ఆరోగ్యం / జీవన విధానంవార్తలు

కోడిగుడ్డులో అత్యధిక నాణ్యత కలిగిన ప్రోటీన్ ఉంటుంది

0
Egg

అసలు గుడ్డంత శ్రేష్టమైన ఆహారం మరొకటి లేదని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. పోషణలో తల్లి పాల తర్వాత స్థానం గుడ్డుదే. గుడ్డు అనేక విటమిన్లు, మినిరల్స్ తో నిండిన సూపర్ ఫుడ్డు. గుడ్డులో పొటాషియం, ఐరన్, జింక్, విటమిన్ ఇ, ఫొల్లేట్లు పుష్కలంగా ఉన్నాయి . అధ్యయనాలు, పరిశోధనల ప్రకారం, ప్రతి గుడ్డులో 6 గ్రాముల ప్రోటీన్లు, 78 కాలరీల శక్తి ఉంటాయి. నిజానికి గుడ్డు అనేక పోషకాల మిళితం. ఇందులో శరీరానికి అవసరమయిన అన్ని కీలకమైన విటమిన్లు, ఖనిజాలు, అన్సాచ్యురేటెడ్ కొవ్వులు, మాంసకృత్తులు లభిస్తాయి. తెల్ల సొనలో అల్బుమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ప్రోటీనులకు ఒక అద్భుతమైన మూలం. కండరాలను బలోపేతం చేసుకోవడానికి ఇది అద్భుతంగా సహాయపడుతుంది. తెల్ల సొన వల్ల మహిళలకు అవసరం అయ్యే కాల్షియం పుష్కలంగా అందుతుంది. ముఖ్యంగా, మహిళల్లో ఎముకల ఆరోగ్యానికి, ఆస్టియోపొరోసిస్ ను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. గుడ్డులోని తెల్లసోనలో హిస్టోడిన్‌, పచ్చసోనలో జింక్‌, కోలీన్‌, అయోడిన్‌, లినోలిక్‌ ఆసిడ్‌ ఉంటాయి. వీటితో కొత్త మేధస్సు కణాలు ఎప్పటికప్పుడు ఉత్పత్తి అవుతుంటాయి. గుడ్లలో చెడు కొలెస్ట్రాల్ ఉండదు. గుడ్డులోని పచ్చసొన గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు చాలా ఆరోగ్యకరం. గుడ్డులోని పచ్చసొనలో శరీర సౌష్టవాన్ని కాపాడే విటమిన్‌-డి, అనవసరమైన కొవ్వును కరిగించే కోలీన్‌, సెలీనియం, బి12 పుష్కలంగా ఉంటాయి. వారానికి మూడు సార్లు, రెండు గుడ్ల చొప్పున ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే ఊబకాయం, గుండె జబ్బులు తగ్గుతాయని అనేక పరిశోధనలు తెలియజేస్తున్నాయి. కోడి గుడ్డు తింటే దృష్టికి ఎంతో మేలు కలుగుతుంది. రోజు గుడ్డు తినేవారికి కంటిచూపు బాగుండటంతోపాటు, శుక్లాలు వచ్చే అవకాశం తగ్గుతుంది. గుడ్డులో విటమిన్‌-ఎ ప్రధానమైన జీవపోషకం. ఇది గుడ్డులోని పచ్చసొనలోనే అధికం. కంటి దోషాలను నివారించే జింక్‌, సెలినియం, విటమిన్‌-ఇ ఇందులో అధికంగా ఉన్నాయి.

ఇండియన్ మార్కెట్ రీసెర్చ్ బ్యూరో వారి రిపోర్టు ప్రకారం, 80 శాతం భారతీయుల ఆహారంలో ప్రోటీన్ల లోపం ఉన్నది. మనిషి బరువును బట్టి, కిలో బరువుకు, రోజుకు ఒక గ్రాము ప్రోటీన్ ను ఆహారంలో తీసుకోవాలి. మరొక రీసెర్చ్ రిపోర్టు ప్రకారం, 70 – 90 శాతం భారతీయులలో విటమిన్ డి లోపం ఉంది.

మన దేశంలో ఆహార ఉత్పత్తులు ఎంత పెరిగినప్పటికీ, ఆరోగ్యానికి అవసరమైనటువంటి పోషకాలు మాత్రం తగిన మోతాదులో అందరికి లభించటం లేదు. ఈ పరిస్థితి గ్రామాల ప్రజలు, ముఖ్యంగా పెరిగే పిల్లలు, గర్భిణీ స్త్రీలు, మరియు పాలిచ్చే తల్లులలో ఎక్కువగా కనిపిస్తున్నది. గ్రామీణ ప్రజలు పేదరికం ఒక కారణం కాగా, వారికి ఆహార పదార్థాలు వాటి పోషక విలువల గురించి సరైన అవగాహన లేకపోవడం కూడా ఒక ముఖ్య కారణం. మన దేశంలో జన్మించే పిల్లల్లో మూడోవంతు పిల్లలు, వారు పుట్టినప్పుడు ఉండవలసిన కనీస బరువు 3.2 కి.గ్రా. ఉండటం లేదు. అలాగే, మన దేశంలో 4 సం. లోపు వయసు పిల్లల్లో ఎక్కువ శాతం పిల్లలకు సరైన పోషకాహారం లభించకపోవడం వలన, వారు ఉండవలసిన బరువు ఉండకపోవడం, మరియు ఎదగవలసినంత ఎత్తు ఎదగకపోవడం వంటి పరిస్థితులకు దారి తీస్తున్నదని కూడా సర్వేలలో నమోదు చేయబడింది.

ప్రతి వ్యక్తి సంవత్సరానికి కనీసం 180 గుడ్లు తినాలని మన దేశపు జాతీయ పోషణ సంస్థ (National Institute of Nutrition) సూచించినది. కాని, మన దేశంలో సగటు వినియోగం 70 గుడ్లు మాత్రమే ఉన్నది.

ఇతర దేశాలతో పోల్చుకుంటే, భారత్ లో తలసరి గుడ్ల వినియోగం బాగా పెరగాలి. మెక్సికో, జపాన్, కొలంబియా లాంటి దేశాల్లో తలసరి వినియోగం 340 గుడ్లవరకు ఉంది. మన వద్ద అది 70 కంటే మించడం లేదు. గుడ్ల వినియోగంలో, ప్రపంచంలో మన ర్యాంకు 114. ఇది చాలా తక్కువ. ఈ విషయం గుర్తించిన మన ప్రభుత్వాలు కూడ, విద్యార్దులకు, గర్భిణి స్త్రీలకు, మధ్యాహ్న భోజనం లాంటి పథకాల్లో గుడ్లను అందించి, పోషకాహార లోపం తలెత్తకుండా చూస్తున్నాయి.

Leave Your Comments

బకాయి ఋణాలను పునర్నిర్మించాలని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రిని కలిసిన కాఫీ ఉత్పత్తిదారులు

Previous article

పంట నష్టం, రుణమాఫీ, ఫసల్ భీమా యోజనపై సమాధానం ఇచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

Next article

You may also like