పశుపోషణవార్తలు

పశువులకు పుష్టి – హెర్బల్ మిక్చర్

0

మినరల్ మిక్చర్, కాల్షియం లకు బదులుగా హెర్బల్ మిక్చర్ ఉపయోగపడుతుంది. పాడి రైతులే స్వయంగా తయారు చేసుకోవచ్చు.
ఈ హెర్బల్ మిక్చర్ జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. తద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీన్ని తిన్న పశువులు ఎండు/ పచ్చి గడ్డి ఎక్కువ తింటాయి. కాబట్టి, ఆ మేరకు దాణాను తగ్గించుకోవచ్చు. గో సంరక్షణ శాలలకు దానాలు ఇచ్చే వారు ఈ హెర్బల్ మిక్చర్ ను స్వయంగా తయారు చేయించి దానం చేస్తే మేలు.
హెర్బల్ మిక్చర్ కు కావలసిన దినుసులు :
సొంఠి – 200 గ్రా. దీన్ని ఆయుర్వేదంలో మహా ఔషధంగా పిలుస్తారు. వాత, పిత్త, కఫ దోషాలను సమతూకం చేయగలదు. ప్రధానంగా ఆమ వాత రోగాన్ని నిర్మూలిస్తుంది. పిప్పళ్లు – 150 గ్రా. మెగ్నీషియం,కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ వంటి మినరల్స్ అధికంగా కలిగి ఉండి జీర్ణశక్తిని బాగా పెంచుతుంది.
మిరియాలు – 150 గ్రా. దీన్ని రసాయన గుణకారిణి అంటారు. అరుగుదలకు బాగా ఉపయోగపడటమే కాకుండా గర్భాశయ శుద్ధికి దోహదపడుతుంది. రక్తాన్ని పెంపొందిస్తుంది.
వాములయు మిరియాలు – 50 గ్రా. దీన్నే వాయు విడంగాలు అని కూడా పిలుస్తారు. జీర్ణవ్యవస్థలో ఉండే పలు రకాల రుగ్మతలను తొలగించడంతో పాటు మంచి డీ వార్మింగ్ దినుసుగా ఉపయోగపడుతుంది.
తోక మిరియాలు – 50 గ్రా. వీటిని చలువ మిరియాలు అంటారు. శరీరానికి చలువ చేస్తూ గుండె రక్త ప్రసరణ బాగా జరిగేటట్లు నాలుకపై రుచి గ్రంధుల వృద్ధికి. మూత్ర వ్యవస్థ శుద్ధికి చాలా ఉపయోగకారిని .
వాము – 200 గ్రా. మనుషులు వామును ఎక్కువగా జీర్ణాశయ సమస్యలకు ఉపయోగిస్తారు. కానీ పశువుల్లో పాల స్రావాన్ని మెరుగుపరిచే చను గ్రంథులకు శ్రీరామరక్షగా వాము ఉపయోగపడుతుంది.
పాల ఇంగువ – 100గ్రా. ఇది ఒక యాంటీ మైక్రోబియల్ దినుసు. సుఖ విరేచనాకారి గాను, నరాల ఉత్తేజకారిణిగాను ఉపయోపడుతుంది.
వెల్లుల్లి – 300 గ్రా. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయలేదు అనే నానుడి ఉండనే ఉంది. వెల్లుల్లి కూడా అంతే. ఇది ప్రధానంగా పరాన్న భుక్కులను సమూలంగా నశింపజేస్తుంది.
మెంతులు -150 గ్రా. మెంతులు యాంటీ ఇన్ఫలమేటరీ గుణాల వలన పశువులో పొదుగు వాపు దరిచేరనీయక పాల రుచిని బాగా పెంచుతుంది.
మోదుగుపువ్వు 300గ్రా. శివునికి ఇష్టమైన పువ్వు ఇవి కడుపులోని బద్దె పరుగుల నివారణకు, చర్మ వ్యాధుల వలన వచ్చే దురదలను అలాగే విషతుల్యాల నుంచి రక్షణ కల్పిస్తాయి.
