వార్తలు

110 రకాల స్వదేశీ వరి వంగడాలను సాగు చేసిన కార్పొరేట్ ఉద్యోగి.. భాస్కర్

0

దేశానికి అన్నం పెట్టె రైతు తన కొడుకుని రైతుగా చూడాలనుకోని రోజులివి. అలాంటిది కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం వదిలేసి ఓ యువకుడు వ్యవసాయం వైపు మళ్లారు. ఏకంగా 110 రకాల దేశీయ వరి వంగడాలను సేంద్రియ విధానంలో సాగు చేస్తూ ఆదర్శముగా నిలిచారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రాజక్కపల్లి గ్రామానికి చెందిన గోల్కొండ భాస్కర్. రాత్రి పూత ఉద్యోగం , పని ఒత్తిడి , తదితర కారణాలతో అయిష్టంగానే హైదరాబాదులో ఐదేళ్లపాటు వివిధ రకాల కార్పొరేట్ ఉద్యోగాల్లో కొనసాగిన ఆయన.. ఓ రోజు యూట్యూబ్ లో పాలేకర్ సేంద్రియ వ్యవసాయ పద్ధతులు చూశారు. నచ్చడంతో సాగుపై దృష్టి సారించారు. ఇంట్లో భార్య, తల్లితండ్రులను ఒప్పించి తొలుత సేంద్రియ వ్యవసాయ పద్ధతులు, సేంద్రియ ఎరువుల తయారీ నేర్చుకున్నారు.

అందరి కంటే భిన్నంగా వుండాలని పూర్తిగా 110 రకాల స్వదేశీ వరి వంగడాలను సేంద్రియ వ్యవసాయం చేస్తున్న గురువు శివప్రసాద్ వద్ద సేకరించారు. తనకున్న రెండెకరాల్లో సిద్ద సన్నాలు వేశారు. మిగతా అర ఎకరంలో 110 రకాల విత్తనాలను వేశారు. ఒక్కో రకాన్ని రెండు వరుసల చొప్పున సాగు చేశారు. రక్తశాలి, కుల్తాఖర్,పుంగార్, కర్పూకౌవుని, మైసూర్ మెల్లిగ, చింతలూరు, కుజీపటాలీయా, ఇంద్రాణి, నవార, రామ్ జీరా, ఘని, రత్నచొడీ, సిధ్ధసన్నాలు , గురుమట్టియా, మడమురంగి, కెంపు సన్నాలు, దూదేశ్వర్, నారాయణకామిని, బర్మాబ్లాక్ లాంగ్, బాసుమతి, వెదురుసన్నాలు, కామినిభోగ్, కాలాబట్టి లాంటి వరి రకాలను సాగు చేశారు.

సేంద్రియ ఎరువులు, జీవామృతం, సహజ సిద్ధమైన ఎరువులను మాత్రమే వాడారు. ఇతర రైతుల పంటలకు చీడపీడలు పట్టినా ఆయన చేలో మాత్రం అవి దరి చేరలేదు. తేడా గమనించిన రైతులు ఆ వంగడాలు తమకు కావాలని కోరడంతో ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. పంట సాగు చేసిన రైతులు తిరిగి కొన్ని వడ్లు తనకు ఇవ్వాలని నిబంధన పెట్టారు. అలా ఇచ్చిన వడ్లను మరికొంత మందికి ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నానని చెబుతున్నారు భాస్కర్. సేంద్రియ పద్ధతిలో  సాగు చేసిన సిద్ధ సన్నాలు ధాన్యాన్ని క్వింటాలు రూ. 5 వేల చొప్పున విక్రయించారు. కనుమరుగవుతున్న దేశీయ వంగడాలను పూర్తి సేంద్రియ పద్ధతిలో రైతులు సాగు చేసేలా చూడాలనేదే తన లక్ష్యం అని అన్నారు భాస్కర్.

Leave Your Comments

ఇంగువ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Previous article

వ్యవసాయం చేస్తూ లక్షలు సంపాదిస్తున్న.. ప్రభుత్వ ఉద్యోగి

Next article

You may also like