ఒడిస్సా రాష్ట్రంలో మహిళా సాధికారతకు సర్కారు మిషన్ శక్తి ద్వారా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా మహిళల్లో నైపుణ్యం పెంపొందించి వారికి ఆదాయం సమకూరే దిశగా పలు శిక్షణ కార్యకలాపాలు చేపడుతోంది. అలా మత్స్య సాగు వైపు ఆసక్తి కనబరుస్తూ చంద్రపూర్ సమితికి చెందిన స్వయం సహాయక బృందం మహిళలు లాభాల బాట పడుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. రాయగడ జిల్లా చంద్రపూర్ సమితి బెల్లంగూడ గ్రామానికి చెందిన దయాసాగర్ అనే ఎస్ హెచ్ జీ సభ్యులు చేపల పెంపకంలో శిక్షణ తీసుకున్నారు. వారి ప్రాంతంలో ఉన్న ఓ చెరువులో ఏడు నెలల క్రితం వేలాది చేప పిల్లలను వదిలారు. వాటికి సమయానుకూలంగా మేత సమకూరుస్తూ చేపలు బాగా పెరిగేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అలా పెరిగిన మూడు క్వింటాళ్లకు పైగా చేపలను ఇప్పటివరకు విక్రయించగా ఇంకా కొన్ని క్వింటాళ్ల చేపలు చెరువులో ఉన్నట్లు వీరంతా గర్వంగా చెబుతున్నారు.
ఈ విషయమై ఎస్ హెచ్ జీ అధ్యక్షురాలు గీత బిభర్ మాట్లాడుతూ రూ. 20 వేలు వెచ్చించి 75 వేల చేప పిల్లలను కొనుగోలు చేసి చెరువులో వదిలామన్నారు, వాటి మేత కోసం మరో రూ. 30 వేల వరకు ఖర్చు చేసినట్లు ఆమె చెప్పారు. ఇంతవరకు మూడు క్వింటాళ్లకు పైగా చేపలను విక్రయించామని చెరువులో ఇంకా మరికొన్ని క్వింటాళ్ల వరకు చేపలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వీటి పెంపకం, విక్రయాలతో లాభాలు బాగున్నాయని గీతతోపాటు సరస్వతి, కౌసల్య, మదన పాణి, తదితర సభ్యులంతా చెబుతున్నారు. మా బృందాన్ని చూసి చుట్టుపక్కల ప్రాంతాల్లో మరికొంత మంది వీటి సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారని వీరు వెల్లడించారు.
చేపల పెంపకంతో అధిక లాభాలు..
Leave Your Comments