దాల్చిన చెక్క – 50గ్రా. ఇందులోని 41 సమ్మేళనాలు అనేక రుగ్మతలపై విశేషంగా పనిచేస్తాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పుల నివారిణిగా,మెదడుకు రక్షణ కారిణిగా పనిచేస్తుంది. ప్రత్యుత్పత్తి వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
నల్లనువ్వులు లేదా వేరు పిసరాకు – 1.5 గ్రా. జింక్, థయామిన్, ఐరన్, కాల్షియం, విటమిన్ ఇ సమృద్ధిగా ఉండటం వలన వీటిని ఆంగ్లంలో పవర్ హౌజ్ అని పిలుస్తారు. పశువులను ముఖ్యంగా యువి కిరణాల నుంచి నల్ల నువ్వులు రక్షిస్తాయి. నోటి పూతల నివారణకు ఉపయోగపడుతుంది. నల్ల నువ్వుల్లో ఉండే పోషకాలు వేరు పిసర ఆకులో కూడా ఉంటాయి. కాబట్టి ఈ రెండింటిలో దేనినైనా వాడుకోవచ్చు.
ఉలవలు – 1.5 కిలోలు వీటిలో పోషక విలువల అధికంగా ఉంటాయి. కంటి చూపును మెరుగుపరచడంలో విశేషంగా పనిచేస్తాయి.
తాటి బెల్లం – 1.5 కిలోలు ఐరన్ అధికంగా ఉంటుంది. జీర్ణాశయ ఎంజైముల పనితీరును మెరుగుపరుస్తుంది. రక్తహీనతను దూరం చేస్తుంది. పేగుల్లో ఉన్న విషతుల్యాలను తొలగించడంలో బాగా ఉపయోగపడుతుంది.
యాలకులు – 50 గ్రా. యాలకులలో టర్పనైన్, లియోనెన్ లాంటి రసాయనాలు ఉన్నాయి. ఉదర సంబంధమైన అజీర్తి, మలబద్దకాన్నే కాకుండా అల్సర్ ను సైతం నివారిస్తాయి.
లవంగాలు – 100 గ్రా. ఇవి రక్తాన్ని గడ్డకట్టడంలోనూ, నొప్పులు, వాపులు నియంత్రించడంలోనూ, రక్త ప్రసరణలోనూ, సంతాన ఉత్పత్తిలోనూ పశువులలో చక్కగా పనిచేస్తాయి. పైన ఉదహరించిన దినుసులను దంచి మిశ్రమంగా చేసుకొని తగు పాళ్ళలో ఆవ నూనె (750 ఎం. ఎల్. నుంచి ఒక లీటరు వరకు) కలుపుకొని తడి తగలకుండా 2 నెలల పాటు నిల్వ ఉంచుకోవచ్చు.
వాడే విధానం:
పెద్ద పశువులకు రోజుకోసారి 50 గ్రా. మోతాదులో, దూడలకు రెండు నెలలు దాటిన దగ్గర నుంచి 5 – 20 గ్రాముల మోతాదులో తినిపించాలి. ప్రతి రోజూ అక్కర్లేదు. వరుసగా నెలకు 10 – 15 రోజులకు తగ్గకుండా వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఈ మిశ్రమంతో పశువులను అనేక రుగ్మతల నుంచి కాపాడుకోవచ్చు. అంతే కాకుండా దుకాణాల్లో దొరికే మినరల్ మిక్చర్, కాల్షియం వాడకంతో పని లేకుండా అనేక సమస్యలకు ఇది ఒక మంచి పరిష్కారం. పైన చెప్పిన మోతాదులో తయారుచేసుకున్న హెర్బల్ మిక్చర్ 10 పెద్ద పశువులకు, 5 దూడలకు(10 రోజులు) సరిపోతుంది.

Leave Your Comments

యాసంగి పంటల ప్రణాళికపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు

Previous article

ఇంటర్నేషనల్ కాఫీ డే – కాఫీ వలన కలిగే ప్రయోజనాలు, నష్టాలు

Next article

You may also like