ఇప్పటికే పండించిన పంటకు మద్దతు ధర దొరక్క కుదేలైపోతున్న రైతులపై ఎరువుల కంపెనీలు కత్తిగట్టడంపై కేంద్రం సీరియస్ అయ్యింది. యూరియా మినహా ఇతర ఎరువుల ధరలను పెంచేందుకు కంపెనీలు తీసుకున్న నిర్ణయానికి బ్రేకులు వేసింది. డీఏపీ, ఎంఓపీ,ఎన్ పీకేల ఎంఆర్ పీ ధరలను ఎట్టిపరిస్థితుల్లోనూ పెంచవద్దని ఆదేశించింది. యూరియాతో పాటుగా అన్ని ఎరువులను ఇప్పటిదాకా విక్రయిస్తున్న ధరలకే అమ్మాలని తేల్చి చెప్పింది. కాగా, ఈ జూన్ నుంచి మొదలయ్యే ఖరీఫ్ సీజన్ నుంచి డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలను పెంచాలని ఎరువుల కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటివరకు సప్లై చేసిన వాటికి కాకుండా.. ఈ నెల నుంచి పంపే సరుకులపై పెంచిన ధరలు అమలు చేయాలని డీలర్లకు సూచించింది. పైగా ధరల పెంపు సుమారు 58 శాతం ఉంటుందని చెప్పడంతో రైతుల్లో కలవరం మొదలైంది. దేశవ్యాప్తంగా కంపెనీల తీరుపై విమర్శలు వెల్లువెత్తడంతో ఎరువుల కంపెనీల అత్యుత్సాహానికి కేంద్రం బ్రేకులు వేసింది. దీంతో రైతులకు ఊరట లభించినట్లయింది.