తెలంగాణవార్తలువ్యవసాయ పంటలు

యాసంగి వరికి ప్రత్యామ్నాయంగా మినుము సాగు – రైతు విజయగాథ

0

వరి తర్వాత వరిని పండించటం వల్ల పంటల వైవిధ్యం దెబ్బతింటుంది. అలాగే నేల చౌడు బారి, నిస్సారంగా తయారవుతుంది. అలాగే రైతులందరూ వరి తర్వాత వరిని పెద్ద ఎత్తున పండించడం వల్ల మార్కెటింగ్ విషయంలోనూ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని అటు ప్రభుత్వం, ఇటు శాస్త్రవేత్తలు రైతులందరికీ వివిధ కార్యక్రమాల ద్వారా విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. ఇదే కోవలో జిల్లా ఏరువాక కేంద్రం, కరీంనగర్ వారు వ్యవసాయ శాఖతో కలిసి యాసంగి వరికి బదులుగా ఆరుతడి పంటలను సాగు చేసే విధంగా అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. అదే విధంగా వరి తర్వాత ఆరుతడి పంటగా మినుము సాగును ప్రథమ శ్రేణి, ప్రదర్శన క్షేత్రాలను నిర్వహించి రైతులకు తెలియజేసారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని వంతడుపుల గ్రామానికి చెందిన పాశం రవీందర్ రెడ్డిది వ్యవసాయ నేపథ్య కుటుంబం. ఈయన దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి వానాకాలం, యాసంగిలో వరి పంటను సాగు చేసేవారు. గత కొద్ది కాలంగా కూలీల సమస్య, పెరుగుతున్న వరి విస్తీర్ణం వల్ల మార్కెట్లో ఇబ్బందులు తలెత్తడం వల్ల ఇతర పంటలను సాగు చేయాలనుకున్నారు. ఇందులో భాగాంగానే జిల్లా ఏరువాక కేంద్రం, కరీంనగర్ వారి సూచనలతో వరి తర్వాత మినుము (పియు 31) సాగు మీద ప్రథమ శ్రేణి క్షేత్రాన్ని 2022 వ సంవత్సరం యాసంగిలో చేపట్టారు. తర్వాత రైతు తానే స్వయంగా మినుము సాగును 2-3 రకాలతో సాగు చేశారు. ముందుగా వరి కొయ్యలను తొలగించి పొలంను దుక్కి దున్ని నేలను చదును చేశారు. ట్రైకోడెర్మా విరిడె 10 గ్రా. చొప్పున కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేసి అరగంట నీడలో ఆరబెట్టి పంటను విత్తుకున్నారు. ఎకరానికి 10-12 కిలోల విత్తనాన్ని వెదజల్లే విధానం ద్వారా విత్తుకున్నారు. విత్తిన వెంటనే కలుపు నివారణకు 1.2 లీటర్ల పెండిమిథాలిన్ 30 శాతం ఇసి మందును 200 లీటర్ల నీటిలో కలుపుకొని తేమ ఉన్నప్పుడు ఎకరం పొలంలో పిచికారి చేసుకున్నాడు. పంట మొలిచిన 25- 30 రోజుల తర్వాత గడ్డి, వెడల్పాకు, తుంగ నివారణకు ప్రొఫాక్విజలోఫాఫ్ 2.5 శాతం + ఇమాజితాఫిర్ 3.75 శాతం మందును 800 మి.లీ. ఎకరాకు పిచికారి చేయడం వల్ల కూలీలు లేకుండానే సమర్ధవంతంగా కలుపు నివారింపబడింది. ఎరువులు ఆఖరి దుక్కిలో ఎకరానికి 50 కిలోలు డిఎపి వేసి 30 రోజులప్పుడు ఎకరానికి 50 కిలోలు యూరియాను వాడటం జరిగింది. తొలి దశలో రసం పీల్చే పురుగుల నివారణకు ఎసిఫేట్ + ఇమిడాక్లోప్రిడ్ 1.5 గ్రా./ లీటరు నీటికి, మారుకా మచ్చల పురుగు నివారణకు క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మి.లీ./ లీటరు నీటికి కలిపి పిచికారి చేశారు.
మినుము, వరి పంటల్లో ఆదాయం, వ్యయాలు (రూ.లలో)

   క్ర. సం. అంశం              మినుము            వరి 

01. పొలం తయారీ              3800               6,500
02. విత్తనం ఖర్చు               1300                1200
03. విత్తుకోవడానికి                 500               5,500
04. కలుపు మందులు         2250              2,400
05. ఎరువులు                       1600              5,800
06. పురుగు మందులు        2650              5,800
07. పంట కోత, నూర్పిడి     2200              3,500
08. రవాణా ఖర్చు                  500                1000
09. మొత్తం సాగు ఖర్చు     14800            31,700
10. దిగుబడి ( క్వి/ఎ.)              6.2                    26
11. మద్దతు ధర ( క్వి/రూ.)    7,400             2180
12. స్థూల ఆదాయం              45,880        56,680
13. నిఖరాదాయం ( క్వి/ఎ.) 31,080         26,380
14. ఆదాయ, వ్యయ నిష్పత్తి  3.10:1            1.78:1

సరాసరిగ మినుములో ఎకరానికి 6.2 క్వింటాళ్ళ దిగుబడితో స్థూల ఆదాయం 45,880/-, నిఖరాదాయం రూ.31,080/- పొందడం జరిగింది.

డా. కె. మదన్ మోహన్ రెడ్డి, డా. ఎం. రాజేంద్ర ప్రసాద్, డా. జి. మంజులత,
డా. ఎ. విజయభాస్కర్, డా. జి. ఉషారాణి, డా. పి. మధుకర్ రావు, డా.డి.శ్రావణి
జిల్లా ఏరువాక కేంద్రం, వ్యవసాయ పరిశోధన స్థానం, కరీంనగర్

 

Leave Your Comments

కోకో సాగు – ఆదాయ వ్యయాలు

Previous article

PJTSAU వజ్రోత్సవ ఏర్పాట్లు

Next article

You may also like