ఆంధ్రప్రదేశ్తెలంగాణపశుపోషణవార్తలు

Cattle Diseases During Rainy Season: వర్షాకాలంలో పశువులకు సోకే వ్యాధులు- నివారణ చర్యలు

0
Cattle Diseases During Rainy Season
Cows

Cattle Diseases During Rainy Season: వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల వర్షాకాలంలో పశువులకు పలు రకాల వ్యాధులు వస్తుంటాయి.కాలానుగుణంగా వచ్చే సీజనల్ వ్యాధులు,అంటువ్యాధులు,ఇతర వ్యాధుల నుంచి రైతులు తమ పశువులను కాపాడుకోవాలి.వర్షాకాలంలో పరిసరాల అపరిశుభ్రత, వరద నీళ్ళు,మొలిచిన పచ్చిక గడ్డిపైన ఉండే కీటకాలతో కూడిన మేతను తినడం వల్ల పశువులు,మేకలు,గొర్రెలకు వివిధ రకాల వ్యాధులు సోకి అనారోగ్యానికి గురవుతాయి.తద్వారావ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి అంటువ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉండడమే గాక చివరకు ఆ పశువులు ప్రాణాలు కూడా కోల్పోతాయి. కావున వర్షాకాల సమయంలో పశువుల్లో వచ్చే అతి ముఖ్యమైన మూడు వ్యాధులు…గొంతువాపు,జబ్బవాపు,గాలికుంటు వ్యాధులు,వాటి నివారణ చర్యల గురించి తెలుసుకుందాం.

Cattle Diseases During Rainy Season

Cows

గొంతువాపు వ్యాధి :

దీనినే గురక వ్యాధి లేదా కంఠపు వ్యాధి అని కూడా అంటారు. ఈ వ్యాధి కారక సూక్ష్మక్రిమి (బ్యాక్టీరియా) పేరు “పాస్ట్యురెల్లా మల్టోసిడ.” ఇది పశువుల శ్వాసకోశ మార్గంలో ఉంటుంది. పశువు బలహీనంగా ఉన్నప్పుడు లేదా ఒత్తిడికి గురైనప్పుడు లేదా వర్షాకాలంలో నీరు నిలిచే ప్రాంతాల్లో ఉన్నప్పుడు గేదెలు,పశువులకు ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తుంది.వ్యాధిగ్రస్త పశువుల చొంగతో కలుషితమైన నీరు, మేత ద్వారా ఈ వ్యాధి ఆరోగ్యవంతమైన పశువులకు వ్యాపిస్తుంది.అంతే కాకుండా కరవు పరిస్థితులప్పుడు,వరదలు వచ్చినప్పుడు అధిక దూరం రవాణా చేసినప్పుడు ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది.

వ్యాధి లక్షణాలు :

⦁ వ్యాధి సోకిన పశువుల శరీర ఉష్ణోగ్రతలు బాగా పెరిగి తల,మెడ,ఛాతి,గంగుడోలు భాగాలలో చర్మం కింద నీరు చేరడం వల్ల వాపు ఏర్పడుతుంది.
⦁ ముక్కు,కళ్ళ నుంచి ఎక్కువగా నీరు కారడం గమనించవచ్చు.
⦁ పాల దిగుబడి తగ్గుతుంది.
⦁ శ్వాస తీసుకోవటానికి పశువు ఇబ్బంది పడుతూ నాలుకను బయటకు తీస్తూ ఉంటుంది.
⦁ శ్వాస తీసుకునే సమయంలో గురక లాంటి శబ్ధం చేయడం గమనించవచ్చు.
⦁ చికిత్స అందకపోతే 1 లేదా 2 రోజుల్లో వ్యాధి సోకిన పశువు చనిపోయే అవకాశం ఉంది.

చికిత్స :

⦁ పశువుల్లో పై లక్షణాలు కనిపించిన వెంటనే పశువైద్యుని వద్దకు తీసుకెళ్లాలి.
⦁ సల్ఫా-యాంటీబయోటిక్స్,యాంటీ హిస్టమీన్స్,నొప్పి నివారణ మందులు పశువైద్యుని సలహా మెరకు తగు మోతాదులో వాడాలి.
నివారణ చర్యలు :
⦁ పశువులు ఒత్తిడికి గురికాకుండా చూడాలి.
⦁ తొలకరి వర్షాలు మొదలవ్వక ముందే ఆరోగ్యంగా ఉన్న పశువులకు ఈ వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి.

