ఆరోగ్యం / జీవన విధానంపశుపోషణపాలవెల్లువవార్తలు

పాల ఉత్పత్తి ద్వారా గ్రామీణ మహిళలకు ఉపాధి 

0
milk

                       గ్రామీణ ప్రాంతాలలో పాడి పశువుల పెంపకం పాల ఉత్పత్తి ద్వారా కుటుంబానికి కొంత    ఆదాయం చేకూర్చుకోవటం పల్లె వాసులకి అనాధిగా ఉన్న అలవాటు. స్త్రీలు పిల్లల పెంపకంలో ఎంత   శ్రద్ధ చూపిస్తారో పాడి పశువుల పోషణ సంబంధిత విషయాలపై కూడా అంతే శ్రద్ధ చూపిస్తారు. ఒక       సాధారణ రైతు కుటుంబంలో స్త్రీ తనూ ఏ విధంగా కొంత డబ్బు సంపాదించి, కుటుంబానికీ ఆసరాగా నిలవాలి అనే ఆలోచనతో ఎంతో కష్టనష్టాలను ఓర్చుకొని  నేటికీ శ్రమపోరాటంతో జీవనం సాగిస్తూ ఉంది. 

                    గ్రామీణ స్త్రీల జీవన విధానం మెరుగుపడాలంటే తప్పనిసరిగా విషయ పరిజ్ఞానాన్ని పెంచాలి. ముఖ్యంగా గ్రామీణ ఉపాధులపై శిక్షణలు ఎంతో అవసరం. పాడి పశువుల పోషణ వారికి కొత్త కాకపోయినా పాలపదార్ధాల తయారి ద్వారా ఏ విధంగా లాభాలు పొందగలరు అనే అంశాలపై ఎక్కువ శిక్షణాలు అవసరం. గృహ విజ్ఞాన శాస్త్రవేత్తలు ఈ విషయాలపై అధ్యయనం చేయగా  కొంతమంది స్త్రీలకు ఉపాధి కల్పించినట్లే, వారిని చూసి మరికొంత మంది మహిళలు ముందుకు రాగలుగుతారు. 

                     నేడు యువతీ యువకులు, ఆడవాళ్ళు పాల ఉత్పత్తిని స్వయం ఉపాధి కార్యక్రమంగా చేపడుతున్నారు. కొంతమంది పాలను పక్క పట్టణాలలో సరఫరా చేసి లాభాలను పొందగలుగుతున్నారు. త్రాగే పాలకే ఎక్కువ గిరాకీ ఉన్నా కొన్ని కారణాల వల్ల పాలతో అనేక పదార్ధాలను  తయారు చేయవలసి వస్తుంది. ముఖ్యంగా పాల ఉత్పత్తి స్థిరంగా ఉండదు. కొన్ని కాలాల్లో పాలకు గిరాకీ తగ్గుతుంది. పాలను నిల్వ ఉంచుకోవడం కూడా కష్టం. పాలను కొనుగోలు చేసే డైరీల నిల్వ సామర్ధ్యం ఎక్కువగా లేనట్లైతే పాల కొనుగోలు నిలిపి వేస్తారు. పాలు గ్రామాల్లోనే మిగిలిపోతాయి. 

                       ఈ  మిగిలిన పాలతో పదార్ధాలను  తయారు  చేసి అమ్మినట్లయితే అధిక లాభం వస్తుంది. గ్రామంలో కొంతమంది స్త్రీలకు ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయి. పాలను నాణ్యమైన పదార్ధాలుగా మార్చినట్లయితే పాల నిల్వ సామర్ధ్యం పెరిగి, పాలపోషక విలువలను ఉపయోగించుకోవటమే గాక పాలవిక్రయం కంటే అధిక లాభాలు రాగలవు. పాల నుండి తయారైన ఉత్పత్తులు పాల పదార్ధాల గుణాన్ని బట్టి ఒకరోజు నుండి కొన్ని నెలలు వరకు నిల్వ పెట్టొచ్చు అంటే పాలనిల్వ సామర్ధ్యం పాలపదార్ధాలు తయారు చేసినందున పెరుగుతుందన్నమాట. అంతేగాక పాలపదార్ధాలలో పౌష్టిక విలువలు పాలకంటే ఎక్కువ సాంద్రతతో  ఉంటాయి. ఈ క్రింది పట్టికతో పోషక విలువలను పరిశీలించవచ్చు. 

