వార్తలు

టమోట, వంగ, పచ్చి మిరప మరియు బెండ పంటలలో సమగ్ర సస్యరక్షణ

0

కూరగాయల్లో ఆధికంగా దిగుబడి ఇచ్చే రకాలు, సంకరజాతి రకాలు ప్రవేశపెట్టడం వల్ల ఉత్పతులు గణనీయంగా పెరిగాయి. దీనితోపాటు పురుగుల తాకిడి కూడా పెరిగింది. వీటిని నియంత్రించడానికి రసాయనాల వాడకం తప్పనిసరి అయింది. విచక్షణా రహితంగా మందులు వాడకం వల్ల పురుగులకు నిరోధక శక్తి పెరగడమేకాకుండా, ఉత్ఫత్తుల్లో అవశేషాలు పెరిగి అలాగే మనకు మంచి చేసే మిత్రపురుగులు కూడా నశిస్తున్నాయి. ఫలితంగా రైతుకు నష్టాన్ని కలిగిస్తున్నాయి. వాతావరణాన్ని పరిరక్షిస్తూ, వినియోగదారునికి విషతుల్యంకాని పంటను అందిస్తూ రైతు లాభపడాలి. ముఖ్యంగా కూరగాయల పంట అతి తక్కువ వ్యవధిలో చేతికందుతుంది. అందుచేత ఉత్పత్తులలో పురుగుమందుల అవశేషాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వాటిని పరిమితులలోపు వుంచగలగాలి. అంతేగాక అంతర్జాతీయ మార్కెట్ లో నాణ్యత పోటీ తట్టుకోవడానికి, ఎక్కువ ధర రాబట్టుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది సాధించడానికి క్రిమిసంహారక మందుల మీదనే ఆధారపడకుండా జీవనియంత్రణ పద్ధతులకు, వృక్ష సంబంధ మందుల వాడకానికి ప్రాధాన్యం ఇవ్వాలి. సాధారణంగా పండించే కొన్ని మఖ్యమైన కూరగాయల్లో అనుసరించాల్సిన సమగ్ర సస్యరక్షణ పద్దతులు పాటించాలి.

నారుమడిలో సస్యరక్షణ:

ఎత్తైన నారుమళ్లను సూర్యరశ్మి బాగా ప్రసరించే ప్రాంతాలలో ఏర్పాటు చేయాలి. నీరు పోవడానికి మురుగు నీటి కాల్వలను ఏర్పాటు చేయాలి. కిలో విత్తనానికి 1.5 గ్రాముల కార్బెండజిమ్ మరియు 5-10  గ్రాము

ల ఇమిడాక్లోప్రిడ్ పొడిమందుతో విత్తన శుద్ది చేయాలి. విత్తనాలను వరుసలలో పలుచుగా విత్తుకోవాలి. నారుకుళ్ళు తెగులు ఆశించకుండా రాగి సంబంధిత మందు (కాపర్ ఆక్సి క్లోరైడ్) 3 గ్రాములు ఒక లీటరు నీటికి చొప్పున పిచికారి చేయాలి. విత్తిన 15 రోజులు తరువాత నారుమడికి 100 గ్రాములు చొప్పున కార్బోప్యూరాన్ గుళికల మందును వేయాలి.

టమోట, వంగ, పచ్చి మిరప మరియు బెండ పంటలలో సమగ్ర సస్యరక్షణ :

