వార్తలు

2.5 ఎకరాల కౌలు భూమిలో 46 రకాల వరి వంగడాల సాగు..

0

పాడి పరిశ్రమకు పెట్టింది పేరు ప్రకాశం జిల్లా పాకం గ్రామం. వేల సంఖ్యలో పశువులుండటంతో పాటు కందుకూరు రెవెన్యూ డివిజన్ లోనే ధాన్యం ఎక్కువగా పండించే గ్రామం. 20 సంవత్సరాల కిందటే పాకలకు చెందిన ఉలిచి జాలిరెడ్డి బాసుమతి రకం వరి పండించారు. ఈ గ్రామం వైద్యుల పురిటిగడ్డ. ఈ గ్రామస్తులు 70 మందికిపైగా డాక్టర్లున్నారు. ఇప్పుడు ఈ గ్రామానికి మరో ప్రత్యేకత వచ్చింది. ఒక కౌలు రైతు 46 రకాల వరి వంగడాలు సాగు చేస్తున్నారు. వీటిలో 41 మన దేశానికి చెందినవి కాగా 5 రకాలు విదేశాలవి. మరో ప్రత్యేకత ఏమంటే.. ఇవి సాగు చేస్తున్నది ఫ్లవర్ డెకరేటర్ షేక్ సుబానీ, సాగు మీద ఆసక్తితో 2.5 ఎకరాలు కౌలుకు తీసుకుని మరీ ఈ వరి రకాలను ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్నారు.
గోధుమ రొట్టెలు, రాగులు, కొర్రలతో తయారు చేసిన ఆహారం తీసుకోండి.. షుగర్ ఉన్న వాళ్ళు బియ్యంతో వండిన అన్నం తినటం వలన షుగర్ పెరుగుతుంది. షుగర్ ఉన్న వాళ్లకు లేని వాళ్లకు వైద్యులు తరచూ చెబుతున్న సలహాలు. హైబ్రిడ్ రకం వరి బియ్యంతో కూడిన ఆహారం తింటే అనారోగ్యం పాలవుతారని, ఆరోగ్యంగా ఉండాలంటే ఇతర రకాల పంట ఉత్పత్తులను తినాలని జరుగుతున్న ప్రచారం ఫ్లవర్ డెకరేటర్ గా జీవనం సాగిస్తున్న వ్యవసాయ కూలీ కుటుంబానికి చెందిన షేక్ సుబానీని మనసుని కదిలించింది. వ్యవసాయానికి పెట్టింది పేరైన ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల గ్రామానికి చెందిన షేక్ సుబానీ ఆరోగ్యాన్ని ఇచ్చే వరి వంగడాలను పండించాలని నిర్ణయించుకున్నారు. గ్రామంలో 2.5 ఎకరాలను కౌలుకు తీసుకున్నారు. కొత్త రకాల వరి, ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగుచేస్తానంటే ముందు కౌలుకు ఇచ్చేనందుకు పొలం యజమాని అంగీకరించలేదు. ఆయన్ని ఎలాగో ఒప్పించి కౌలుకు తీసుకున్న సుబానీ సోషల్ మీడియా ద్వారా వరి రకాలు, విత్తనాల లభ్యత గురించి తెలుసుకున్నారు. మన రాష్ట్రంలోను, తెలంగాణలోను వివిధ ప్రాంతాలకు వెళ్లి విత్తనాలు సేకరించారు. 2.5 ఎకరాలను 46 భాగాలుగా చేసి ఒక్కో భాగంలో ఒక్కో రకం వరి సాగుచేపట్టారు.
వివిధ రకాల వరి బియ్యంలో మంచి పోషక విలువకుంటాయని ఇవి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. రక్తశాలి రకం బియ్యం వాతం, కఫం వంటి వ్యాధులను తగ్గిస్తుందని, కర్పూకవని రకం బరువు తగ్గటానికి, క్యాన్సర్ నివారణకు, కుళ్లాకార్ రకం గర్భిణీ స్త్రీలకు మేలు చేస్తుందని పేర్కొంటున్నారు. వివిధ రకాల బియ్యం వల్ల రక్తహీనత తగ్గటమేగాక షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా తినవచ్చని పరిశోధనల్లో తేలింది. కొన్ని వరి రకాల బియ్యాన్ని పురి వంటి పుణ్యక్షేత్రాల్లో ప్రసాదాల తయారీలో వినియోగిస్తారు. తులసిబాసు, గ్రంథశాలి, అందెమొహల్ వంటి సుగంధ పరిమళాలు వెదజల్లే బియ్యంతో ప్రసాదాలు తయారుచేస్తారు. షేక్ సుబానీ పండిస్తున్న కోమల్ సాల్ (మ్యూజిక్ రైస్) రకం బియ్యం వేడినీళ్ళల్లో నానబెడితేనే అన్నం తయారవుతుంది.
షేక్ సుబానీ ఫ్లవర్ డెకరేటర్ గా జీవనం సాగిస్తున్నారు. తనకి వ్యవసాయం అంటే మక్కువ. సోషల్ మీడియా సహకారంతో ఆరోగ్యవంతమైన వరి రకాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే పోషక విలువలతో కూడినవి, ఔషధ గుణాలున్న వరి విత్తనాలను దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి సేకరించారు. పొలం కౌలుకు తీసుకుని ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఈ వరి రకాలను పండించారు. దిగుబడి బాగా రావటంతో పాటు ధాన్యం నాణ్యంగా కూడా ఉంది.
మన దేశానికి చెందిన వరి రకాలు:
నవారా, కాబిరాజ్ పాల్, రక్తశాలి, రక్తశాలి – 2, బహురూపి, పుంగార్, మాల్ సుందరి, రాజ్ ముడి, ఇంద్రాణి, కాలాబట్టి, రత్నచోడి, మైసూర్ మల్లిగ, నారాయణ కామిని, తోయపల్లి, చిట్టి ముత్యాలు, రెడ్ జాస్మిన్, బ్లాక్ జాస్మిన్, రాణి అఖండ, పిల్ కస్తూరి, ఆరువంబాకం కరువై, పంచరత్న, గంధశాలి, కాల్ బట్, దూదేశ్వర్, ఎన్ ఎమ్ ఎస్ – 2, అందెమొహర్, కుళ్లాకార్, కర్పుకవని, పసిడి, కాలాజీరా, ఇల్లపుసాంబ, బహుమలై, చికిలాకొయిలా, మ్యూజిక్ రైస్ (కోమల్ సాల్), తులసిబాస్మతి, కృష్ణ వ్రీహి, తన్ సుగంధ, ఎస్ ఎస్ 56 బ్లాక్, రామ్ లీ, సింతుక, రమ్యాగళి.
విదేశాల వరి రకాలు:
థాయ్ లాండ్ కు చెందిన గంగా గోల్డెన్ బ్రౌన్ రైస్, ఇండోనేషియాకు చెందిన గంగా రూబి రెడ్ రైస్, గంగారామ్ బాసుమతి, గంగా బ్రౌన్ రైస్, అమెరికాకు చెందిన బంగారు గులాబి.

Leave Your Comments

వేసవిలో శరీరాన్ని చల్లబరిచే సోంపు డ్రింక్ తయారీ.. ప్రయోజనాలు

Previous article

వేసవిలో కోళ్లకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

Next article

You may also like