వాణిజ్య పంటలలో ముఖ్యమైనది మిరప. విదేశి మార్కెట్ లో మంచి గిరాకీ పెంచుటకు మిరపకోత సమయంలో, కోత తరువాత రైతులు చేపట్టవలసిన జాగ్రత్తలు.
మిరపకోతకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు : మిరపకాయ కోతకు కనీసం 15-20 రోజుల ముందు నుంచి ఎటువంటి పురుగు మందులు, తెగుళ్ళ మందులు లేదా రసాయనాలు పిచికారి చేయరాదు. కోతకు ముందు పంటకు నీటి తడులివ్వరాదు.
కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: కాయల్ని మొక్క మీద ఎక్కువగా పండనిస్తే కాయలు ముడతలు పడటమే కాకుండా సూర్య కాంతి అధికముగా సోకి, రంగు తగ్గి నాణ్యత కోల్పోతాయి. మొక్క మీద పక్వానికి వచ్చి రంగు తిరిగిన కాయలను వాతావరణo వేడిగా ఉన్నపుడు మాత్రమే కోయాలి. సాధ్యమయినంత వరకు తెగుళ్ళు, పురుగులు ఆశించిన కాయలను కోత సమయంలో వేరుచేయాలి. వర్షాధార పంటలో 3-4 కోతలు, నీటి తడి పంటలో 6-8 సార్లుగా కోతలుకోయడo మంచిది.
మిరప కోత అనంతరం జాగ్రత్తలు: కోసిన కాయల్ని రాశిగా పోసి, పట్టాతో (టార్పలిన్ లేదా యూరియా గోతాల పరదా) ఒక రోజు అంతా కప్పి ఉంచితే, కాయలు అన్ని సరి సమానoగా పండుతాయి. కాయలను పాలిధీన్ పట్టలఫై లేదా శుభ్రమైన కాoక్రీటు కల్లాల మీద ఆరబెట్టాలి కాయలను ఎట్టి పరిస్థితిలో ఇసుక లేదా పేడ అలికిన కాల్లాల ఫై కాయల్ని ఆరబెట్టకూడదు. నేల మీద ఆరబెడితే నేలలోని తేమ వలన బూజుపట్టే అవకాశo ఉన్నది. రాత్రిళ్ళు మంచు బారిన పడకుండా రాత్రిపూట కాయలను పట్టాలతో కప్పి ఉదయాన్నే తేరవాలి. మిరపకాయలను పలుచగా పోసి రోజూ తిరిగతిప్పుతూ ఉoడాలి, కాయలు బాగా ఎండకపోతే రంగును, మెరుపును త్వరగా కోల్పోతాయి. కాయల్లో తేమ 10-11 శాతం వరకు వచ్చేలా ఎండబెట్టాలి. కాయలు ఎండబెడుతున్నప్పుడు దరిదాపుల్లో కోళ్ళు, కుక్కలు, ఎలుకలు, పందికొక్కులు రాకుండా చూడాలి.