులో గాలి ద్వారా వైరస్ వ్యాపించే అవకాశం ఉంది.
- మనుషులకు వ్యాపించే అవకాశం:
- కొన్ని రకాల వైరస్‌లు ఆహారం, దుస్తులు, పని చేసే ఉపకరణాలు, పక్షుల ద్వారా మనుషులకు సోకవచ్చు.
వలస పక్షులు మరియు పెరటి కోళ్ళలో వ్యాప్తి
జలపక్షులు, బాతులు ఈ వైరస్‌ను ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేశాయి. ముఖ్యంగా H5 & H7 రకాల వైరస్‌లు అత్యంత ప్రమాదకరమైనవి. 2014లో ఉత్తర అమెరికాకు చేరి ప్రస్తుతం దక్షిణ అమెరికా, అంటార్కిటికా వరకు వ్యాపించి లక్షలాది పక్షుల మరణానికి కారణమవుతోంది.
ఎవిఎన్ ఇన్ఫ్లుయెంజా రకాల వర్గీకరణ
- తక్కువ ప్రమాదకరమైన ఎవిఎన్ ఇన్ఫ్లూయెంజా (LPAI) – తేలికపాటి లక్షణాలు కలిగి ఉంటుంది, కానీ కొన్నిసార్లు ప్రమాదకరమైన రూపానికి మారగలదు.
- ఎక్కువ ప్రమాదకరమైన ఎవిఎన్ ఇన్ఫ్లూయెంజా (HPAI) – H5N1, H7N9 వంటి వైరస్‌లు పక్షుల్లో అధిక మరణాలకు కారణమవుతాయి.
పక్షుల్లో బర్డ్ ఫ్లూ లక్షణాలు
వైరస్ తీవ్రతను బట్టి పక్షుల్లో వివిధ లక్షణాలు కనిపిస్తాయి:
- శ్వాసకోశ సమస్యలు (తుమ్ములు, దగ్గు, ముక్కు కారడం)
- తల, మొండెం, గొడ్డలు ఎర్రబడటం, వాపు
- గుడ్డు ఉత్పత్తి తగ్గిపోవడం
- మలబద్దకం, నీరు వంటివి తాగకపోవడం
- నాడీ సంబంధ సమస్యలు (తల వంగి పోవడం, కాళ్లు వంగి పోవడం)
- తీవ్రమైన సందర్భాల్లో అతివేగంగా మరణం సంభవించవచ్చు.
బర్డ్ ఫ్లూ నిర్ధారణ విధానాలు
- ఆరోగ్య పరిస్థితే ఆధారంగా: వ్యాధి లక్షణాలను గమనించి ప్రాథమిక నిర్ధారణ చేయవచ్చు.
- ప్రయోగశాల పరీక్షలు:
- RT-PCR: వైరస్ జన్యు పదార్థాన్ని గుర్తించడానికి.
- వైరస్ పెంపకం: కోడి గుడ్డు లేదా సెల్ కల్చర్ ఉపయోగించి వైరస్‌ను గుర్తించడం.
- సెరోలాజికల్ పరీక్షలు: రక్త నమూనాల్లో వైరస్ యాంటీబాడీలు పరీక్షించడం (ELISA, హెమగ్గులుటినేషన్ టెస్ట్).
మనుషులపై ప్రభావం
1997లో హాంకాంగ్‌లో మొదటిసారిగా పక్షుల నుండి మనుషులకు H5N1 వైరస్ సోకినట్లు నమోదైంది. 2000ల ప్రారంభంలో ఆగ్నేయాసియాలో వచ్చిన కేసులలో మరణాల శాతం చాలా ఎక్కువగా ఉంది – థాయ్‌లాండ్‌లో 71%, వియత్నాంలో 80%, కంబోడియాలో 100%. మరింత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే చనిపోయిన వారిలో చాలామంది యువకులు, ఆరోగ్యవంతులుఉన్నారు.
