Groundnut: వేరుశనగ పంటను సాధారణంగా గొర్రుతో లేదా నాగటి సాళ్ళలో లేదా ట్రాక్టరుతో నడిచే విత్తే యంత్రముతో చదునుగా ఉండే నేలల్లో రైతులు విత్తుకోవడం మనకు తెలిసిందే. అయితే దీనికి బదులుగా ఎత్తుమడులు చేసి విత్తుకుంటే వేరుశెనగలో దిగుబడులు పెరుగుతాయి. ఎత్తుమడుల పద్ధతిలో సాగుచేయడానికి 120 సెం.మీ. ఎడం గల 15 సెం.మీ. ఎత్తుమడులు చేసుకోవాలి. రెండు ఎత్తు మడుల మధ్య 30 సెం.మీ. ఎడం కాలువలు చేసుకోవాలి. ప్రతి మడి మీద 30 సెం.మీ. దూరంలో నాలుగు వరుసల్లో వేరుశనగ విత్తుకోవాలి. ఈ పద్ధతిలో విత్తడం వల్ల విత్తన మోతాదు తగ్గుతుంది. సాధారణ పద్ధతిలో 60 నుంచి 80 కిలోల విత్తనం అవసరమైతే ఎత్తుమళ్ల పద్ధతిలో ఎకరాకు 45 కిలోలు మాత్రమే సరిపోవడంతో విత్తనంపై పెట్టే ఖర్చు తగ్గుతుంది. ఎత్తుమళ్ళ విధానంలో సాగుకు బాగా పెరిగి ఎక్కువ కొమ్మలు, కాయలు వచ్చి, అధిక దిగుబడినిచ్చే కదిరి లేపాక్షి (కె-1812), విశిష్ట (టి.సి.జి.యస్-1694), నిత్యహరిత వంటి రకాలను రబీలో సాగుకు ఎంచుకోవచ్చు. ఈ పద్ధతిలో మొదట భూమిని దున్ని చదును చేసిన తర్వాత నేలను ఎత్తుమడులుగా చేసి, విత్తే ట్రాక్టర్ తో నడిచే బ్రాడ్ బెడ్ ప్లాంటర్ ద్వారా వేరుశనగ విత్తుకోవచ్చు. ఈ యంత్రంతో మడుల మధ్య,మళ్ళలో మొక్కల మధ్య ఎడాన్నిసర్దుబాటు చేసుకునే వీలు కూడా ఉంటుంది. ఎత్తు మడుల పద్దతిలో సాగుచేసినప్పుడు విత్తనం మొలక శాతం,మొక్కల వేర్ల పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. మొక్కల మధ్య గాలి ప్రసరణ బాగా ఉంటుంది. కొమ్మలు అధికంగా వస్తాయి. నీటిని పట్టి ఉంచే శక్తి పెరిగి, నీటి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. పురుగులు, తెగుళ్ళ ఉధృతి తక్కువగా ఉంటుంది. మొక్కలు బలంగా పెరిగి ఊడలు ఎక్కువగా వచ్చి, దిగుబడి పెరిగే వీలుంటుంది. మడుల మధ్యలో ఉండే కాలువల్లో స్ప్రింక్లర్ పైపులను ఏర్పాటు చేసుకొని నీటితడివ్వవచ్చు. వేరుశనగ డిగ్గర్ యంత్రంతో పంట తీతకు అనుకూలంగా ఉంటుంది. తద్వారా విత్తనంపై, కూలీలపై ఖర్చు తగ్గుతుంది.
Groundnut: ఎత్తుమడుల పద్దతిలో వేరుశెనగ సాగుచేస్తే అధిక దిగుబడి !
Leave Your Comments