                               పాలు, పాల ఉత్పత్తుల పోషక విలువలు  

పాలు/పాల ఉత్పత్తులు : గేదెపాలు 

             శక్తి(క్యాలరీలు): 117 

             మాంసకృత్తులు(గ్రా): 4.3 

             క్రొవ్వు(గ్రా): 6.5 

             కాల్షియం(మి. గ్రా): 210 

             ఇనుము(మి. గ్రా): 0.2 

పాలు/పాల ఉత్పత్తులు : ఆవుపాలు 

             శక్తి(క్యాలరీలు): 67 

             మాంసకృత్తులు(గ్రా): 3.2 

             క్రొవ్వు(గ్రా): 4.1 

             కాల్షియం(మి. గ్రా): 120 

             ఇనుము(మి. గ్రా): 0.2 

పాలు/పాల ఉత్పత్తులు : పెరుగు 

             శక్తి(క్యాలరీలు): 60 

             మాంసకృత్తులు(గ్రా): 3.1  

             క్రొవ్వు(గ్రా): 4 

             కాల్షియం(మి. గ్రా): 120 

             ఇనుము(మి. గ్రా): 0.2 

పాలు/పాల ఉత్పత్తులు: ఛెన్నా (గేదె పాలతో)

             శక్తి(క్యాలరీలు): 292 

             మాంసకృత్తులు(గ్రా): 13.4 

             క్రొవ్వు(గ్రా): 23 

             కాల్షియం(మి. గ్రా): 480 

             ఇనుము(మి. గ్రా): –

పాలు/పాల ఉత్పత్తులు: కోవా (గేదె పాలతో)

             శక్తి(క్యాలరీలు): 421 

             మాంసకృత్తులు(గ్రా): 14.6 

             క్రొవ్వు(గ్రా): 31.2 

             కాల్షియం(మి. గ్రా): 650  

             ఇనుము(మి. గ్రా): 5.8 

                                పాలపదార్ధాలలో కొన్నింటిని ముఖ్యంగా పాలపొడి, ఛీజ్ మొదలగినవి తయారు చేయాలంటే పెద్ద పెద్ద పరికరాలు ఎక్కువ పెట్టుబడి, ఎంతో శాస్త్రపరిజ్ఞానం కావాలి. అయితే మరికొన్ని పాల పదార్ధాలను  మహిళలు చిన్న చిన్న పాత్రలలో , తగిన పెట్టుబడితో పల్లెల్లో తయారుచేసి లాభాలు పొందవచ్చు, మహిళలు సులభంగా తయారు చేయగల ఉత్పత్తులు పెరుగు, మజ్జిగ, నెయ్య,వెన్న,కోవా,కోవాతో చేయగల స్వీట్స్, ఛెన్నా- చెన్నతో తయారయ్యే స్వీట్స్,పన్నీర్,సుగంధపాలు, ఐస్ క్రీమ్, కుల్ఫీ, క్రీమ్,కీర్,బాసుంది. వీటిని పట్టణాలలో ఎంతో డబ్బు వెచ్చించి కొంటూ వుంటారు. వీటికి వివాహదీ శుభకార్యాల సీజన్ లో ఎక్కువ గిరాకీ ఉంటుంది. మహిళలు వీటిని తయారుచేసి ఆర్డర్లు పొంది అమ్మటం ద్వారా ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చు. ఒక కుటీర పరిశ్రమగా చేపట్టి తమకే కాక మరి కొంతమంది మహిళలకు ఉపాది కల్పించటం ద్వారా తోటి మహిళలకు చేయూత నిచ్చిన వారవుతారు. ఇది అందరూ గర్వించ దగిన ఉత్పత్తులను తయారుచేసే విధానం గురించి తెలుసుకుందాం. 

ఛెన్నా: మనం తయారు చేసే రకరకాల స్వీట్స్ లో ఛెన్నా వాడతారు. రసగుల్లా, రసమల్లాయి, సందేష్, రసమాధురి  మొదలగు  స్వీట్స్ కి ఛెన్నా అవసరం. 

కావలసిన వస్తువులు:

పాలు – 5 లీ 

నిమ్మఉప్పు – 8 గ్రా లేక నిమ్మరసం – ఒక చిన్న కటోరి 

స్టీలు గిన్నెలు, గరిటె, కప్పు, వడగట్టటానికి బట్ట 

తయారీ పద్ధతి: 

               పాలును స్టీలు గిన్నెలో పోసి స్టౌమీద ఉంచి ఒక పొంగు వచ్చే వరకు కాయాలి. పాలను కలుపుతూ 5 ని.లు చల్లారనివ్వాలి. వేడి పాలకు నిమ్మరసం కలిపి పాలను విరగనివ్వాలి. తేటగా పల్చుటి మజ్జిగ లాగా ఉన్న ద్రవం పాలలో ఉంటే ఘన పదార్ధాలు ముద్దలు ముద్దలుగా వేరయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఈ పాల విరుగుడును గుడ్డలో పోసి వడగట్టాలి. వడకట్టే సమయంలో పిండటం చేయకూడదు. గుడ్డపై మిగిలిన పాల విరుగుడు ముద్దనే ఛెన్నా అంటారు. పాల విరగ కొట్టడానికి సరైన పరిమాణంలో నిమ్మ ఉప్పు లేక నిమ్మరసం వినియోగించాలి. లేకుంటే పాలు సరిగా విరగక ఛెన్నా పరిమాణం తగ్గిపోతుంది.   