మనుషులలో వ్యాధి లక్షణాలు మరియు రోగనిర్ధారణ
బర్డ్ ఫ్లూ లక్షణాలలో జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, కండరాల నొప్పి మరియు శ్వాసకోశ సమస్యలు ఉంటాయి. రోగనిర్ధారణ కోసం రక్త పరీక్షలు మరియు శ్వాసనాళ స్రావాల పరీక్షలు జరుగుతాయి. ప్రస్తుతంఆంధ్రప్రదేశ్లోసంక్రమిత ప్రాంతాల్లో ఈ పరీక్షలు జరుపుతున్నారు.
- అధిక జ్వరం
- విరేచనాలు
- శ్వాసకోశ సమస్యలు
- కొన్ని సందర్భాలలో కంటి వాపు
- తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గడం
- రక్తంలో ప్లేట్‌లెట్ల తగ్గుదల
- కాలేయ ఎన్‌జైమ్‌ల పెరుగుదల.
మనుషులకు బర్డ్ ఫ్లూ ప్రమాదమా?
ప్రస్తుతం మానవులకు ఈ వ్యాధి సోకే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ, దాదాపు 50% మరణాల రేటు కలిగిన హెచ్5ఎన్1 స్ట్రెయిన్ కారణంగా, ఇది అత్యంత ప్రమాదకరమైన వ్యాధిగా పరిగణించబడుతోంది. మానవులకు సోకితే తీవ్ర జ్వరము, శ్వాసకోశ సమస్యలు, న్యూమోనియా వంటి లక్షణాలు కనిపించవచ్చు.
- H5N1 & H7N9 వంటి వైరస్‌లు కొన్ని సందర్భాల్లో మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉంది.
- సహజంగా కోళ్ల మాంసం తినడం వల్ల వైరస్ సోకదు, కానీ సరైన ఉడకబెట్టని లేదా కాల్చని మాంసం తినడం ప్రమాదకరం.
- మనిషి నుండి మనిషికి వ్యాపించే అవకాశం తక్కువ, కానీ గణనీయమైన వ్యాప్తి అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి అయ్యే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ ప్రభావం
భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఈ వ్యాధి బయటపడింది. ఇటీవల, 2024 ఫిబ్రవరిలో SPSR నెల్లూరు జిల్లాలో, అలాగే 2025 ఫిబ్రవరిలో తూర్పుగోదావరి మరియు పశ్చిమగోదావరి జిల్లాల్లో H5N1 వైరస్ ఉనికి నిర్ధారణ అయింది. ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూ పెద్ద ఎత్తున వ్యాపించడంతో కోడి పెంపక పరిశ్రమకు తీవ్రనష్టం కలిగింది. ముఖ్యంగా తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కోళ్ల మరణాలు భారీగా నమోదయ్యాయి. జనవరి 13న మొదలైన ఈ మరణాలు 5 లక్షల వరకు చేరాయి. ఈ విపత్తు నేపథ్యంలో, తూర్పుగోదావరి జిల్లా కనూరు ప్రాంతంలో మృత కోళ్ల నుంచి నమూనాలను పరిశీలించగా హెచ్5ఎన్1 గుర్తించబడింది. దీని కారణంగా కనూరు ప్రాంతంలోని 75% కోళ్లను, గుడ్లను అంతమొందించారు. ప్రభుత్వం ఆ ప్రాంతంలోని షాపులను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు 10 కిలో మీటర్ల పరిధిలో వైద్యబృందాలను నియమించారు. ఈ పరిధిని “నిఘామండలి” గాప్రకటించారు.
