మేడపై లేదా మిద్దెపై కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసుకునే క్రమంలో దేశీ విత్తనాలు వాడుకోవడమే మేలు. మిద్దె తోట ప్రారంభించిన తోలి దశలో మార్కెట్ లో దొరికే హైబ్రిడ్ విత్తనాలపై ఆధారపడాల్సి వచ్చినా ఫరవాలేదంటున్నారు సీనియర్ మిద్దె తోట నిపుణులు తుమ్మేటి రఘోత్తమ రెడ్డి. దేశవాళీ విత్తనాలు మన వాతావరణానికి అనుగుణంగా ఉంటాయి. అయితే ఎక్కపడితే అక్కడ అవి దొరికే అవకాశం లేదు. ఓపికగా సేకరించాలి. అందరికీ అందుబాటులో హైబ్రిడ్ విత్తనాలు మాత్రమే వున్నాయి. ఫరవాలేదు వాటిని కూడా వాడుకోవచ్చు వాటి నుండి తిరిగి విత్తనాలను కట్టుకుని, తిరిగి వాటిని వాడవచ్చు. క్రమంగా అవీ దేశవాళీ విత్తనాల వలె మారుతాయి ఆయన చెప్పారు. మార్కెట్ లో కొనే విత్తనాల్లో మోసం జరిగే అవకాశం ఉన్నందున మిద్దె తోటల సాగుదారులు సొంతంగా విత్తనం కట్టుకోవటమే మేలన్నారు. దాదాపు అన్ని పంట మొక్కల నుంచి విత్తనాలను తయారు చేసుకొని తిరిగి విత్తుకోవటం ఆయనకు అలవాటు. ఎప్పుడు ఆయన మిద్దెతోటలో అనేక పంటల విత్తనాలు కోతకు సిద్ధమవుతున్నాయి. క్యారెట్, కొత్తిమీర, బచ్చలి, తోటకూర, చుక్కకూర, ఆవాలు, చిక్కుడు, బీర, తదితర పంటల విత్తనాలు కొద్ది రోజుల్లో నూర్పిడికి సిద్ధమవుతున్నాయి. సంవత్సరంలో మూడు కాలాలు ప్రారంభ రోజుల్లో విత్తనాలను నాటుకోవాలి. నారు మొక్కలను నాటుకోవాలి. కొన్ని మొక్కలను కొన్ని కాలాలలో పెంచలేం. పెంచినా కాపు కాయవు. ఆ గ్రహింపు ఉండాలి. శీతాకాలపు పంటలైన మిర్చి, టొమాటో, క్యాబేజీ, కాలీఫ్లవర్, కొత్తిమీర, వెల్లుల్లి వంటి వాటిని ఎండాకాలంలో పండించలేం అంటున్నారు రఘోత్తమ రెడ్డి.