Dr. Aldas Janaiah as the new Vice-Chancellor of PJTSAU: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నూతన ఉప కులపతి గా ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య శనివారం(అక్టోబర్ 19)ఉదయం బాధ్యతలు చేపట్టారు. విశ్వవిద్యాలయం పరిపాలనా భవనంలోని ఉపకులపతి ఛాంబర్ లో ఇన్ ఛార్జి ఉపకులపతి, రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రిన్సిపుల్ కార్యదర్శి, వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్ ఎం.రఘునందనరావు నుంచి జానయ్య బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విశ్వవిద్యాలయ అధికారులతో సమావేశమయ్యారు. ఇన్నాళ్ళూ ఇన్ ఛార్జి ఉపకులపతి గా విశ్వవిద్యాలయ పనితీరు మెరుగుపర్చటానికి సాధ్యమైనంత కృషి చేశానని రఘునందనరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ రంగం అత్యంత ప్రాధాన్యత రంగం అని ఆయన వివరించారు. రైతాంగం, వ్యవసాయ రంగ సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటుందని, విశ్వవిద్యాలయం ప్రభుత్వ లక్ష్యాలకి అనుగుణంగా పనిచేయాలన్నారు. అధునాతన టెక్నాలజీలని, డిజిటల్ విధానాలని అందిపుచ్చుకోవాలని రఘునందనరావు సూచించారు.
జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లోనూ, వ్యవసాయ విశ్వవిద్యాలయంలోనూ ఇప్పటికీ 15 హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించానని ఉపకులపతి జానయ్య తెలిపారు. తాను ప్రతి హోదాను అధికారంలా కాకుండా బాధ్యతగా భావిస్తానని వివరించారు. సమష్టికృషితో విశ్వవిద్యాలయాన్ని అగ్ర స్థానానికి తీసుకెళదామని జానయ్య పిలుపునిచ్చారు. బోధన, బోధనేతర సిబ్బంది ఉపకులపతి జానయ్యని కలిసి పుష్పగుచ్చాలు అందించి అభినందించారు.
రాష్ట్ర గవర్నర్ ను కలిసిన నూతన ఉపకులపతి:
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నూతన ఉప కులపతి గా నియమితులైన ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ఈ రోజు (అక్టోబర్ 21 న) మర్యాద పూర్వకంగా రాష్ట్ర గవర్నర్ ను కలిశారు.
Leave Your Comments