ప్రజల ఆహారపు అలవాట్లపై ప్రభావం
ఈ మహమ్మారి కారణంగా చికెన్ ధరలు 40% తగ్గాయి. ఫిబ్రవరి 2న కిలో చికెన్ ధరలు రూ.280 ఉండగా, ప్రస్తుతం అది రూ.170కి పడిపోయింది. అయినప్పటికీ, వినియోగదారులు చికెన్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. దీని ఫలితంగా, ప్రజలు ప్రత్యామ్నాయ ప్రోటీన్మూలాల వైపు మళ్ళారు. ముఖ్యంగా రొయ్యలు, తున, వంజరం, కోడికప్ప, బొద్దె, క్రాబ్వంటి సముద్ర ఆహారానికి డిమాండ్ ఏర్పడింది.
రక్షణ చర్యలు – వైరస్ వ్యాప్తిని నిరోధించడం ఎలా ?
- కోళ్ల పరిశ్రమలో శుభ్రత నిబంధనలను కచ్చితంగా పాటించాలి.
- మృతకోళ్లు, వాటి ఉత్పత్తులను స్పృశించకూడదు.
- పూర్తిగా ఉడికించిన చికెన్, గుడ్లు తినాలి.
- ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ రోగ నిర్ధారణ చర్యలను చేపట్టాలి.
ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న ఎవిఎన్ ఇంఫ్లూయెంజా(బర్డ్ ఫ్లూ) నియంత్రణా చర్యలు—(ప్రభుత్వ చర్యలు మరియు నిబంధనలు)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బర్డ్ ఫ్లూ వ్యాప్తిని నిరోధించడానికి కఠినమైన నిబంధనలు మరియు చర్యలు తీసుకుంటోంది. జిల్లా కలెక్టర్లు, పశువైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారులు ఈ సంక్రమణను గంటల తరబడి పర్యవేక్షిస్తున్నారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని, భారత ప్రభుత్వ యాక్షన్ ప్లాన్ (2021) ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ క్రింది చర్యలు అమలు చేయబడుతున్నాయి.
వ్యాధిలేని (స్వచ్ఛమైన) ప్రాంతాల్లో తీసుకుంటున్న జాగ్రత్తలు
- పశువైద్య పరిశీలన (Surveillance)
✔ప్రతి రోజూ పక్షులను పరిశీలించడం మరియు మృతి పరిమాణాలను గమనించడం జిల్లా పశుసంవర్థక అధికారి(DAHO) లేదా సంబంధిత ప్రయోగశాలకు తక్షణమే సమాచారం అందించడం అమలు చేయబడుతోంది.
- రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ (RRTs)
✔వ్యాధి వ్యాప్తి ప్రాంతాల్లో అత్యవసర చర్యలు తీసుకునే ప్రత్యేక బృందాలు(RRTs) సిద్ధంగా ఉంచడం మరియు వీరికి తాజా శిక్షణ అందించడం అమలు చేయబడుతోంది.
- అవసరమైన పరికరాల నిల్వ (Stocking of Equipment)
✔PPE కిట్లు, బ్లీచింగ్ పౌడర్, ఫార్మాలిన్, సోడియం హైపోక్లోరైట్, నిమ్మ రసాయనం వంటి అవసరమైన రసాయనాలను ముందుగా నిల్వ చేయడం అమలు చేయబడుతోంది.
- వాణిజ్య కోళ్ల ఫార్ముల్లో అమలవుతున్న నియంత్రణ చర్యలు
✔బాహ్య వ్యక్తుల ప్రవేశాన్ని నియంత్రించడం
✔పని చేసే వ్యక్తులు శుభ్రంగా ఉండేలా పర్యవేక్షణ చేయడం
✔ఫార్మ్‌లో ప్రవేశద్వారంలో శానిటేషన్ ద్రావణాలను ఉంచడం
✔చనిపోయిన కోళ్లను సరైన విధంగా ఖననం/దహనం చేయడం
✔వ్యాధి ఉన్నప్పుడు 30 రోజుల పాటు కొత్త కోళ్లను పెంచకూడదనే నిబంధన అమలు చేయడం
- పెరటి కోళ్లలో ఉన్న కోళ్ల రైతులకు అమలు చేస్తున్న సూచనలు
✔కోళ్లను ఇంట్లోనే ఉంచి, ఇతర పక్షులతో కలిసేందుకు అనుమతించకూడదనే నియమం అమలు చేయబడుతోంది.
