ఆంధ్రా వ్యవసాయంమన వ్యవసాయంవార్తలువ్యవసాయ వాణిజ్యం

ఏపీ రైతులకు శుభవార్త : ఇక వ్యవసాయ రంగంలోనూ వాలంటీర్ వ్యవస్థ – ఆర్బీకేలు (RBK) పగలంతా తెరిచుండేలా

0

ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కారు అమలు చేస్తోన్న వాలంటీర్ విధానం విజయవంతంగా సాగుతోన్న దరిమిలా ఇప్పుడు వ్యవసాయ రంగంలోనూ ఆ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు. రైతు భరోసా కేంద్రాలకు అన్నదాతలు ఎప్పుడు ఏ అవసరం కోసం వచ్చినా అవి తెరిచే ఉండేలా ప్రతి చోటా ఓ వాలంటీర్ ను అనుసంధానం చేయనున్నారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో జగన్ సర్కారు ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కితాబు లభించడం తెలిసిందే. ఏపీ మోడల్ ను కేరళతోపాటు ఇతర రాష్ట్రాలూ అమలు చేస్తున్నాయి. కాగా, ఇప్పుడు వ్యవసాయ రంగంలోనూ వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు వైసీపీ సర్కారు సిద్దమైంది. రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలు(ఆర్బీకేల) ద్వారా రైతులకు మరిన్ని సేవలను అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

విత్తనాల పంపిణీ నుంచి పంటల విక్రయాల దాకా అన్ని సేవలను రైతుల ముంగిటకు తీసుకొచ్చే లక్ష్యంతో జగన్ సర్కారు గతేడాది మే 30 నుంచి రైతు భరోసా కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 10,778 ఆర్బీకేలు ఉండగా, వాటిలో వ్యవసాయ, అనుబంద శాఖలకు చెందిన 14,287 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. అయితే, పంటల నమోదు (ఈ క్రాప్‌)తో పాటు రైతులకు అందించే వివిధ రకాల సేవల కోసం సదరు సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లాల్సిన క్రమంలో ఆర్బీకేలను మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంది.

ఆర్బీకేల్లో ప్రతిరోజూ ఉదయం 7 నుంచి 9 వరకు, తిరిగి సాయంత్రం 3 నుంచి 6 వరకు మాత్రమే సేవలు అందుతున్నాయి. దీంతో ఆర్బీకేలకు వచ్చే రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగానే వ్యవసాయ రంగంలోనూ వాలంటీర్ వ్యవస్థను తీసుకురావాలని, ఆర్బీకేలో ఎవరో ఒకరు రైతులకు అందుబాటులో ఉండాలన్న ఆలోచనతోనే ప్రతి కేంద్రానికి ఒక వాలంటీర్ ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఇప్పటికే ప్రతి ఆర్బీకేకు ఒక వ్యవసాయ, అనుబంధ శాఖలకు సంబంధించిన సహాయకులు, గ్రామస్థాయిలో బ్యాంకింగ్‌ సేవలందించే లక్ష్యంతో ప్రతి ఆర్బీకేకు ఓ బ్యాంకింగ్‌ కరస్పాండెంట్‌ను అనుసంధానించారు. వీరికి తోడు ఇప్పుడు ఒక్కో ఆర్బీకేలో ఒక వాలంటీర్ ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల్లో చురుకుగా పనిచేసే వాలంటీర్లను ఎంపిక చేసి, వారికి ఆర్బీకే కార్యకలాపాలపై శిక్షణ ఇవ్వాలని సర్కారు భావిస్తున్నది. అన్నదాతలు ఎప్పుడు ఏ అవసరం కోసం వచ్చినా ఆర్బీకేలు తెరిచే ఉండేలా చూస్తామని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు ఇటీవల ఓ సందర్భంలో స్పస్టం చేశారు.

Leave Your Comments

పొగాకులో పురుగుల యాజమాన్యం – సమగ్ర సస్య రక్షణ

Previous article

PJTSAU లో డిప్లొమా కోర్సులకు స్పాట్ కౌన్సిలింగ్

Next article

You may also like