రాజేష్ చదివింది మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. చదువుకు తగ్గట్టుగానే పెద్ద కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం. అయితే తాను చేస్తున్న ఉద్యోగం తనకు సంతృప్తిని ఇవ్వలేక పోయింది. వ్యవసాయ కుటుంబం కావడంతో ఆ రంగంపైనే ఎక్కువ మక్కువ ఉండేది. తనకెంతో ఇష్టమైన వ్యవసాయ రంగాన్ని ఎంచుకున్నాడు. విజయాపజయాలను పక్కన బెట్టి తాను చేస్తున్న ఉద్యోగాన్ని సైతం పక్కన బెట్టి పూర్తిగా నష్టాలూ చవి చూసే వ్యవసాయంలోకి దిగాడు. ఆ రంగంలోనూ ఎలా విజయం సాధించాలనే ప్రయత్నాలు చేశాడు. ఎందరు చెప్పినా ఎవరు కాదన్నా తాను ఎంచుకున్న బాటలో ప్రయాణం సాగించాడు. ముళ్లబాటను కాస్త విజయ సోపానంగా మార్చుకుని యువతను వ్యవసాయం వైపు అడుగులు వేస్తే లాభాలు సాధించవచ్చని నిరూపించాడు. నెలకు రూ. లక్ష జీతం వచ్చినా నలుగురికి అన్నం పెట్టే రైతు కంటే మించిన ఉద్యోగం మరొకటి లేదని నిర్ణయించుకున్నారు.
అనంతపురం జిల్లా శింగనమల మండలం నిదరవాడకు చెందిన రాజేష్ కుమార్ పదిమందికి ఆదర్శముగా నిలుస్తున్నాడు. ఉద్యోగ సమయంలో ప్రతి శని, ఆది వారాలు సొంతూరులో వ్యవసాయ పనులు చేసుకునేవారు. అధిక వర్గాలు, వర్షాభావం, పంటలకు గిట్టుబాటు ధర, మార్కెటింగ్ సౌకర్యం లేక నష్టాలు రావడం ఇలాంటి సమస్యలను గుర్తించారు. ఈ నేపథ్యంలో నాలుగేళ్ళ కిందటే రూ. లక్షలతో పుట్టగొడుగుల పెంపకం కేంద్రం ఏర్పాటు చేశాడు.
రాజేష్ చేయదలచిన వ్యవసాయం పుట్టగొడుగుల ఫార్మింగ్. ఇది సున్నితమైన, సంక్లిష్ట ప్రక్రియ ద్వారా పెంపకం చేయాల్సి ఉంటుంది. ప్రతి నిమిషం అప్రమత్తంగా వ్యవహరించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటేనే ఇందులో విజయం సాధించగలరు. చిన్నపాటి అశ్రద్ధ చూపినా గడ్డి తప్ప ఏమీ మిగలదని అనుభవ పూర్వకంగా తెలిసిందని రాజేష్ చెప్తున్నాడు.
మష్రూమ్ ఫార్మింగ్ విధానాన్ని రాజేష్ వివరిస్తూ, నాణ్యమైన వరి గడ్డిని తీసుకుని బాగా ఉడికించి సూక్ష్మక్రిములు లేకుండా ఆరబెట్టాలి. 120 గ్రాముల పుట్టగొడుగు విత్తనాలను పాలిథీన్ కవర్ లో వేసి చుట్టూ ఒక అంగుళం మందంతో వరి గడ్డిని చుట్టాలి. విత్తనాలు వేసి చుట్టూ మళ్ళీ వరిగడ్డిని చుట్టాలి. ఇలా ఐదు సార్లు చేయాలి. ఇలా తయారు చేసిన కవర్ ను చీకటి గదిలో ఉంచాలి. ఇందులో కనీసం దోమలు కూడా ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ప్రక్రియ 25 రోజులపాటు కొనసాగుతుంది. ఇక్కడ మైసీలియం అనే ఫంగస్ పుడుతుంది. తర్వాత గాలి వెలుతురు వచ్చే గదిలోకి వీటిని మార్చాలి. ఇక్కడ ఉష్ణోగ్రత 25 నుంచి 35 డిగ్రీలు గాలిలో తేమ 85 శాతం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పదిరోజుల తర్వాత మొదటి కాపు వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ వరిగడ్డితో కప్పిన పుట్టగొడుగుల కట్టపై నీళ్లు చల్లాలి. కొన్ని రోజుల తర్వాత మరో కాపు వస్తుంది. మొత్తమ్మీద ఒక పాలిథీన్ కవర్ నుంచి 6 నుంచి 10 కిలోల బరువు తూగే పుట్ట గొడుగులు మూడు కాపుల్లో వస్తాయని వివరించాడు.
ప్రస్తుతం రోజుకు 50 కిలోల పాల పుట్టగొడుగులను విక్రయిస్తున్నారు రాజేష్. హోల్సేల్ కిలో రూ. 200, రిటైల్ అయితే కిలో రూ. 300 వరకు అమ్ముతున్నాడు. పుట్టగొడుగులను ఎండబెట్టిన వాటిని కిలో రూ. 800 అమ్ముకుంటున్నారు. నెలకు 2.50 నుంచి 3 టన్నుల వరకు ఉత్పత్తి చేస్తున్నారు. నెలకు మొత్తం రూ. 4 లక్షలు వస్తోంది. అందులో రూ. 2 లక్షలు మిగులుతోంది. మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాడు. పుట్టగొడుగులకు బెంగుళూరులో మంచి డిమాండ్ ఉంది. గత నాలుగేళ్లుగా రాజేష్ సాగు చేసే మష్రూమ్ నాణ్యతలు మెచ్చిన ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్ కార్పొరేషన్ తో రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ప్రస్తుతానికి వందల సంఖ్యలో రైతులకు పుట్టగొడుగుల సాగు ప్రక్రియను నేర్పిస్తున్నాడు. ఆయన ఫార్మింగ్ విధానం నచ్చిన పలువురు ప్రముఖుల సన్మానించారు.
గుడ్డు తినమని ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. అంతకంటే శక్తివంతమైన ఆహారమైన పుట్టగొడుగులను తినమని ప్రచారం చేయడం లేదు. వారంలో కనీసం ఒకసారి పుట్టగొడుగులు తినడం ఆరోగ్యమైన అలవాటని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇందులో ఏ, బి,సి, డి విటమిన్లతో పాటు కూరగాయల్లో కంటే అధికంగా బి – 5, పండ్లలో ఉన్న దానికంటే అధికంగా బి 12 విటమిన్లు ఉన్నాయి. మనిషి ఆరోగ్యానికి అవసరమైన ఐరన్, ఫైబర్ ఇందులో అధికంగా ఉంటుంది. తక్కువ పెట్టుబడితో పుట్టగొడుగులు పెంచవచ్చు. ఎవరైనా పెంపకానికి ముందుకొస్తే వారికి ఉచితంగా శిక్షణ ఇస్తాం అని రాజేష్ కుమార్ చెప్పాడు.
పుట్టగొడుగుల సాగులో అధిక లాభాలు పొందుతున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి..
Leave Your Comments