✔చెత్త మరియు మలాన్నిసరిగ్గా తొలగించేందుకు క్రమం తప్పకుండా చర్యలు తీసుకోవడం అమలు చేయబడుతోంది.
✔వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే సమాచారం అందించే విధానం అమలులో ఉంది.
- కోళ్ల మార్కెట్ లో మున్సిపల్ శాఖ తీసుకుంటున్న చర్యలు
✔కోళ్లను పట్టే, కోసే వ్యక్తులు గ్లోవ్స్, మాస్కులు ధరించాల్సిన నియమం అమలులో ఉంది.
✔మార్కెట్ ప్రాంతాల్లో ప్రతిరోజూ శుభ్రత పనులు చేపట్టడం అమలు చేయబడుతోంది.
✔పంజరాలను శుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక మార్గదర్శకాలు అమలు చేయబడుతున్నాయి.
✔ మార్కెట్ ప్రాంతాల్లో నాణ్యమైన డ్రైనేజీ సదుపాయాలను ఏర్పాటు చేయడం అమలు చేయబడుతోంది.
- వ్యాధి సోకిన ప్రాంతాల్లో (Outbreak Area) తీసుకుంటున్న నియంత్రణ చర్యలు జిల్లా కలెక్టర్/ మేజిస్ట్రేట్ తీసుకుంటున్న చర్యలు
✔వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే జిల్లా కలెక్టర్ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడం.
✔ఆరోగ్య, అటవీ, రెవెన్యూ, మున్సిపల్, పోలీసుశాఖలతో అత్యవసర సమావేశం నిర్వహించడం.
✔సర్వే ప్రదేశాలను గుర్తించి, 24 గంటల హెల్ప్‌లైన్ అందుబాటులో ఉంచడం అమలు చేయబడుతోంది.
- పశుసంవర్థక శాఖ అమలు చేస్తున్న చర్యలు
✔1కిమీ. చుట్టు పక్కల ప్రాంతాన్ని“ఇన్ఫెక్షన్జోన్”గా ప్రకటించడం అమలు చేయబడుతోంది.
✔1-10కిమీ వరకు సర్వేలైన్స్ ఏర్పాటుచేసి, నిఘా పెంచడం అమలు చేయబడుతోంది.
✔పౌల్ట్రీ ఉత్పత్తుల రవాణాను తక్షణమే నిలిపివేయడం అమలు చేయబడుతోంది.
✔పౌల్ట్రీ మార్కెట్లను తాత్కాలికంగా మూసివేయడం అమలు చేయబడుతోంది.
✔బాధిత ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడం అమలు చేయబడుతోంది.
- వ్యాధి సోకిన పక్షులను నిర్మూలించే చర్యలు (Culling & Disposal)
✔RRT బృందాలు PPE కిట్లు ధరించి, కోళ్లను నిర్మూలించడం అమలు చేయబడుతోంది.
✔చనిపోయిన కోళ్లు, గుడ్లు, మయం, ఆహారాన్ని సరైన గుంతల్లో పూడ్చి పెట్టడం అమలు చేయబడుతోంది.
✔నీటి ప్రవాహ ప్రాంతాలకు దగ్గరగా వ్యర్థాలను వేయకుండా నియంత్రణా చర్యలు తీసుకోవడం అమలు చేయబడుతోంది.
- వ్యాధిసోకిన ప్రదేశాల్లో శుభ్రపరిచే విధానం
✔ఫార్మ్గోడలు, నేల, పైకప్పును 3% కేల్షియం హైడ్రాక్సైడ్ ద్రావణంతో శుభ్రపరచడం అమలు చేయబడుతోంది.
✔ బ్లీచింగ్ సున్నం నీటితో ప్రదేశాలను శుభ్రం చేయడం అమలు చేయబడుతోంది.
