Cotton Crop Cultivation: రైతాంగానికి, వ్యవసాయ అభివృద్ధికి ఉపయోగపడే టెక్నాలజీలు ఎక్కడున్న అందిపుచ్చుకోవడానికి సంసిద్ధంగా ఉండాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వి. ప్రవీణ్ రావు వ్యవసాయ శాస్త్రవేత్తలకి పిలుపునిచ్చారు. వ్యవసాయరంగం లో సవాళ్లని ఎదుర్కోవడానికి ప్రభుత్వం, ప్రైవేట్, రైతులు తదితర భాగస్వాముల సంయుక్త ప్రయత్నాలు అవసరమని అన్నారు.
Also Read: రైతు సేవకు వ్యవసాయ శాఖ కాల్ సెంటర్ అంకితం.!
అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు పై వర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్ షాప్ లో ప్రవీణ్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి KCR ఈ అంశం గురించి మూడేళ్ళ నుండే దిశానిర్దేశం చేశారన్నారని ప్రవీణ్ రావు వివరించారు. ఈసారి ఖరీఫ్ లో ప్రయోగాత్మకంగా సాగు మొదలుపెట్టామన్నారు.ఈ ఏడాది యూనివర్సిటీ ఆధ్వర్యంలో వెయ్యి ఎకరాలలో ప్రయోగాత్మకంగా యంత్రాల ద్వారా పత్తి విత్తనాలు వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఈ సాగు వల్ల వచ్చిన అనుభవాల ఆధారంగా భవిష్యత్ లో విస్తీర్ణం పెంచుతామని ప్రవీణ్ రావు అన్నారు.
ఈ సందర్భంగా యంత్రాల ప్రదర్శనని ఆయన ప్రారంభించారు. అధిక సాంద్రత పత్తి సాగుకొసం 10యంత్రాలను వివిధ పరిశోదనా స్థానాలకు అందించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ, విత్తన, వ్యవసాయ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు .విశ్వవిద్యాలయం పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాక కేంద్రాల సమన్వయకర్తలు, శాస్త్రవేత్తలు, మూడు జోన్ల ఏడిఆర్ లు పాల్గొన్నారు. అలాగే పరిశోధనా సంచాలకులు డాక్టర్ జగదీశ్వర్, విస్తరణ సంచాలకులు డాక్టర్ సుధారాణి, డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ సీమ తదితరులు పాల్గొన్నారు.
అధిక సాంద్రత పత్తి సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహకం:
అధిక సాంద్రత పత్తి సాగుతో రైతులకు అయ్యే అదనపు ఖర్చును తీర్చడానికి ప్రభుత్వం, ఎకరాకు 4వేల రూపాయల వరకు వివిధ పనుల కోసం ఆర్థిక ప్రోత్సాహకం అందిస్తుంది. ప్రభుత్వం చే గుర్తించబడి, అధికారుల ప్రోత్సాహంతో అధిక సాంద్రత పత్తి సాగుకు ముందుకు వచ్చిన రైతులకు ఈ సహకారం అందుతుంది. రాష్ట్రంలో తొలి విడత లో సుమారు 20 వేల ఎకరాలకు ఈ సాయం అందిస్తారు. ఈ పత్తి సాగు కాలంలో రైతులకు మూడు దఫాల శిక్షణ అందిస్తారు. అలాగే మొక్కల పెరుగుదల నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. యంత్రాల ద్వారా విత్తనాలు నాటడమే కాకుండా పత్తి కోతకు కూడా యంత్రాలను వాడేందుకు కృషి జరుగుతోంది. అధిక సాంద్రత పత్తి సాగులో ప్రతి ఎకరాకు 25 వేల మొక్కలు పెంచాల్సి ఉంటుంది. దీని వల్ల అధిక దిగుబడి వస్తుంది.
Also Read: బ్లాక్ టీ గురించి మనకు తెలియని విషయాలు.!