cotton seed price: పంజాబ్‌లో పత్తి సాగు చేస్తున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వరుసగా రెండో ఏడాది పత్తి విత్తనాల ధరలు పెరిగాయి. గతేడాది 767లో లభించిన విత్తన ప్యాకెట్ ఇప్పుడు రూ.810గా మారింది. ఇప్పుడు రైతులు ప్యాకెట్‌పై రూ.43 అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఒక ఎకరంలో కనీసం మూడు ప్యాకెట్ల విత్తనాలు వినియోగిస్తారు.
పంజాబ్‌లోని పత్తి రైతులు 2021లో పింక్ బోల్‌వార్మ్ వ్యాప్తి కారణంగా ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం విత్తనాల ధరలు పెంచి రాష్ట్ర పత్తి రైతులకు భారంగా మారింది. ప్రభుత్వం విత్తన ధరలను ఏటా పెంచుతోందని కొందరు పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత ఏడాది కూడా పత్తి విత్తనాల ధరను కేంద్ర ప్రభుత్వం రూ.737 నుంచి రూ.767కు పెంచింది. గతేడాది, ఈ ఏడాది వృద్ధిని పరిశీలిస్తే రెండేళ్లలో రూ.73 పెరిగింది. ఎక్కువ విస్తీర్ణంలో పంటకు నష్టం వాటిల్లిన గులాబీ రంగు కాయతొలుచు పురుగు దెబ్బకు ఇప్పటి వరకు కోలుకోలేకపోయామని పత్తి రైతులు వాపోతున్నారు. ఇప్పుడు తాజాగా పెరిగిన పత్తి విత్తనాల ధరల వల్ల వారిపై అదనపు ఆర్థిక భారం పడనుంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తికి పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రైవేట్ కంపెనీలు ఎమ్‌ఎస్‌పి కంటే అధికంగా పత్తిని కొనుగోలు చేశాయి. రాష్ట్రంలోని కొన్ని మండీలలో పత్తి ధర క్వింటాల్‌కు రూ.12,000కి చేరుకోగా, కేంద్రం ఎంఎస్‌పిని రూ.6,025గా నిర్ణయించింది.
పంజాబ్‌లోని మాల్వా ప్రాంతంలో అత్యధిక రైతులు పత్తి సాగుతో సంబంధం కలిగి ఉన్నారు. వీటిలో బటిండా, మాన్సా, ఫరీద్‌కోట్, అబోహర్, ఫిరోజ్‌పూర్, బర్నాలా, ముక్త్‌సర్ మరియు ఫజిల్కా జిల్లాలు ఉన్నాయి. ఇక్కడి రైతులు వ్యవసాయ వైవిధ్యం కింద పత్తి సాగుతో సంబంధం కలిగి ఉన్నారు.
కేంద్రం అనుసరిస్తున్న విధానం వల్ల వ్యవసాయ వైవిధ్యీకరణకు ఎదురుదెబ్బ తగిలింది. రైతులు పంటల వైవిధ్యాన్ని ఎంచుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి కానీ ఇతర పంటలు సాగు చేయడం ప్రారంభించినప్పుడు, కష్టకాలంలో వారికి ప్రభుత్వాల నుండి ఎటువంటి సహాయం అందడం లేదని ఆవేదన చెందుతున్నారు రైతన్నలు.