✔కోళ్లపంజరాలు, వాహనాలను 2% సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో శుభ్రపరచడం అమలు చేయబడుతోంది.
✔నీటి నిల్వలను ఖాళీ చేసి, పర్మాంగనేట్ ద్రావణంతో శుభ్రపరచడం అమలు చేయబడుతోంది.
- పౌల్ట్రీ రైతులకు అమలు చేస్తున్న ముఖ్యమైన సూచనలు
✔ కోళ్లఫార్మ్ పూర్తిగా శుభ్రం అయిన తర్వాత మూడు నెలల వరకు కొత్త కోళ్లను పెంచకూడదనే నియమం అమలు చేయబడుతోంది.
✔వ్యాధి సోకిన ప్రదేశాల్లో పని చేసిన వ్యక్తులు తమ చేతులు, ముఖం కడగాలని అవగాహన కల్పించడం అమలు చేయబడుతోంది.
✔ H5N1 సోకిన వ్యక్తులు తక్షణమే డాక్టర్‌ను సంప్రదించాలని సూచనలు ఇవ్వడం అమలు చేయబడుతోంది.
✔ఇన్ఫెక్టెడ్ వాతావరణానికి గురైన అందరు వ్యక్తులు, చేతులు మరియు ముఖాన్ని సరిగ్గా కడగాలి మరియు బట్టలు మార్చుకోవాలి మరియు 4 రోజుల పాటు శరీర ఉష్ణోగ్రతను పరిశీలించాలి. అతను/ఆమె అధిక ఉష్ణోగ్రతను అభివృద్ధి చేస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
✔ఇన్ఫెక్టెడ్ పక్షులు/ఫార్మ్స్లో పనిచేసే వ్యక్తులు, వైద్యుని సలహాతో యాంటీ-ఫ్లూ మందులు (ఉదా. ఓసెల్టమివిర్- Tamiflu) తీసుకోవాలి.
✔సరిగ్గా ఉడికించిన చికెన్, గుడ్లు తినడం సురక్షితమని ప్రజలకు అవగాహన కల్పించడం అమలు చేయబడుతోంది.
ప్రజలు మరియు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
సాధారణ ప్రజలు బర్డ్ఫ్లూ నుండి రక్షించుకోవడానికి సంక్రమిత పక్షులను తాకకుండా ఉండాలి, మాంసం మరియు గుడ్లను బాగా ఉడికించి తినాలి మరియు వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. ప్రభుత్వం ప్రజలకు ఈ విషయంలో అవగాహన కల్పించడంలో కృషి చేస్తోంది. రైతులు పక్షులను శుభ్రంగా ఉంచడం, వ్యాధిలక్షణాలను గుర్తించడం మరియు వైద్యులతో సంప్రదించడం ద్వారా వ్యాధుల నియంత్రణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు.
ఆరోగ్యకరమైన మాంసం మరియు గుడ్లు తినగలమా?
మాంసం మరియు గుడ్లను బాగా ఉడికించి తినడం సురక్షితం. వైరస్ అధిక ఉష్ణోగ్రతలో నాశనం అవుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేష్లో కూడా ప్రభుత్వం ప్రజలకు ఈ విషయంలో స్పష్టత కల్పిస్తోంది.
కోడిమాంసం తినేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఎవిఎన్ ఇంఫ్లూయెంజా(బర్డ్ఫ్లూ) వైరస్ 70°C ఉష్ణోగ్రతలో 30 నిమిషాల పాటు వేడి చేస్తే పూర్తిగా నశిస్తుంది. కనుక సరిగ్గా ఉడికించిన లేదా కాల్చిన మాంసం మరియు గుడ్లు తినడం పూర్తిగా సురక్షితం. కోడి మాంసం తినేటప్పుడు పాటించాల్సిన నియమాలు
✔కనీసం 74°C (165°F) ఉష్ణోగ్రత వద్ద మాంసాన్ని పూర్తిగా ఉడికించాలి లేదా కాల్చాలి.
