రైతులువార్తలువ్యవసాయ పంటలు

COTTON: పత్తి పంటలో ఆకులు ఎర్రబారుతున్నాయా ? పత్తిలో మెగ్నీషియం లోపాన్ని ఎలా గుర్తించి, సవరించుకోవాలి ?

0
magnesium deficiency in cotton

COTTON: పత్తి పంటకు పూత, పిందె దశలో మెగ్నీషియం అవసరం ఎక్కువగా ఉంటుంది. మెగ్నీషియం లోపిస్తే పత్తిలో 15 -20 శాతం వరకు పంట దిగుబడులు తగ్గే అవకాశంఉంటుంది. మెగ్నీషియం లోపలక్షణాలు పత్తి పంట విత్తిన 45 రోజుల నుంచి 110 రోజుల వరకు కనిపిస్తాయి. ఈ లోపం ముఖ్యంగా ముదురాకుల్లో కనిపిస్తుంది. మొక్కల్లో పిండిపదార్ధం, మాంసకృత్తుల తయారీలో, వివిధ రకాల ఎంజైమ్ లు చురుకుగా పని చేసేందుకు, భాస్వరం పోషక లభ్యతను పెంచడానికి మెగ్నీషియం ఉపయోగపడుతుంది.

ఎలా గుర్తించాలి ?
మెగ్నీషియం లోపించినప్పుడు ఈనెల మధ్యభాగం పసుపు పచ్చగా మారి ఆకులు ఎర్రబారి, ఎండి రాలిపోతాయి. అయితే ఆకుల ఈనెలు మాత్రం రంగు మారకుండా ఆకుపచ్చగానే ఉంటాయి. మొక్కలు ఎత్తు పెరగవు. పూత, పిందె రాలిపోతుంది. పక్వానికిరాని కాయలు పగిలిపోతాయి. దిగుబడి తగ్గిపోతుంది.

MAGNESIUM DEFICIENCY IN COTTON

మెగ్నీషియం లోపం ఎందుకు వస్తుంది ?
పంట మార్పిడి చేయకుండా ఒకే పొలంలో పత్తి పంటనే విడవకుండా ఏళ్ల తరబడి సాగుచేస్తుంటే మెగ్నీషియం లోపం కనిపిస్తుంది. సిఫార్సు చేసిన మోతాదుకు మించి నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులు వాడినప్పుడు, పొటాషియం ఎక్కువగా ఉన్న నేలల్లో మెగ్నీషియం లోపం వచ్చే అవకాశం ఉంటుంది. అధిక వర్షాలు, బెట్ట పరిస్థితుల సమయంలో వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు మెగ్నీషియం లోపం వచ్చే అవకాశం ఉంటుంది. భూమిలో కాల్షియం ఎక్కువైతే మెగ్నీషియం మొక్కకు అందదు. కొన్ని సార్లు పంట చివరి దశలో సాధారణంగానే మొక్కల ఆకులు ఎర్రబడుతుంటాయి. భాస్వరం లోపం ఉన్నా, పచ్చదోమ ఆశించిన పత్తిచేలల్లో కూడా ఆకులు ఎర్రగా మారుతుంటాయి.వీటిని కూడా రైతులు మెగ్నీషియం లోపంగా పొరబడే అవకాశం ఉంటుంది. కాబట్టి దేని వల్ల ఆకులు ఎర్రబారుతున్నాయో జాగ్రత్తగా నిర్ధారించుకొని నివారణ చర్యలు చేపట్టాలి.

ఎలా నివారించాలి ?
పత్తిపంటలో నీరు నిల్వకుండా చూసుకోవాలి. మెగ్నీషియం లోపం వల్ల ఆకులు ఎర్రబారుతున్నాయని నిర్ధారించుకుంటే… లీటరు నీటికి 10 గ్రా. మెగ్నీషియం సల్ఫేట్ చొప్పున కలిపి పత్తి పంట విత్తిన 45, 75, 90 రోజుల దశలో పిచికారి చేయాలి. అధిక వర్షాల సమయంలో మెగ్నీషియంతో పాటుగా నత్రజని, పొటాషియం కలిగిన పాలిఫీడ్ (19:19:19) లేదా మల్టీ-కె (13:0:45) అనే ఎరువులను కూడా 10గ్రా. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. మెగ్నీషియంతోపాటు 2 శాతం చొప్పున డి.ఎ.పి. లేదా యూరియా ఎరువులను కలిపి కూడా పిచికారి చేసుకోవచ్చు. సిఫారసు చేసిన రసాయనిక ఎరువులతో పాటుగా ఎకరాకు 5 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. లోపం అధికంగా ఉండే తేలిక నేలల్లో ముందుజాగ్రత్తగా ఎకరాకు 25 కిలోల మెగ్నీషియం సల్ఫేట్ ను పత్తి పంట విత్తక ముందే దుక్కిలో వేసుకోవాలి.

ALSO READ: COTTON: పత్తి పంటకు చీడపీడల ముప్పు ! రైతులు చేపట్టాల్సిన నివారణ చర్యలు

Leave Your Comments

ANGRU: రబీ పంటలకు ఎలా సన్నద్ధం కావాలి ? సదస్సులో అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు

Previous article

How to protect the agricultural lands that are losing life?: జీవం కోల్పోతున్న సాగు భూములను పరిరక్షించేదెలా ?

Next article

You may also like