Orange Farming: యాసంగిలో వరి సాగు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం కుండబద్దలు కొట్టి మరీ చెబుతోంది. దీంతో వరికి బదులు రైతన్నలు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారిస్తున్నారు. అందులో భాగంగా దీర్ఘకాలిక దిగుబడిని అందించే పండ్ల తోటలు వేసేందుకు మొగ్గు చూపుతున్నారు. గతంలో బత్తాయి సాగులో దేశంలోనే నల్గొండ జిల్లా ఆగ్రస్థానంలో ఉండేది. అయితే వేరుకుళ్లు తెగులు ఉధృతి పెరగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అదే సమయంలో సాగునీటి వనరులు కూడా పెరగడంతో రైతులు బత్తాయి తోటలను తొలగించి గత ఐదారేళ్లుగా వరి సాగు చేపట్టారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం యాసంగి లో వరి సాగు చేయవద్దని చెబుతుండటంతో రైతులు మళ్ళీ బత్తాయి తోటల సాగు ఫైన దృష్టి సారించారు. అందులోనూ ఈ మధ్య టన్ను బత్తాయి ధర 80 వేల నుంచి లక్ష రూపాయలు పలుకుతుండటంతో రైతులు ఇదే అదునుగా భావిస్తున్నారు.
ఆసియా ఖండంలోనే అత్యధికంగా బత్తాయి పండుతున్న ప్రాంతంగా నల్గొండ జిల్లాకు పేరుంది. జిల్లాలో గతంలో లక్షకుపైగా ఎకరాల్లో బత్తాయి తోటలు విస్తరించి ఉండేవి. కానీ నేడు చాలా వరకు తోటలు అంతరించిపోయాయి. ఎండల తీవ్రతకు భూగర్భజలాలు అడుగంటడం, నీరు లేక చెట్లు ఎండుముఖం పట్టడం, వేరుకుళ్లు వంటి తెగుళ్లు వేధించడంతో బత్తాయి సాగుకు రైతులు నెమ్మదిగా దూరమయ్యారు.
Also Read: కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో గంజాయి సాగు- రేవంత్ రెడ్డి
గత కొంత కాలంగా నీటి లభ్యత పెరగడంతో రైతులు వరి సాగుకు మొగ్గు చూపారు. అయితే ఇటీవలె రబీలో వరి సాగు వద్దంటూ ప్రభుత్వం కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం, మార్కెట్‌లో ధర కూడా ఆశాజనకంగా ఉండటంతో వరి పండించే రైతులు బత్తాయి సాగు వైపు దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం 46 వేల ఎకరాల్లో మాత్రమే బత్తాయి సాగులో ఉంది. జనవరి నుంచి మార్చి లోపు సుమారు 14 వేల ఎకరాలలో బత్తాయి మొక్కలు నాటేందుకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
Also Read: అకాల వర్షాలతో రైతన్న కుదేలు.. చేతికొచ్చిన పంట దెబ్బతిందని దిగులు