జాతీయంవార్తలు

Empowering women with cottage industries!: కుటీర పరిశ్రమలతో మహిళా సాధికారత !

0
WOMEN EMPOWERMENT

Empowering women with cottage industries!: కుటుంబ వ్యవస్థకు స్త్రీలు కేంద్ర బిందువులాంటి వారు. మన దేశ మొదటి ప్రధాన మంత్రి నెహ్రు ఏమన్నారంటే…ఏ దేశం పరిస్థితినైనా అంచనా వేయాలంటే ముందుగా ఆ దేశంలోని మహిళల పరిస్థితులను అంచనా వేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అందువల్ల మహిళల సామాజిక, సాంఘీక, ఆర్ధిక పరిస్థితులను మెరుగుపరచడానికి వారిని స్వయం ఉపాధి బాటలో నడిపించాల్సిన అవసరం ఉంది. మహిళలు తక్కువ పెట్టుబడితో స్థాపించి నిర్వహించగలిగే కుటీర పరిశ్రమలను చేపట్టే విధంగా వారికి తగిన ప్రోత్సాహం, సహకారం అందించాలి. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని భారత ప్రభుత్వం ఎన్నో పథకాలను రూపొందించి అమలు చేస్తోంది.

కుటీర పరిశ్రమలు అంటే…
కుటీర పరిశ్రమ అనేది ఒక చిన్న స్థాయి ఉత్పత్తుల తయారీ వ్యాపారం. తక్కువ పెట్టుబడితో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ఇంటిలోని ప్రతి స్త్రీ విజయవంతంగా నిర్వహించగలిగే పరిశ్రమలు లేదా తక్కువ పెట్టుబడితో ముగ్గురు లేదా నలుగురు కుటుంబ సభ్యుల సహకారంతో నిర్వహించుకోగలిగే చిన్న తరహా పరిశ్రమలు.ఈ కుటీర పరిశ్రమలను ముఖ్యంగా 3 రకాలుగా విభజించవచ్చు.

  • వ్యవసాయ ఆధారిత కుటీర పరిశ్రమలు (ఫామ్) : ఉదా: లాభదాయకమైన వాణిజ్య, పంటలపెంపకం, ఉద్యానవన పంటల పెంపకం, పాడి పరిశ్రమ, కోళ్ళ పరిశ్రమ లేదా పౌల్ట్రీ, గొర్రెలు, మేకల పెంపకం వగైరా…
  • వ్యవసాయేతర పరిశ్రమలు (నాన్ ఫామ్): ఉదా : అగరుబత్తులు, కొవ్వొత్తుల తయారీ, ఫినాయిల్, డిటర్జెంట్ల తయారీ మొదలైనవి.
  • వాణిజ్య సంబంధిత కుటీర పరిశ్రమలు (ట్రేడ్): ఉదా: కిరాణా షాపులు, జిరాక్స్ సెంటర్లు, ఫాన్సీ స్టోర్ల వంటివి. మహిళలు, తమ తమ నైపుణ్యాలు, శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా సరైన కుటీర పరిశ్రమలను ఎంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కుటీర పరిశ్రమల వల్ల లాభాలు:

  •  మహిళల ఆర్ధికాభివృద్ధి దిశగా అడుగు వెయ్యడానికి తోడ్పడతాయి.
  • మహిళలు సాధికారతను సాధించవచ్చు.
  • కుటుంబ సాంఘీక, ఆర్ధిక స్థితిని మెరుగుపరచుకోవచ్చు.
  •  పిల్లల సంపూర్ణ వికాసానికి కావాల్సిన ఆర్థిక సమీకరణకు ఇవి ఎంతగానో దోహదపడతాయి.
    అందువల్లనే గాంధీజీ కుటీర పరిశ్రమలను ప్రోత్సహించడమే కాకుండా ఇవి దేశాభివృద్ధికి పట్టుకొమ్మలు అని పేర్కొన్నారు. అంతేకాకుండా గాంధీజీ సేవా గ్రామ్ స్థాపించి కుటీర పరిశ్రమలను ప్రోత్సహించారు. రవీంధ్రనాధ్ ఠాగూర్ శ్రీనికేతన్ ను పశ్చిమ బెంగాల్లో స్థాపించి కుటీర పరిశ్రమలను గురుదేవులుగా ప్రోత్సహించారు.

