ఉద్యానశోభవార్తలు

మునగ మొక్కల పెంపకంతో లాభాలు ఆర్జిస్తున్న రైతులు

0
Drumstick Farming Techniques
Drumstick Farming Techniques

ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి పెడుతున్నారు. తక్కువ పెట్టుబడితో కేవలం అర ఎకరం విస్తీర్ణంలో మునగ పంట సాగుచేసి అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. శాయంపేట మండలం గోవిందాపూర్ లోని 90 శాతం రైతులు మునగను పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. జాతీయ ఉపాధి హామీ పథకంగా ఆర్థికంగా సహకారం అందిస్తుండడంతో సాగు విస్తీర్ణం పెరిగింది. వరంగల్, చుట్టూ జిల్లాలతో పాటు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యాపారులు ఇక్కడి మునగ కాయలను కొనుగోలు చేసి తీసుకెళ్తుండటం గమనార్హం.
మునగ కాయలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలో గోవిందాపూర్ లో ఓ రైతు రాజమండ్రి నుంచి మునగ మొక్కలు తెచ్చి సాగు చేశాడు. మంచి లాభాలు రావడంతో మిగిలిన రైతులు కొన్ని సంవత్సరాలుగా అదే బాటలో మునగను భారీ స్థాయిలో పండిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తుండడంతో రైతులంతా ఈ సాగుపై మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం గ్రామంలో సుమారు 160 మంది రైతులు సుమారు 100 ఎకరాల్లో మునగ సాగు చేస్తున్నారు. అయితే ఉపాధి హామీలో మొక్కల పిటింగ్, ప్లాంటింగ్ చేసినందుకు వంద రోజుల పనిదినాలు కల్పించి నిర్దేశిత వేతనంగా డబ్బులు చెల్లిస్తున్నారు. సుమారు 500 మొక్కలకు రూ. 10 వేలకు పైగా చెల్లిస్తున్నట్లు రైతులు తెలిపారు. అలాగే మునగ పంట వేసిన రైతులకు కొన్ని నెలలపాటు మెయింటనెన్స్ ఖర్చులు చెల్లిస్తున్నారు. ఒక్కో రైతుకు సుమారు 12 మస్టర్లు చెల్లిస్తున్నట్లు చెప్పారు. దీంతో రైతులు కూడా మునగ పంట సాగు చేసేందుకు ముందుకు వస్తున్నారు. స్థానిక నర్సరీలో 50 వేల నుంచి 70 వేల వరకు మునగ మొక్కలను ప్రతి ఏడాది పెంచుతూ రైతులకు ఉచితంగా ఇస్తున్నారు. ఈ మొక్కలు లేదా విత్తనాలను జూన్ లో నాటుతారు. ఏ సమయంలో మొక్కలు పెట్టినా డిసెంబర్, జనవరి నెలలోనే పంట వస్తుంది. ఆరు నెలల్లో చేతికొచ్చే పంట ఇదీ. ఒకసారి పంట వేస్తే 10 నుంచి 15 క్రాపుల్లో కాయలు వస్తాయి. 2 నుంచి 5 సంవత్సరాల వరకు క్రాప్ తీసుకోవచ్చు. ఇందుకు తగిన మోతాదులో ఎరువులను వాడడంతోపాటు వాతావరణం కలిసి వస్తే దిగుబడి బాగా వస్తుందని రైతులు చెబుతున్నారు. మునగలో పత్తిని అంతర పంటగా సాగు చేస్తున్నారు. పత్తి ఏరినాక రోటోవేటర్ తో తొలగించి మళ్ళీ సాగు చేస్తున్నట్లు తెలిపారు. ఇరవై గుంటల్లో మునగ పండిస్తున్న రైతుకు రూ. లక్ష వరకు లాభాలు ఆర్జిస్తున్నట్లు చెప్పారు. మునగ కాయలను కిలోల లెక్కన విక్రయిస్తున్నారు. వరంగల్ తోపాటు ఇతర జిల్లాల నుంచి వ్యాపారులు వచ్చి మునగకాయలను కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. మునగ కాయలనే కాకుండా గింజలను కూడా రూ. 2 వేల నుంచి రూ. 4 వేలకు కిలో చొప్పున అమ్ముతూ అదనపు ఆదాయం పొందుతున్నారు. చుట్టు గ్రామాల సర్పంచులు, నర్సరీల్లో పెట్టేందుకు గింజలను ఇస్తూ పంటను విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా ఉద్యానశాఖ అధికారుల నుంచి సహకారం అందించాలని, వర్షాకాలంలో కాసే మునగ రకం విత్తనాలు, మొక్కలు అందించాలని రైతులు కోరుతున్నారు.

Leave Your Comments

క్లోనింగ్ విధానంలో తైవాన్ జామ..

Previous article

కరివేపాకు టీ ప్రయోజనాలు..

Next article

You may also like