Earth Day 2022: ఈ భూమిని అందరూ ఉపయోగించుకుంటారు. కొందరే భూమి కోసం తిరిగి పని చేస్తారు. మనల్ని కాపాడే భూమిని కాపాడటానికి జీవితాన్ని అంకితం చేసే వాళ్ల వల్లే మనం ఈ మాత్రం గాలిని పీల్చి, ఈ మాత్రం రుతువులను అనుభవిస్తున్నాం. ప్రపంచ దేశాలు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న ఎర్త్ డే జరుపుకుంటాయి. భూమిని మరియు దాని పర్యావరణాన్ని పరిరక్షించే లక్ష్యంతో ప్రజలకు అవగాహన కల్పించడానికి ఎర్త్ డే జరుపుకుంటారు.
ఎర్త్ డే సెలబ్రేటింగ్ 1970లో ప్రారంభమైంది. ఈ దినోత్సవాన్ని మొదటిసారిగా US సెనేటర్ గేలార్డ్ నెల్సన్ పర్యావరణ విద్యగా ప్రారంభించారు. 1969లో కాలిఫోర్నియాలోని శాంటా బార్బరాలో చమురు చిందటం వల్ల ఒక విషాదం జరిగింది. ఈ ప్రమాదంలో చాలా మంది గాయపడ్డారు మరియు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని నిర్ణయించుకున్నారు. దీని తరువాత ఏప్రిల్ 22 న నెల్సన్ పిలుపు మేరకు సుమారు 20 మిలియన్ల మంది అమెరికన్లు ఎర్త్ డే యొక్క మొదటి కార్యక్రమంలో పాల్గొన్నారు.
భూమిని మరియు పర్యావరణాన్ని కాపాడటమే దీని ఉద్దేశ్యమైన ఎర్త్ డే గురించి మీరందరూ తప్పక విని ఉంటారు. ఈ భూమి మన తల్లి అని మనమందరం తరచుగా చెబుతుంటాం. కానీ దురదృష్టవశాత్తు మన స్వంత తల్లిని మనం చూసుకోవడం లేదు. మనం దానిని కలుషితం చేస్తున్నాము. మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా దీనికి ఆధారం భూమి. గాలి, నీరు, నింగి, నిప్పు, నేల అనే పంచభూతాల వల్లే మానవ మనుగడ సాధ్యమవుతుంది. కాబట్టి భూమిని మనం సంరక్షిస్తే అది మనల్ని తన కడుపులో పెట్టి చూసుకుంటుంది. ఈ విషయాన్నీ చిన్నపిల్లలకుఎదిగే దశనుంచే నేర్పించడం మంచిది. భూమి అంటే మన కుటుంబ పెద్దగా భావిస్తే ఈ ప్రపంచం ఒక పచ్చని పైరువలే సుందరంగా తీర్చిదిద్దబడుతుంది.