✔మాంసం లోపల గులాబీ రంగు లేకుండా పూర్తిగా ఉడికినదని నిర్ధారించుకోవాలి.
✔ఉడికించని లేదా హాఫ్బాయిల్డ్తీసు కోకూడదు.
✔చికెన్మాంసాన్ని ముడి గుడ్లు, తాజా కూరగాయలతో కలిపి ఉడికించకూడదు.
గుడ్లు తినేటప్పుడు పాటించాల్సిన నియమాలు
✔గుడ్లను కనీసం 70°C (158°F) ఉష్ణోగ్రత వద్ద 10-15 నిమిషాలు ఉడకించాలి.
✔సగం ఉడికించిన (హాఫ్బాయిల్డ్) గుడ్లు తినకూడదు.
✔పచ్చి గుడ్లు లేదా హాఫ్-బాయిల్డ్గును ఆహార పదార్థాల్లో ఉపయోగించకూడదు.
✔గుడ్లు ఉడికించిన తర్వాత వాటి పొట్టు తొలగించాక వెంటనే తినాలి.
✔అధిక ఉష్ణోగ్రతల వద్ద ఉడికించిన ఆహారం తినడం వల్ల H5N1 వంటివైరస్‌లు పూర్తిగా నశిస్తాయి.
బర్డ్ ఫ్లూ భవిష్యత్తు – నివారణ మార్గాలు
బర్డ్ఫ్లూ భవిష్యత్తులో కూడా ప్రమాదకరమైన స్థితిగా ఉండవచ్చు. దీనిని నివారించడానికి ప్రపంచ వ్యాప్తంగా కఠినమైన నిఘా మరియు నివారణా చర్యలు అవసరం. వ్యాక్సిన్ అభివృద్ధి మరియు ప్రజలల్లో అవగాహన పెంచడం కూడా ముఖ్యం. ప్రస్తుతం పక్షుల జబ్బవైరస్మార్పులకు లోనవుతూ, మానవులలో వ్యాప్తికి అనుకూలంగా మారే ప్రమాదం ఉంది.
1918 నాటి ఫ్లూ మహమ్మారి వంటి పరిస్థితి మళ్లీ రాకుండా ఉండటానికి:
– నిరంతర పర్యవేక్షణ
– వైరస్పరీక్షల సామర్థ్యం పెంపు
– టీకాల అభివృద్ధి
– ప్రభావవంతమైన వైరస్నిరోధక మందుల తయారీ
-అంతర్జాతీయ సహకారంతో వ్యాధి నియంత్రణా చర్యలు తీసుకోవడం అవసరం. ఆంధ్రప్రదేష్ప్రభుత్వం ఈ దిశగా కృషి చేస్తోంది.
ముగింపు
బర్డ్ ఫ్లూ అనేది ప్రపంచవ్యాప్తంగా పౌల్ట్రీపరిశ్రమ, ప్రజా ఆరోగ్యం, వాణిజ్య రంగాలకు తీవ్ర ప్రభావం కలిగించే వ్యాధి. నివారణ, కఠినమైన జీవసురక్షిత చర్యలు, వ్యాధి నియంత్రణా చర్యలు తప్పని సరిగా తీసుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు, జాగ్రత్త చర్యలు చేపట్టడం వల్ల వ్యాధిని సమర్థంగా నియంత్రించవచ్చు. బర్డ్ ఫ్లూ/ఎవిఎన్ ఇంఫ్లూయెంజా వ్యాధి నియంత్రణ కోసం ఆంధ్రప్రదేష్ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకుంటూ, రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తోంది. రైతులు, వ్యాపారస్తులు, అధికారులు కలిసి ఈ నియంత్రణా చర్యలను పాటించటం వల్ల వ్యాధిని సమర్థంగా అరికట్టవచ్చు.