వ్యవసాయంపై రసాయన ప్రభావం ఎక్కువవుతోంది. ఏ పంట వేసినా దిగుబడి కోసం ఎరువులు, పురుగు మందులు ఇష్టానుసారంగా వినియోగించేస్తున్నారు. ఫలితంగా భూసారం తగ్గిపోతోంది. దీని ప్రభావం పంట దిగుబడులపైన పడుతోంది. చీడపీడలు, తెగుళ్ల సమస్యలు ఎక్కువవుతున్నాయి. నాణ్యమైన పంట రావడం లేదు. అలా పండించిన పంటలు తినడం వల్ల లేనిపోని రుగ్మతలు వస్తున్నాయి. ముఖ్యంగా బీపీ, షుగర్, స్థూలకాయం వంటి సమస్యలు ఎక్కువవుతున్నాయి. గతంలో బీపీ, షుగర్ వ్యాధులు 50, 60 ఏళ్లు పైబడిన వారికే వచ్చేవి. ఇప్పుడు 30, 40 ఏళ్ల వారు సైతం వాటిబారిన పడుతున్నారు. దానిపై దృష్టిసారించిన వ్యవసాయాధికారులు తగ్గిపోతున్న భూసారాన్ని పెంచడంతో పాటు ప్రజలకు నాణ్యమైన ఆరోగ్యకరమైన పంటలు అందించేందుకు నడుం బిగించారు. ప్రకృతి వ్యవసాయ విభాగం ఆధ్వర్యంలో రసాయనిక ఎరువులు, పురుగు మందులతో కాకుండా ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే వాటితో సాగు చేపట్టేలా చైతన్యపరుస్తున్నారు.
గతంలో భూమిలో తగ్గిపోతున్న భూసారాన్ని పెంచేందుకు పచ్చిరొట్ట ఎరువులైన జీలుగు, కట్టిజనుము వంటి వాటిని సాగు చేసి 40 రోజుల తర్వాత వాటిని దమ్ములో ఇప్పుడు వాటి స్థానంలో నవధాన్యాల్లో 18 రకాల విత్తనాలను వరి పంట సాగు చేయడానికి ముందు సాగు చేస్తున్నారు. ఇప్పటికే రైతులను చైతన్యపరిచి వారి పొలాల్లో వీటిని పండించేలా చేస్తున్నారు.
పప్పు దినుసుల్లో మినుము, పెసర, బొబ్బర్లు, అలసంద, చిరుధాన్యాల్లో రాగులు, కొర్ర, సామ, ఊద, గుంటి, అరికలు, నూనె జాతిలో నువ్వులు, వేరుశనగ, కూరగాయల్లో చిక్కుడు, ఆనప, ధనియాలకు సంబంధించి 18 రకాల విత్తనాలను ఎకరానికి 12 కేజీల చొప్పున పొలాల్లో జల్లుతారు. ఇవి 40 రోజుల తర్వాత పూత దశలో ఉన్నప్పుడు దమ్ములో కలియదున్నతారు.
ప్రయోజనాలు:
దమ్ములో వీటిని కలియదున్నడం వల్ల భూమి గుల్లబారుతుంది.
వానపాముల సంఖ్య పెరుగుతుంది.
భూమిలో ఉన్న ఉపయోగకర సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది.
సేంద్రియ కర్బన శాతం పెరుగుతుంది.
నేల ఆరోగ్యకరంగా ఉంటుంది.
దీనివల్ల నాణ్యమైన, ఆరోగ్యకరమైన పంటలు ఉత్పత్తి అవుతాయి.
ఇవి తినడం వల్ల ప్రజలు ఆరోగ్యకరంగా ఉంటారు.
నవ ధాన్యాల సాగుతో పెరుగుతున్న భూసారం..
Leave Your Comments