  • ఆరోగ్యమైన నారుమడిని పెంచాలి. విత్తేముందు ఇమిడాక్లోప్రిడ్ పొడి మందు కిలో విత్తనానికి 8 గ్రా. చొప్పున కలిపి విత్తనశుద్ది చేయాలి. ఒక హెక్టారుకు 200 కిలోల చొప్ఫున వేపపిండిని దుక్కిలో వాడాలి.
  • 25 రోజుల టమోట నారును, 45 రోజుల బంతి నారును 16:1 నిష్పత్తిలో నాటుకోవాలి. బంతి ఆకులు ఆకు తొలుచు పురుగును, బంతి మొగ్గలు పచ్చపురుగలను ఆకర్షింపజేసి టమోట పంటను ఆశించకుండా చేస్తాయి.
  • ఈ పంటల చుట్టూ 2-3 వరుసల ఆముదం పైరు ఎరపంటగా వేసి పొగాకు లద్దె పురుగు ఉధృతిని నియంత్రిచ వచ్చు. రక్షక పంటలుగా పొలం చుట్టూ మొక్కజొన్న, జొన్న పంటలను వేయాలి.
  • ఈ పంటలలో వచ్చు కాయతొలుచు పురుగు మరియు లద్దె పురుగు ఉనికిని గమనించుటకు లింగాకర్షక బుట్టలను ఎకరానికి 4 చొప్పున పెట్టాలి. తొలిదశలో గ్రుడ్ల సముదాయాలను ఏరి నాశనం చేయాలి. ఎకరానికి 10 చొప్పున పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. ట్రైకోగ్రామా బదనికలను ఎకరానికి 50,000 చొప్పున వారానికి ఒకసారి నాలుగు వారాలు విడుదల చేయాలి. యన్.పి.వి. ద్రావణం ఎకరానికి 200 లీ. చొప్పున లేదా బి.టి. సంబధిత మందులను 400 గ్రా./ఎకరానికి చొప్పున పిచకారి చేయాలి.
  • రెక్కల పురుగులు గ్రుడ్లు పెట్టకుండా వేపగింజల ద్రావణం 5% లేదా వేపనూనె (5%) లేదా వేప సంబధిత క్రిమినాశనలను పిచికారి చేయాలి. లద్దె పురుగులు పెద్ద దశకు చేరినప్పుడు విషపు ఎరలను పెట్టాలి.
  • ఈ పంటలలో పొగాకు లద్దె పురుగు తీవ్ర దశలో ఉన్నప్పుడు విశపు ఎరను10 కిలోల తవుడు, ఒక కిలో బెల్లం, ఒక కిలో కార్బరిల్ లేదా 500 మి.లి. క్లోరిపైరిఫాస్ తగినంత నీటిని కలిపి చిన్న చిన్న వుండలు తయారు చేసి పొలంలో సాయంత్రం వేళల్లో వెదచల్లాలి.
  • కాయతొలుచు పురుగుల నివారణకు ఎకరానికి థయోడికార్బ్ 200 గ్రా. లేదా స్పైనోసాడ్ 75 మి.లీ. లేదా ఎసిఫేట్ 300 గ్రా. లేదా క్వినోల్ ఫాస్ 400 మి.లీ. లేదా క్లోరిపైరిఫాస్ 500 మి.లీ. పిచికారి చేయాలి.
  • వంగలో కీటకాలు/తెగుళ్లకు నిరోధక శక్తి గల రకాలను ఎంపిక చేసుకోవాలి. వంగలో భాగ్యమతి అనే రకం కాయతొలుచు పురుగులను మరియు పంజాబ్ బర్సాతి అనే రకం పచ్చదీపపు పురుగులను తట్టుకొంటాయి.
  • వంగలో సామన్యంగా పొడువు కాయల రకాల కంటే గుండ్రని రకాలకు కాయతొలుచు పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. ఈ పంటను జూలై మాసంలో నాటకుండా ఆగష్టు మాసంలో నాటితే కాయతొలుచు పురుగు తక్కువగా ఆశిస్తుంది.
  • వంగలో తలనత్త ఆశించిన కొమ్మలను ఎప్పటికప్పుడు తుంచి నాశనం చేయాలి. తలనత్త 10 శాతం కొమ్మలను ఆశించి, పంట కాపుకు రాని దశలో ఉన్నపుడు మోనోక్రోటోఫాస్ 5 మి.లి. లేదా క్వినోల్ ఫాస్ 2.0 మి.లి. మందును ఒక లీటరు నీటితో కలిపి పిచికారి చేయాలి. పంట కాపుకు వచ్చిన తరువాత ఈ మందును ఎట్టి పరిస్థితులలోను వాడకూడదు.
  • వంగలో కాయతొలుచు పురుగు 10% కాయలను ఆశించినప్పుడు కార్బరిల్ 50% మందును 2 గ్రా. లేదా మలాథియాన్ 50% ఒక మి.లీ. మందును లీటరు నీటికి చొప్పున పిచికారి చేయాలి.
  • వంగలో బాక్టీరియా ఎండు తెగులు ఉన్న ప్రాంతాలలో ఎకరానికి 6 కిలోల చొప్పున బ్లీచింగ్ పొడి మందును నాటే ముందుగా వేసుకోవాలి.
  • ఈ పంటలను ఆశించే రసం పీల్చే పురుగుల నివారనకు ఫాసలోన్, ఫిప్రోనిల్, డైమిథోయేట్ మందుల్లో ఏదైన ఒక మందును లీటరు నీటికి 2 మి.లీ. ల చొప్పున పిచికారి చేయాలి.
  • మిరపలో పైముడత క్రింది ముడత ఒకేసారి గమనించినపుడు ఎకరానికి జోలోన్ 400 మి.లీ. లేదా పెగాసస్ 300 గ్రా. లేదా ఇంట్రిపిడ్ 400 మి.లీ. పిచికారి చేసుకోవాలి. పిచికారి చేసిన తరువాత కనీసం 5-7 రోజుల వ్యవధి ఇచ్చి కాయలను కోయాలి.
  • పురుగులు ఆశించిన కాయలను వేరుచేసి నాశనం చేయాలి. పంటకాపు అయిపోయిన తరువాత చెట్ల మొదళ్ళను పీకి కుప్పగా వేసి తగులబెట్టాలి. పంట మార్పిడి పాటించాలి.
Leave Your Comments

లవంగము వల్ల ఆరోగ్య ప్రయోజనాలు..

Previous article

సేంద్రియ వ్యవసాయం చేస్తున్న 104ఏళ్ల రైతు పాపమ్మాళ్ కి పద్మశ్రీ అవార్డు..

Next article

You may also like