వార్తలు

కలబంద సాగుతో మంచి రాబడి..

0

వ్యవసాయం ఏం లాభం ఉంటుంది.. కష్టాలు తప్ప అని అనుకునేవారు చాలా మందే ఉంటారు. వ్యవసాయం దండుగ అని, ఆధునిక ప్రపంచపు పోకడలకు తగినట్లు ఏ సాఫ్ట్ వేర్ ఉద్యోగమో, మరొకటో చేయాలని భావిస్తుంటారు. కానీ అదంతా గతం.. ఇప్పుడు వ్యవసాయం దండుగ కాదు.. పండుగ అనే పరిస్థితులు వచ్చాయి. కాస్త తెలివిని వుపయోగించి వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని జత చేస్తే చాలు.. అతి తక్కువ పెట్టుబడితో లక్షల్లో సంపాదించొచ్చు. ఎంతో మంది ఉన్నత విద్యావంతులు సైతం తమ తమ ఉద్యోగాలను వదులుకొని లక్షల జీతాన్ని త్యజించి మరీ వ్యవసాయ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ప్రపంచ అవసరాలకు తగ్గట్లుగా మార్కెట్ రేట్లకు అనుగుణంగా వ్యవసాయం చేస్తూ భారీ పంటలను ఎంపిక చేసుకుంటున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే పంటలను ఎంచుకుంటున్నారు. వాటిలో ప్రధానంగా చూసుకున్నట్లైయితే కలబంద సాగు నిలిచింది చెప్పాలి. ఎందుకంటే కలబంద సాగుకు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు, పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరమూ లేదు. ఇంకా చెప్పాలంటే నష్టం లేని పంట కలబంద. ఏడాదికి కేవలం రూ. 50 వేలు పెట్టుబడితో ఏకంగా రూ.10 లక్షల వరకు సంపాదించొచ్చు. కలబందకు ఆ రేంజ్ లో డిమాండ్ ఉంటుంది మరి. కలబంద వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్య పరంగా, అందం పరంగా కలబందను ప్రజలు ఎంతగానో ఉపయోగిస్తుంటారు. ఇక వ్యాపారాల్లో అయితే ప్రత్యేకంగా ఆయుర్వేదం, ఫార్మా, బ్యూటీ ప్రోడక్ట్స్, సబ్బులు, ఫేస్ క్రీమ్స్, హెయిర్ జెల్స్, ఇలా రకరకాల ఉత్పత్తుల తయారీలో కలబందను ఉపయోగిస్తున్నారు. అందుకే కలబందకు కంపెనీల నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది. దొరికినకాడికి కోనేస్తుంటారు. అందుకే కలబంద సాగు చేసే రైతులకు విపరీతమైన డిమాండ్ వుంది. ఇంకా కొన్ని కంపెనీలైతే రైతుల చేత కాంట్రాక్ట్ పద్ధతిలో కలబంద సాగు చేయిస్తున్నాయి.
కలబంద సాగుకు మన దేశంలోని నేలలు చాలా అనువైనవిగా చెప్పాలి. ఎలాంటి నేలలోనైనా సరే ఇది పెరుగుతుంది. అయితే ఇసుక రకం నేలలైతే ఈ పంట సాగుకు మేలని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కలబంద మొక్కలను జులై నుంచి ఆగస్టు మధ్య నాటితే బెటర్ అంటున్నారు. ఇంకా భూగర్భ జలాలు కాస్త ఎక్కువగా వుండే నేలలు ఈ పంట సాగుకు చాలా మేలు చేస్తాయి. అయితే చలి ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఈ మొక్కల పెరుగుదలకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఇక పెట్టుబడి విషయానికి వస్తే.. ఒక హెక్టారు సాగుకు రూ. 27,500 వరకు ఖర్చు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. పంట చేతికొచ్చే సమయానికి మొత్తం పెట్టుబడి రూ.50 వేల వరకు అవుతుంది. ఇక హెక్టారు కు 40 నుంచి 50 టన్నుల కలబంద ఆకులు ఉత్పత్తి వస్తుంది. ఒక టన్ను కలబంద ఆకులకు రూ. 15 వేల నుంచి 25 వేల వరకు ధర పలుకుతోంది. అంటే .. సరాసరిగా ఒక పంట కాలానికి ఎటు లేదన్నా రూ.7 నుంచి 10 లక్షల పైన ఆదాయం లభిస్తుందన్న మాట. అయితే ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే.. మీరు సాగు చేసే కలబంద ఆకులు మందంగా, పెద్దగా ఉంటే వాటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుంటే మరింత ప్రయోజనం కలుగుతుంది.

Leave Your Comments

ఖర్జూరం తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Previous article

లాక్ డౌన్ సమయంలో కిచెన్ గార్డెన్ కు శ్రీకారం..

Next article

You may also like