Chilli ద్రవ్యాల పంటలలో మిర్చి ఒకటి. భారతీయులు వంటలలో వీటిని విరివిగా ఉపయోగిస్తారు. పచ్చిమిర్చి తినడం వల్ల చాలా లాభాలుంటాయి. ఇందులో విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఎక్కువగా నొప్పి నివారణకు మిరపకాయను ఉపయోగిస్తారు. కీళ్లనొప్పులు, తలనొప్పి, కాలిన గాయాలు, నరాలవ్యాధిని తగ్గించడానికి మిరపకాయ సారాన్ని వాడుతారు. రోగనిరోధక శక్తిని పెంచి, కొలెస్ట్రాల్‌ను తగ్గించే శక్తి మిర్చికి ఉందని అనేక పరిశోధనలలో తేలింది. జాతీయ మిరప టాస్క్‌ఫోర్స్ ప్రకారం దేశంలోని మొత్తం సుగంధ ద్రవ్యాల ఎగుమతిలో మిర్చిదే అగ్రస్థానం.సుగంధ ద్రవ్యాల మొత్తం ఎగుమతి రూ.21,500 కోట్లు ఉంటే అందులో కేవలం మిర్చి ఎగుమతి రూ. 6,500 కోట్లుగా ఉంటుంది. గత ఏడాది భారతదేశం నుంచి మొత్తం మసాలా ఎగుమతులు రూ.27,193 కోట్లు దాటాయి. దీంతో రైతులు ప్రస్తుతం మిర్చి సాగుకు ముందుకు వస్తున్నారు.
మిరప ఉత్పత్తి, ఎగుమతిలో భారతదేశం ప్రపంచ అగ్రగామిగా ఉంది. వాణిజ్య పంటలను ఉత్పత్తి చేసే రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. భారతదేశంలో పండించే మిరపకాయల నాణ్యతని ప్రపంచదేశాలు ప్రశంసించాయి. గత 10 సంవత్సరాలలో ఎగుమతులు పరిమాణం, విలువ రెండింటిలోనూ ఆరోగ్యకరమైన వృద్ధిని కనబరిచాయి. పురుగుమందుల అవశేషాలు అతితక్కువ మొత్తంలో కనుగొన్నారు. నేటికి భారతదేశ మిరప ఎగుమతులు ప్రపంచ మిర్చి వ్యాపారానికి 50 శాతానికి పైగా దోహదం చేస్తున్నాయి. చైనా సమీప పోటీదారుగా ఉంది కానీ రెండో స్థానంలో వెనుకబడి ఉంది.
కర్నాటకలో పండే ‘బయద్గీ’ మిరపకాయకి రంగు, ఘాటు కారణంగా ప్రపంచ మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది. గుంటూరు – ప్రకాశం – కృష్ణా ప్రాంతాల్లో పండే ‘తేజ’, ‘గుంటూరు సన్నం’ రకాలు భారతదేశంలో మిర్చి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలిపాయి. తర్వాతి స్థానాల్లో కర్ణాటక, మధ్యప్రదేశ్ ఉన్నాయి. మిరప ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ 26 శాతం వాటాను కలిగి ఉంది. ఆ తర్వాత మహారాష్ట్ర (15%), కర్ణాటక (11%), ఒరిస్సా (11%), మధ్యప్రదేశ్ (7%) ఉన్నాయి. ఇది కాకుండా ఇతర రాష్ట్రాలు మిర్చి మొత్తం విస్తీర్ణంలో 22% వాటాను కలిగి ఉన్నాయి.