WOMEN POWERMENT

కుటీర పరిశ్రమలను ప్రోత్సహించే సంస్థలు ముఖ్యంగా మహిళల ఆసక్తి, అనుభవం, నైపుణ్యతలను దృష్టిలోపెట్టుకొని వారికి ఆయా రంగాలలో శిక్షణ, సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది. ఉదా : రైతు మహిళలను వ్యవసాయ ఆధారిత కుటీర పరిశ్రమలను చేపట్టే విధంగా ప్రోత్సహిస్తే, ఆ రంగంలో వారికి ఉన్న అనుభవానికి శిక్షణ, ఆర్ధిక సహకారం తోడై, వారు విజయ పథంలో పయనించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వ్యవసాయ రంగంలో లేని మహిళలకు అగరుబత్తులు, కొవ్వొత్తుల తయారీ వంటి వ్యవసాయేతర కుటీర పరిశ్రమలలో శిక్షణ ఇచ్చినట్లయితే వారి ఆర్థిక పరిస్థితి మెరుగు పరుచుకునే అవకాశం ఉంటుంది. విద్యావంతులైన స్త్రీలు, యువతులకు వాణిజ్య సంబంధిత కుటీర పరిశ్రమలు చేపట్టే దిశగా ప్రోత్సహించవచ్చు.

శిక్షణ ఎక్కడ ఇస్తారు ?

వ్యవసాయ ఆధారిత కుటీర పరిశ్రమలు…
వ్యవసాయ ఆధారిత కుటీర పరిశ్రమలైన గొర్రెలపెంపకం, పట్టు పరిశ్రమ, వర్మి కంపోస్టు తయారీ, కోళ్ళ పెంపకం, పాడి పరిశ్రమ, పుట్ట గొడుగుల పెంపకం, పట్టు పురుగుల పెంపకాలను మహిళలు లాభదాయకంగా తక్కువ పెట్టుబడితో చేపట్టదగిన వ్యవసాయ ఆధారిత కుటీర పరిశ్రమలని ఐ.సి.ఏ.ఆర్. సంస్థ పేర్కొంది. అందువల్ల మహిళా రైతులు ఈ పరిశ్రమలు చేపట్టదలచినట్లయితే ప్రతి జిల్లాలో వ్యవసాయ శాఖ రైతు శిక్షణ సంస్థ (ఎఫ్.టి.సి.) లో శిక్షణ పొందవచ్చు. వ్యవసాయ శాఖ వారు కాకుండా వ్యవసాయ అనుబంధ శాఖలైన ఉద్యానవన శాఖ, మత్స్య శాఖ మొదలగు శాఖల శిక్షణా కేంద్రాలలో ఆయా శాఖలకు సంబంధించిన శిక్షణలను ఉచితంగా పొందడమే కాకుండా ఆర్ధిక సహాయాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా పొందవచ్చు. అదేవిధంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుసంధానమైన కృషి విజ్ఞాన కేంద్రాలు,ఏరువాక కేంద్రాలు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థల ద్వారా కూడా మహిళా రైతులు ఈ సాంకేతిక శిక్షణలను పొందవచ్చు. రాష్ట్ర స్థాయిలోని నైపుణ్య శిక్షణా సంస్థలు మహిళల సాధికారతక ఎన్నో శిక్షణలు ఇవ్వడమే కాకుండా వారికి తగిన క్షేత్ర సందర్శనలను కూడా నిర్వహిస్తున్నాయి. అందువల్ల మహిళలు ఈ శిక్షణా సంస్థల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వ్యవసాయేతర కుటీర పరిశ్రమలు…
వ్యవసాయేతర కుటీర పరిశ్రమల కోసం చేపట్టదగ్గ ప్రోత్సాహన్ని మహిళలకు జిల్లా గ్రామీణాభివృద్ధి ఏజెన్సీ, ట్రైనింగ్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ మరియు మినిస్ట్రీ ఆఫ్ హెచ్.ఆర్.డి. జన శిక్షణా సంస్థాన్, నెహ్రూ యువ కేంద్రాల నుంచి గాని, బ్యాంకులు నిర్వహిస్తున్న శిక్షణా సంస్థలు ఉదా :ఆంధ్ర బ్యాంక్, ఇన్ స్టిట్యూట్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ నుంచి తగిన శిక్షణలను పొందడమే కాకుండా రుణ సౌకర్యం కూడా పొందవచ్చు. రాష్ట్ర స్థాయిలో ఖాధీ విలేజ్ ఇండస్ట్రీస్ కార్పోరేషన్, ఖాధీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్ నుంచి బట్టల అమ్మకం, హస్తకళలు, గృహలంకరణ, గృహెూపకరణ వస్తువుల తయారీపై ప్రత్యేక శిక్షణలను అందుకోవచ్చు. జాతీయ స్థాయిలో ఖాధీ మహా విద్యాలయ, రూరల్ గ్రాండ్స్ ప్రోగ్రామ్, నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, ప్రధాన మంత్రి కౌశల్ వికాశ్ యోజన వంటి సంస్థలు గ్రామీణ మహిళలకు ఎన్నోరకాలైన లాభదాయకమైన కుటీర పరిశ్రమలపై ఉచిత శిక్షణలను అందిస్తున్నాయి. ఈ శిక్షణలు, సహకారం, పథకాల గురించి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వాణిజ్య రంగంలో…