ఛెన్నా తయారీ ఖర్చు: రూ.130(5 లీ.పాలతో)

                     1 లీటరు పాల నుండి 600 గ్రా రసగుల్లాలకు ఛెన్నా తయారవుతుంది. 5 కేజీల చెక్కరతో మొత్తం (5 లీటర్లతో తయారై ఛెన్నాతో) 6-7 కేజీల రసగుల్లాలు తయారు చేస్తే సుమారు రూ.270 లాభం మహిళలకు మిగులుతుంది. చెక్కర ధరను కూడా ఛెన్నా తయారీ ఖర్చుతో కలపాలి.

కోవా తయారీ: 

                       అన్ని రకాల   స్వీట్స్ తయారీలో కోవా వాడకం తప్పనిసరి. అందుకే మార్కెట్లో కోవకు చాలా గిరాకీ ఉంది. కోవాలో కనీసం 20 శాతానికి తగ్గకుండా వెన్నఉండాలి. గేదె,ఆవుపాల నుండి లేక రెండిటి మిశ్రమం తో  కానీ కోవాను తయారు చేయవచ్చు. మంచి కోవాకు గేదె పాలే శ్రేష్టం. 

తయారీ పద్ధతి:      

                     5 లీ. తాజా గేదెపాలు ఇనుప కడాయిలో తీసుకొని ఎక్కువ మంతపై మరగపెట్టాలి. ఇలా మరిగే సమయంలో చదునుగా ఉన్న గరిటెతో వేగంగా చుట్టూ తిప్పుతూ ఉండాలి. అలా తిప్పకపోతే మాడిపోయే ప్రమాదం ఉంది. క్రమంగా పాలలోని నిరీ ఆవిరై పాలు చిక్క బడటం మొదలవుతుంది. పాల పరిమాణం దాదాపు 2.5 వంతులు తగ్గిన తరువాత చిక్కదనం ఎక్కువవుతుంది. ఈ దశలో వేగంగా తిప్పుతుండాలి. కోవా మాడకుండా జాగ్రత్త పడటం కోవా తయారీలో ముఖ్యం. ముద్దలాగా కడాయి నుండి కోవా వేరవుతున్న సమయంలో మంటపై నుండి తీసి ముద్దగా చేసి చల్లారాక కావలసిన సైజులలో చేసి అమ్మవచ్చు.

కోవా తయారీ ఖర్చు రూ.75 (5 లీ.పాలతో):

                  కిలో పాలతో 300 గ్రా కోవా తయారవుతుంది. అంటే 5 లీ. పాలతో 1.5 కిలోల వరకు కోవా తయారవుతుంది. దీనిని స్వీట్స్ తయారీలో వాడటం వల్ల లాభాలను పొందవచ్చు. 50 శాతం వరకు లాభం మిగులుతుంది. 

                   ఎన్నోరకాల పదార్ధాలను  పాలతో తయారు చేయటం వల్ల మహిళలు తాము ఉండే గ్రామల్లోనే చిన్న చిన్న గృహ పరిశ్రమలు నెలకొల్పటం ద్వారా ఉపాధి పొందగలరు. పట్టణాలలోని దుకాణాలలో తయారు చేయటం, తమ కాళ్ళ మీద తాము నిలబడగలిగే ఆర్ధిక స్థోమత సమార్చుకోగలరు పట్టుదల నేటి మహిళ అలవర్చుకోవాలి.

ఎ.నీలిమ, ఎ.ప్రసన్నరాణి, డా.వై.స్వాతి, డా.కె.తేజేశ్వరరావు మరియు డా.జి.రామకృష్ణ

కృషి విజ్ఞాన కేంద్రం, రస్తాకుంటుబాయి, విజయనగరంజిల్లా

 

Leave Your Comments

వీనస్ ఫ్లై ట్రాప్‌ను ఎలా పెంచుకోవాలి ?

Previous article

వర్షధార వ్యవసాయంలో నూనె గింజల సాగు – ప్రాముఖ్యత 

Next article

You may also like