కరువు పరిస్థితుల్లో పంటల సాగు కోసం పెట్టిన పెట్టుబడులు తిరిగి రాలేదు ఆ రైతుకు. నాలుగు బోరు బావులు తవ్వించగా ఒక్కదానిలో కాస్త నీరు వచ్చింది. ఆ కొద్దిపాటి నీరే అతనికి జీవనాధారమైంది. ఐదేళ్లుగా పూతోటలు, కూరగాయలు సాగు చేస్తూ లాభాల బాట పట్టారు జగదేవపూర్ మండలం బస్వాపూర్ కు చెందిన గుండ రాంరెడ్డి. ఆయనకు నాలుగు ఎకరాల పొలం ఉంది. తక్కువ నీటితోనే సాగు చేయడానికి ప్రభుత్వం నుంచి బిందు పరికరాలు పొందాడు. 30 గుంటల్లో బంతి, ఎకరాల్లో మిర్చి, గుమ్మడి, 30 గుంటల్లో టమాటా, మరో 20 గుంటల్లో బీర తోటలు వేశాడు. మిగిలిన పొలంలో పాడి పశువుల కోసం గ్రాసం పెంచుతున్నారు. పొలం వద్ద తాజా కూరగాయలు, పూలు అందుబాటులో ఉండటం వల్ల వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఓ పంటకు ధర లేకపోయినా మరోదానికి వస్తుండటంతో నష్టాల భయం లేదని రైతు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొమురవెల్లి, కొండపోచమ్మ దేవస్థానాల వారు, గుడిమల్కాపూర్ మార్కెట్ నుంచి వ్యాపారులు వచ్చి తీసుకెళ్తారని చెప్పారు.