  • వాణిజ్య రంగంలో కుటీర పరిశ్రమలైన కిరాణా షాపు యాజమాన్యం, జిరాక్స్ సెంటర్ల నిర్వహణ సంస్థలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ కార్పోరేషన్, బి.ఎం.పి. ల ద్వారా కుట్లు, అల్లికలు, మెకానిక్,రిపేరింగ్, డ్రైవింగ్ వంటి వాటిలో మహిళలకు శిక్షణ ఇస్తారు. చిన్న పరిశ్రమల అభివృద్ధి సంస్థ వ్యవస్థాపక నాణ్యత కలిగిన వ్యక్తులను గుర్తించడం, వారిని ప్రేరేపించడం, నిర్మాణాత్మక శిక్షణా కోర్సు ద్వారా వారికి శిక్షణ ఇవ్వడం, తద్వారా వివిధ ఏజెన్సీల నుంచి లభించే సహాయంతో చిన్న తరహా పరిశ్రమలను స్థాపించడానికి వీలు కల్పిస్తారు.
  • ఇక ప్రభుత్వ పథకాల విషయానికి వస్తే గ్రామీణ అభివృద్ధి శాఖ అమలు చేస్తున్న నైపుణ్యాభివృద్ధి, స్టార్ట్ అప్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలు ముఖ్యమైనవి. అందువల్ల స్త్రీలకు కుటీర పరిశ్రమలను ప్రోత్సహిస్తున్న మంత్రిత్వ శాఖల సంస్థలు, పథకాలను గురించి సమగ్రంగా తెలుసుకొని మహిళా సాధికారిత దిశగా పయనించాలని ఆశిద్దాం.మరిన్ని వివరాలకు సహ ఆచార్యులు (సామాజిక విజ్ఞాన శాస్త్రం), సామాజిక విజ్ఞాన కళాశాల, లాం, గుంటూరు, ఫోన్: 94941 92229 వారిని సంప్రదించవచ్చు.
Leave Your Comments

Integrated crop protection measures: సమగ్ర సస్యరక్షణ చర్యలలో ఉపయోగించు లింగాకర్షక ఎరలు వాటి ప్రాధాన్యత

Previous article

Rabi Groundnut cultivation in scientific method: శాస్త్రీయ పద్దతిలో యాసంగి వేరుశనగ సాగు

Next article

You may also like