Farmers Suiciding In Telangana 2021 తెలంగాణాలో నానాటికి రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం వస్తే రాష్ట్రంలో రైతుల సమస్యలు పోతాయని ఆనాడు రైతులంతా తొలి దశ ఉద్యమంలో పాల్గొన్నారు. కానీ నేడు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రభుత్వం రైతుల ఆత్మహత్యల రాష్ట్రంగా మార్చింది. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏటా 600 మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న పథకాలు ఆత్మహత్యలను నివారించలేకపోతున్నాయి. రోజు ఎక్కడో ఓ చోట రైతన్న ఉరి కొయ్యకు వేలాడాల్సిన స్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ప్రపంచం అంత ముందుకు వెళ్తుంది. ఇక దేశంలో కార్పొరేటు సంస్థల అధిపతులు ప్రపంచ ధనవంతుల జాబితాలలో చోటు సంపాదిస్తుంటే దేశానికి అన్నం పెట్టే రైతులు మాత్రం ఆత్మహత్యల జాబితాలోకి ఎక్కుతున్నారు. వినడానికే అత్యంత బాధాకరంగా ఉన్నా , ఇది ఆ రైతు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగుల్చుతుంది.
తాజాగా తెలంగాణ రాష్ట్రంలో మరో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నలుగురు రైతులు వారి వారి సమస్యలతో తనువు చాలించారు. భూమిని ఫారెస్ట్ ఆఫీసర్లు గుంజుకుంటరేమోనన్న బెంగతో ఒకరు, పంటకు పెట్టిన పెట్టుబడి రాక ఇద్దరు, సర్కారు వడ్లు కొనదన్న బెంగ, అప్పుల బాధతో ఇంకొక రైతు బలవన్మరణానికి పాల్పడ్డారు.
1.మహబూబాబాద్ జిల్లాలోని పర్వతగిరిలో ఉంటున్న నారపల్లి సంపత్(29) తనకున్న కొద్దీ పొలంలో మిర్చి పంట వేశాడు. అయితే ఉన్నపళాన పంటకు తెగుళ్లు పట్టుకున్నాయి. దీంతో పంట తీవ్రంగా నష్టపోయింది. పెట్టిన పెట్టుబడి రాలేదు, తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలా అనే మనస్తాపంతో బుధవారం రాత్రి పది గంటలకు పురుగుల మందు తాగి చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
2. మెదక్ Medak జిల్లా రామాయంపేట మండలం శివ్వాయిపేటకు చెందిన ముత్యాలు, అతడి తల్లి బాలవ్వకు శివ్వాయిపేట సర్వే నెంబర్ 176/13లో చెరో 30 గుంటల భూమి ఉంది. అందులో బోరు వేసుకుని చాలా ఏండ్లుగా సాగు చేసుకుంటున్నారు. అయితే ఆ భూమి ఫారెస్ట్ భూమిగా పరిగణించి ఫారెస్ట్ అధికారులు చెప్పడంతో ముత్యాలు వద్ద ఉన్న పాసుబుక్ ని సంబంధిత వ్యవసాయ అధికారులు లాగేసుకున్నారు. దాంతో ముత్యాలుకు రావాల్సిన రైతుబంధు కూడా ఆగిపోయింది. ఇక తన భూమిని ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకుంటారేమోనన్న మనస్తాపంతో పొలంలోనే పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
3. రాజన్న సిరిసిల్ల Siricilla జిల్లా కోనరావుపేటకు చెందిన ఫణి నర్సయ్య (52) చెట్టుకు ఉరి వేసుకుని తనువు చాలించాడు. వివరాలలోకి వెళితే.. నర్సయ్య వరి పంట వేయగా.. యాసంగి పంటను సర్కారు కొనబోమని చెప్తుండటంతో దిగులు పెట్టుకున్నాడు. అసలే దిగుబడి లేక మనస్థాపానికి గురైన నర్సయ్య వడ్లు కొనమంటూ ప్రభుత్వం చెప్పడం, ఆది కాకా ఈ మధ్యే కూతురు పెండ్లి చేశాడు. దానికి రూ.5 లక్షల దాకా అప్పయింది. ఇదంతా నర్సయ్యను కుంగదీసింది. చేసేదేం లేక ఊరి శివారులో చెట్టుకు ఉరేసుకున్నాడు.
4. మహబూబాద్ జిల్లా కే సముద్రానికి చెందిన భూక్య బాలు (43) తనకున్న 30 గుంటల భూమిలో మిర్చి పంట వేశాడు. మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని వరి వేశాడు. పెట్టుబడి కోసం రూ.5 లక్షల దాకా అప్పు చేశాడు. అయితే, ఈ మధ్య మిర్చి పంటకు వైరస్ సోకింది. ఎన్ని మందులు వాడినా ఫలితం దక్కలేదు. దానికి తోడు వడ్ల దిగుబడి కూడా సరిగ్గా రాలేదు. దీంతో అప్పు తెచ్చి పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. ఆ అప్పు ఎలా తీర్చాలో తెలియక ఆవేదన చెందిన బాలు.. ఇంట్లో ఎవరూ లేని టైంలో పురుగుల మందు తాగాడు. Farmers Suiciding In Telangana
ఈ ఏడాది ఇప్పటి వరకు 700 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నది రైతు సంఘాల అంచనా. బలవంతంగా తనువు చాలిస్తున్న వారిలో ఎక్కువమంది కౌలు రైతులే ఉన్నారు. కారణాలు ఏవైనా రైతు చావులకు ప్రభుత్వాలు 100 శాతం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. దేశంలో మా రాష్ట్రమే నంబర్ వన్ అని చెప్పుకోవడం కాదు. ఒక్క రైతు చావు ఆపి అప్పుడు మేము ప్రపంచంలోనే నంబర్ వన్ చెప్పుకోవాలి అని అభిప్రాయపడుతున్నారు నిపుణులు. Telangana Farmers