Government Schemes For Dairy Farm In AP: పశువుల షెడ్ల నిర్మాణానికి 90 శాతం రాయితీ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గొర్రెలు, మేకలు, కోళ్లకు షెడ్లు నిర్మించుకుంటే 70 శాతం రాయితీ ఇస్తుంది. యూనిట్ కు గరిష్టంగా రూ.60,900 నుంచి రూ.2,07,000 వరకు పెంపకందారులకు లబ్దిచేకూరనుంది. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద దీన్ని అమలుచేస్తారు. 2019 వరకు తెదేపా ప్రభుత్వ హయాంలో గోకులం పేరుతో ఈ పథకం అమలయ్యేది. వైకాపా అధికారంలోకి వచ్చాక దీన్ని నిలిపివేశారు. అప్పటికే షెడ్లు నిర్మించుకున్న రైతులకు రాయితీ సొమ్ము కూడా ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చాక ‘గోకులం’ అమలు చేస్తామని ‘ప్రజాగళం’ మ్యానిఫెస్టోలో తెదేపా కూటమి హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే.. షెడ్ల నిర్మాణానికి రాయితీ ఇస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి కన్నబాబు జులై 1న ఉత్తర్వులు, మార్గదర్శకాలు విడుదల చేశారు. దీనికి సంబంధించిన
వివరాలను వ్యవసాయశాఖ మంత్రి కార్యాలయం విడుదల చేసింది.
* రాయితీపై పశువులు, మేకలు, షెడ్లు నిర్మించుకునేందుకు అర్హులకు ప్రోత్సాహం కల్పిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి ఆచ్చెన్నాయుడు తెలిపారు. గ్రామీణ పేదల జీవనోపాదిని మెరుగుపరిచేందుకు ఈ పథకం దోహదపడుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ అమలు చేస్తామని వివరించారు.
పశువుల షెడ్ల నిర్మాణానికి : ఉపాధి నిధుల కింద 90 శాతం ఇస్తే, రైతు వాటాగా 10 శాతం చెల్లించాలి.
2 పశువులకు: యూనిట్ వ్యయం రూ. 1,15,000 కాగా 90 శాతం ఉపాధి నిధుల కింద రూ.1,03,500 రాయితీ ఇస్తారు. రైతు వాటాగా 10 శాతం అంటే రూ.11,500 చెల్లించాలి.
4 పశువులకు: యూనిట్ వ్యయం రూ.1,85,000 కాగా 90 శాతం ఉపాధి నిధుల కింద రూ.1,66,500 రాయితీ ఇస్తారు. రైతు వాటాగా 10 శాతం అంటే రూ.18,500 చెల్లించాలి.
6 పశువులకు: యూనిట్ వ్యయం రూ.2,30,000 కాగా 90 శాతం ఉపాధి నిధుల కింద రూ.2,07,500 రాయితీ ఇస్తారు. రైతు వాటాగా 10 శాతం అంటే రూ.23,000 చెల్లించాలి.
గొర్రెలు, మేకలు, కోళ్ల షెడ్లకు: యూనిట్ వ్యయంలో ఉపాధి నిధుల కింద 70 శాతం రాయితీ ఇస్తే, రైతు వాటాగా 30 శాతం చెల్లించాలి.
20 గొర్రెలు/ మేకల షెడ్లకు: యూనిట్ వ్యయం రూ.1,30,000 కాగా ఉపాధి నిధుల కింద రూ.91,000 రాయితీ ఇస్తారు. రైతు వాటాగా రూ.39,000 చెల్లించాలి.
50 గొర్రెలు/ మేకల షెడ్లకు: యూనిట్ వ్యయం రూ.2,30,000 కాగా ఉపాధి నిధుల కింద రూ.1,61,000 రాయితీ ఇస్తారు. రైతు వాటాగా రూ.69,000 చెల్లించాలి.
100 కోళ్లకు: యూనిట్ వ్యయం రూ.87,000 కాగా ఉపాధి నిధుల కింద రూ.60,900 రాయితీ ఇస్తారు. రైతు వాటాగా రూ.26,100 చెల్లించాలి.
200 కోళ్లకు: యూనిట్ వ్యయం రూ.1,32,000 కాగా ఉపాధి నిధుల కింద రూ.92,400 రాయితీ ఇస్తారు. రైతు వాటాగా రూ.39,600 చెల్లించాలి