broccoli cultivation: రైతులు సాధారణంగా కొత్త పంట గురించి విన్నప్పుడు సహజంగానే అనేక సందేహాలు చెలరేగుతాయి. ఆ సందేహాలన్నిటికీ సరైన సమాధానాలు లభిస్తే.. అది మనకు తెలియని విదేశీ పంట అయినా రైతుల మనసు గెలవ గలుగుతుంది. ప్రస్తుతం రైతులు తక్కువ ఖర్చు ఎక్కువ లాభాలపై ఆసక్తి చూపిస్తున్నారు. రొటీన్ పంటలు వేసి చేతులు కాల్చుకునే రైతులు ఎలా అయితే ఉన్నారో విదేశీ పంటల గురించి అధ్యయనం చేసి సాగు చేసి లాభాలు గడించే రైతన్నలు కూడా ఉన్నారు. కిలో ధర 200 పలికే బ్రకోలి పంటపై రైతన్నలు ఆసక్తి చూపిస్తున్నారు. మెళకువలు తెలుసుకుని పంట సాగు చేసి సక్సెస్ అవుతున్నారు.
బ్రకోలీ…క్యాబేజి జాతికి చెందినది. ఇది విదేశి పంటే అయినా ప్రస్తుతం బ్రకోలి సాగుపై రైతులు అమితాసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే దీని ధర, ప్రయోజనాలు అన్ని ఎక్కువే. రోజు ఆహారంలో బ్రకోలిని తీసుకుంటే జీవితంలో వచ్చే సగం జబ్బులు నయం అవుతాయి. దీనిలో అనేక ప్రయోజనాలున్నాయి. బ్రకోలి లో చాలా విటమిన్స్ మినరల్స్ ఫైబర్స్ మరియు యాంటి ఆక్సిడాంట్స్ ను కలిగి ఉంటుంది. ఇందులో క్యాలరీ కంటెంట్ తక్కువగా ఉంటుంది. బ్రకోలిని ఎప్పుడూ పచ్చిగానే మన ఆహరంలో తీసుకోవడం మంచిది. దాన్ని వండడం వల్ల తొంబై శాతం వరకూ అందులో ఉండే పోషకాలని కోల్పోతుంది. బ్రోకలీని పచ్చిగా తినటం వల్ల ఎటువంటి గుండె జబ్బులు, కాన్సర్ మరియు దీర్ఘకాలిక వ్యాధులు మన దరి చేరకుండా అది రక్షిస్తుంది. అంతే కాకుండా ఈ బ్రకోలీని తినటం వల్ల ఎముకలు ఎప్పటికీ కూడా బలంగా ఉంటాయి మరియు చర్మం యవ్వనంగా కాంతి వంతంగా ఉంటుంది. బ్రకోలీ మొలకలు వల్ల బ్రెస్ట్ కేన్సర్‌ను అడ్డుకోవచ్చు. దీనిలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇందులోని సల్ఫోరఫేన్ అనే ఎంజైమ్ క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది.
ఇప్పుడు రైతులు దేశీయ కూరగాయలను పండించడమే కాకుండా విదేశీ రకాలను కూడా ప్రయత్నిస్తున్నారు. బ్రోకలీ ప్రస్తుతం భారతదేశంలో పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. పట్టణ మార్కెట్లలో బ్రకోలీకి డిమాండ్ ఎక్కువగా ఉంది. బ్రకోలి సాగుపై జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ పంట కావునా నేలా, వాతావరణం, నీటి అవసరం తదితర విషయాలను గమనించి సాగు చెయ్యాలి. మంచి నాణ్యత గల అధిక పంటను పొందాలంటే, స్వచ్ఛమైన-గ్రేడ్ విత్తనాలను మాత్రమే ఎంచుకోవాలి. అవి సరిగ్గా తయారైతే అధిక దిగుబడిని ఇస్తాయి. విత్తడానికి ముందు, ప్రతి విత్తనాన్ని క్రమబద్ధీకరించాలి, విత్తనాల కోసం పెద్ద విత్తనాలను తీసుకోవాలి. ఎంచుకున్న విత్తనాలను వెచ్చని ఉప్పు నీటిలో చాలా నిమిషాలు ఉంచాలి. వాటిని గట్టిపడటానికి 1 నిమిషం చల్లటి నీటిలో ఉంచి మళ్ళీ నీటితో కడిగి ఎండబెట్టాలి.
బ్రకోలి సాగులో పువ్వు పెరిగేదశే కీలకం. నేల తీరుని బట్టి నీటిని అందిస్తూ ఉండాలి. నల్లరేగడి నేలల్లో పది రోజులకు ఒకసారి నీరు అందించాలి. అదే సాధారణ నేలల్లో ఆరు రోజులకు ఒకసారి నీరు అందిస్తే సరిపోతుంది. అయితే పువ్వు కోతకు వచ్చే ముందు దాని తీరుని గమనించాలి. అప్పుడు నీరు అందించడం ఆపేయాలి. మాములుగా ఈ జాతి పంట 45 రోజుల్లోనే కోతకు వస్తుందని చెప్తున్నారు నిపుణులు. పువ్వు మొత్తం ముదురు ఆకుపచ్చ రంగుకు వచ్చిన తరువాతనే కోత చేపట్టాలి. ఎకరాకు సుమారు 6 టన్నుల వరకు దిగుబడి వచ్చే వీలుంది. మార్కెట్ లో కిలో బ్రకోలి ధర 200 పలుకుతోంది. అయితే ధర ఎక్కువగా ఉంది కదా అని అందరు ఈ పంటని వేయలేము. ఎందుకంటే మార్కెటింగ్ కు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే దీనిని సాగు చేయాలి. అప్పుడే రైతుకు లాభం దక్కుతుంది.