ఉభయ అనంతపురం, కర్నూల్ జిల్లాల్లో రైతులు తాము సాగుచేస్తున్న వ్యవసాయ, ఉద్యాన పంటల్లో, పశుపోషణలో దిగువ చూపిన జాగ్రత్తలను, నివారణ చర్యలను చేపట్టాలని అనంతపురం వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు…డా.ఎం. విజయ్ శంకర్ బాబు,
డా. జి. నారాయణ స్వామి, డా. జి.డి. ఉమాదేవి ఇలా తెలియజేస్తున్నారు.
తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసిన ప్రాంతాల్లో…
- వర్షాలకు ముంపునకు గురయిన తోటల్లో మురుగు నీటిని వీలైనంత త్వరగా బయటకు పంపించాలి.
- కోత కోసిన పంటను బద్రపరుచుకోవాలి. ఉద్యాన పంటలైన అరటి, టమాట పంటలు గాలికి, వర్షాలకు పడిపోకుండ ఊతం ఇవ్వాలి.
- వర్షాలు తెరపిచ్చిన తర్వాత పైపాటుగా మొక్కజొన్న, వరిలో నత్రజని యాజమాన్య చేపట్టాలి.
- కూరగాయల పంటలకు వర్షాలు తెరపిచ్చిన తర్వాత ఫార్ముల 4 లేదా పొటాషియం నైట్రేట్ 5 గ్రాముల చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
- వర్షాలు, గాలిలో అధిక తేమ శాతం వల్ల వివిధ పంటల్లో తెగుళ్ళు ఆశించి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. తెగులు నివారణకు శిలీంద్ర నాశక మందులను వర్షాలు తగ్గిన తర్వాత పిచికారి చేయాలి.
- కంది పూత దశలో ఉంది గనుక మారుక మచ్చల పురుగు నివారణ చర్యలు చేపట్టాలి.
- ప్రస్తుతం శనగ సాగు చేసే రైతులు అక్టోబర్ రెండవ పక్షం నుంచి నవంబర్ మొదటి పక్షం వరకు ఈ పంట విత్తుకోవచ్చు.
ఉద్యానవన విభాగం ప్రత్యేక సలహా:
మిరప: ప్రస్తుతం మిరప పంట అక్కడక్కడ శాఖీయ దశలో ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు కాయ కుళ్ళు, కొమ్మ కుళ్ళు తెగులు ఆశించడానికి అవకాశం ఉంది. నివారణకు ప్రొపికొనజోల్ ఒక మి.లీ లేదా డైఫెన్ కొనజోల్ 0.5 మి.లీ. చొప్పున లీటరు నీటికి కలిపి పూత, కాయలు పండు బారే సమయంలో పిచికారి చేయాలి.
- అరటి తోటల్లో వీలైనంత త్వరగా మురుగు నీటిని బయటకు పంపించాలి. గాలిలో అధిక తేమ శాతం వల్ల అరటిలో సిగటోక ఆకు మచ్చ తెగులు ఆశించి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఈ తెగులు నివారణకు మినరల్ ఆయిల్ 5 మి.లీ + డైఫెన్ కొనజోల్ 0.5 మి.లీ చొప్పున లీటరు నీటికి కలిపి రెండు, మూడు సార్లు నెల రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి.
- ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో దానిమ్మలో బాక్టీరియా ఆకు మచ్చ తెగులు ఆశించే అవకాశం ఉంది. తెగులు లక్షణాలు గమనిoచిన వెంటనే తెగులు ఆశించిన మొక్క భాగాలను సేకరించి తీసివేయాలి. లీటరు నీటికి 0.5 గ్రా. స్ట్రెప్టోసైక్లిన్ + 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి పిచికారి చేయాలి. వాతావరణ పరిస్థితులు గమనించి వర్షం లేని సమయంలో పిచికారి చేయాలి.
పశువులు, జీవాల పోషకులకు ప్రత్యేక సలహా:
వర్షాలు, చల్ల గాలులకు పశువులలో అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి గాను కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పాడి పశువులు ఇప్పుడు ఎక్కువగా ఈనడం జరుగుతుంది. దూడలను చల్ల గాలుల నుంచి కాపాడటానికి వెచ్చని ప్రదేశంలో ఉంచాలి. లేకపోతే న్యూమోనియా వచ్చే అవకాశం ఉంది. పాడి పశువులను నీరు నిల్వ ఉన్న లేదా బురదలో ఉంచరాదు. దీనివల్ల పొదుగువాపు రావడం, గిట్టలు పుండ్లయ్యే అవకాశం ఉంటుంది.
- గొర్రెలను వానలో తడవనీయరాదు. గొర్రెలకు ఖచ్చితంగా ఒక కిలో ఎండు మేతను అందించాలి. గొర్రె పిల్లలను చలిగాలులనుంచి కాపాడాలి. పుట్టిన మొదటిరోజు టి.టి ఇంజక్షన్, రెండు నుంచి నాల్గవ రోజు వరకు డాక్సిసైక్లిన్ + ఇంకోమైసిన్ మందు తాగించాలి. దీనివల్ల పిల్లల్లో పారుడును నివారించవచ్చు. పొలాల్లో నిలిచి ఉన్న నీటిని జీవాలకు తాగించరాదు. దీనివల్ల లివర్ ఫ్లూక్స్ గొర్రె శరీరంలోకి ప్రవేశించి రక్తహీనతను కలుగచేస్తాయి.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో గొర్రెలు, మేకల్లో ముచ్చు రోగం రావడానికి అవకాశం ఉంటుంది. నివారణకు టీకాలు వేయించాలి.
- కోళ్ళులో కొక్కెర తెగులు వ్యాధి (రానికెట్ రోగం) మిగతా వ్యాధులన్నింటి కంటే అతి భయంకరమైనది. ఈ వ్యాధి వల్ల ఎక్కువ సంఖ్యలో కోళ్ళు చనిపోతాయి. ఈ వ్యాధి ఏ వయసు కోళ్ళకైనా రావచ్చు. నివారణకు మొదటి వారం, 4 వ వారం, ఆ తరువాత 6- 8 వారాల మధ్య మరొకసారి, చివరిగా 20 వ వారం టీకాలు వేయటం వల్ల చాలా వరకు కోళ్ళను ఈ రోగం నుంచి రక్షించుకోవచ్చు.
Leave Your Comments