వార్తలు

వ్యవసాయం చేస్తూ లక్షలు సంపాదిస్తున్న.. ప్రభుత్వ ఉద్యోగి

0

చదువుకొని కొందరు ఉద్యోగాలు సంపాదిస్తే.. మరి కొందరు పారిశ్రామిక వేత్తలవుతుంటారు. కానీ, బాగా చదువుకొని వ్యవసాయం చేసేవాళ్లు చాలా తక్కువ. ఇటీవల కొంతమంది వ్యవసాయంపై మక్కువ చూపిస్తున్నప్పటికీ అలాంటి వాళ్లని వేళ్ల మీద లెక్కించొచ్చు. అలాంటిది ప్రభుత్వ ఉద్యోగంలో దాదాపు పదేళ్లకు పైగా సేవలందిస్తూనే.. వ్యవసాయం చేస్తూ రూ. లక్షలు సంపాదిస్తున్నాడు.ఓ ఉపాధ్యాయుడు. తాను చేయడమే కాకుండా వందల మందికి మార్గదర్శిగా నిలుస్తున్నాడు.

ఉత్తర్ ప్రదేశ్ లోని బారాబంకి జిల్లా దౌలత్ పూర్ గ్రామానికి చెందిన అమరేంద్ర ప్రతాప్ సింగ్ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. దాదాపు 10 ఏళ్లకు పైగా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నాడు. కానీ, ఆయనకు వ్యవసాయం చేయాలనే కోరిక ఉండేది. దాదాపు నెలకి రూ. 1.20 లక్షల జీతమొస్తున్న ఉద్యోగాన్ని వదిలి వ్యవసాయం చేయడమంటే మాటలా.. బంధువులు వద్దన్నారు. కోరి కష్టాలు తెచ్చుకోవడమెందుకు అని స్నేహితులు అడ్డుపడ్డారు. కానీ, అమరేంద్ర వినిపించుకోలేదు. వెంటనే ఉద్యోగం మానేయకుండా ప్రయోగాత్మకంగా కొంత వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు.  వ్యవసాయం ద్వారానే లక్షలు సంపాదించొచ్చని నిరూపించాలనుకున్నాడు. ఆ ప్రాంతంలో వ్యవసాయం చేయాలంటే కాస్త కష్టమే. అందరూ సంప్రదాయ తృణధాన్యాలు, గోధుమలు, చెరకు పండించేవారు.అయితే వీటి ద్వారా పెద్దమొత్తంలో సంపాదించడం కష్టం. ఎందుకంటే దిగుబడి రావడానికి ఎక్కువ సమయం పడుతుంది. చెరకు ద్వారా అధిక దిగుబడికి అవకాశమున్నప్పటికీ దాదాపు రెండేళ్లు నిరీక్షించాలి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఓ వైపు ఉద్యోగం చేస్తూనే… దగ్గర్లోని పట్టణంలో వ్యవసాయ మెళుకువలు తెలుసుకునేందుకు శిక్షణ తీసుకున్నాడు. అంతేకాకుండా యూట్యూబ్ లో వీడియోలు చూస్తూ మరింత సమాచారాన్ని సేకరించేవాడు.  అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక ఎకరం పొలంలో అరటి తోట పెంచడం మొదలుపెట్టాడు. మొదట్లో అంతగా అవగాహన లేకపోవడంతో నష్టాలే వచ్చాయి. అయినా తన పట్టుదలను వీడలేదు. ఒకే పొలంలో రకరకాల పంటలను వేసి ప్రయోగం చేశాడు.  ఎకరా పొలంలోనే అరటి తోటను పెంచుతూ అంతర పంటలుగా అల్లం, పసుపు, క్యాబేజీ పంటలను వేశాడు. దీంతో కాస్త ఉపశమనం లభించినట్లయింది. అల్లంతో పెద్దగా ఉపయోగం లేకపోయినా పసుపుతో బాగా కలిసొచ్చిందట. దీంతో ఇదే తరహాలో అమరేందర్ సేద్యాన్ని కొనసాగించాడు.

ఈ లోపు వ్యవసాయంపై పూర్తిగా అవగాహన వచ్చింది. తనకున్న మొత్తం 30 ఎకరాలతో పాటు, మరో 30 ఎకరాలు కౌలుకు తీసుకొని అరటి పంట, అందులో కొన్ని అంతర పంటలను వేయడం ప్రారంభించాడు. పసుపు పంటలో వచ్చిన లాభాన్ని అరటి తోటలకు మదుపుగా పెట్టేవాడు. ఇలా ఏడాది పొడువునా ఆదాయం వచ్చేలా ప్రణాళిక వేసుకున్నాడు.  అలా తన ప్రయోగాలను విస్తరించుకుంటూ అంతర పంటలుగా వాటర్ మిలన్, మస్క్ మిలన్, బంగాళాదుంప, స్ట్రాబెర్రీ, క్యాప్సికం తదితర పంటలు వేసేవాడు. అంతేకాకుండా దగ్గర్లోని వ్యవసాయ క్షేత్రాలకు, ప్రయోగశాలలకు వెళ్లి కొత్త కొత్త వంగడాలు, వాణిజ్య పంటలు గురించి తెలుసుకునే వాడు. ఆయా పద్ధతులను తాను కూడా అవలంభించేవాడు. తొలుత నష్టమొచ్చినా క్రమంగా లాభాలు వచ్చేవి. పంట వ్యర్థాలను కాల్చేయకుండా, వాటిని సేంద్రియ ఎరువులుగా తర్వాతి పంటలకు ఉపయోగించేవారు. దీంతో తన వ్యవసాయ క్షేత్రంలో వ్యర్ధమనే పదానికే చోటు లేకుండా చేశాడు.

అధిక దిగుబడి సాధించేందుకు కాలానుగుణంగా మారుస్తున్నాడు. మొత్తం 30 ఎకరాల్లో కూరగాయలు, పళ్ళు పండిస్తూ మిగతా 30 ఎకరాల్లో చెరకు, గోధుమలు లాంటి పంటలు వేస్తున్నాడు. దీంతో ఏడాదికి రూ. కోటి వరకు ఆదాయమొస్తోందని, దాదాపు 70 లక్షలు పెట్టుబడిగా పోయినా ఏడాదికి 30 లక్షల లాభం మిగులుతోందట. కేవలం తానొక్కడే కాకుండా తన అనుభవంతో చుట్టుపక్కల రైతులకు మార్గనిర్ధేశకుడిగా నిలుస్తున్నాడు. రైతుల సందేహాలను తీరుస్తూ మరింత మందిని ప్రోత్సహిస్తున్నాడు. దాదాపు 350 మంది రైతులు ఆయన మార్గనిర్ధేశంలో నడుస్తున్నారట. తమ పంటలకు సరైన మద్దతు ధర లభించడం లేదని నేరుగా వినియోగదారులకే  తమ పంటలను చేరవేసేలా ప్రణాళికలు రచిస్తున్నాం అని అమరేందర్ చెబుతున్నాడు.

Leave Your Comments

110 రకాల స్వదేశీ వరి వంగడాలను సాగు చేసిన కార్పొరేట్ ఉద్యోగి.. భాస్కర్

Previous article

తెలంగాణ రాష్ట్రంలో రికార్డుస్థాయిలో సాగు..

Next article

You may also like