జబ్బవాపు వ్యాధి :

దీనినే నల్లజబ్బ వ్యాధి అని కూడా అంటారు. ఈ వ్యాధి కారక సూక్ష్మక్రిమి (బ్యాక్టీరియా) పేరు “క్లాస్ట్రీడియం చొవై.” ఈ వ్యాధి వానా కాలంల,వరదల సమయంలో ముఖ్యంగా 6 నెలల నుంచి 2 సంవత్సరాల వయస్సు కలిగిన బలమైన,ఆరోగ్యవంతమైన పశువుల్లో అకస్మాత్తుగా వస్తుంది.వ్యాధి కారక సూక్ష్మక్రిములతో కలుషితమైన మట్టి,నీరు,మేత ద్వారా శరీరంలోకి ప్రవేశించడం లేదా గాయాల ద్వారా సూక్ష్మక్రిములు శరీరంలోకి ప్రవేశించడం వల్ల ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తుంది.

వ్యాధి లక్షణాలు:

⦁ పశువు జబ్బ /భుజము వాచి,కమిలినట్లు ఉండి,వేడిగా అనిపిస్తుంది.
⦁ క్రమంగా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది.
⦁ వాపు ఉన్న చోటు క్రమంగా నల్లగా మారి,కుళ్ళిపోయినట్లుగా అవుతుంది.
అక్కడ చేతితో తాకినప్పుడు లేదా ఒత్తిడి కలిగించినప్పుడు ఒక రకమైన శబ్దాన్ని వినవచ్చు.
⦁ పశువు కుంటుతూ నడుస్తుంది.
⦁ మేత, నీరు మానేసి నెమరు వేయకుండా ఉంటాయి.
⦁ చికిత్స అందకుంటే 1 లేదా 2 రోజుల్లో చనిపోతాయి.

చికిత్స :

⦁ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే రైతు దగ్గరలోని పశువైద్యుని వద్దకు పశువును తీసుకెళ్ళి వారి సూచనల మేరకు పెన్సిలిన్,నొప్పి నివారణ మందులు తగు మోతాదులో ఇవ్వాలి.
నివారణ చర్యలు :
⦁ కలుషితమైన పచ్చిక బయళ్ళకు పశువులను దూరంగా ఉంచాలి.
⦁ వ్యాధితో చనిపోయిన పశువుని 6 అడుగుల గొయ్యిలో 1 అడుగు సున్నం వేసి పూడ్చాలి.
⦁ వర్షాకాలనికి ముందే ఈ వ్యాధి నివారణ టీకాలను మందలోని అన్ని పశువులకు ముందస్తుగా వేయించాలి.

గాలికుంటు వ్యాధి:

దీనిని “గాళ్ళు” అని కూడా అంటారు. ఈ వ్యాధి “ఆప్ధస్” జాతికి చెందిన సూక్ష్మక్రిమి (వైరస్) వల్ల వస్తుంది. ఈ వ్యాధి ఆగస్టు,సెప్టెంబర్,మార్చి,ఏప్రిల్ నెలల్లో ఎక్కువగా వస్తుంది. దేశవాలి పశువులకన్నా విదేశీ,సంకర జాతి పశువుల్లో అధికంగా వస్తుంది. వ్యాధి సోకిన ఆవు లేదా గేదె పాలు తాగడం వల్ల దూడలకు కూడా సోకుతుంది.ఈ సూక్ష్మక్రిమితో (వైరస్) కలుషితమైన నీరు,మేత, గాలి ద్వారా వ్యాధి వ్యాపిస్తుంది.

వ్యాధి లక్షణాలు :

⦁ ఈ వ్యాధి మొదట జ్వరంతో మొదలై తర్వాత మేత మేయకపోవడం,పాల దిగుబడి తగ్గిపోవటం జరుగుతుంది.
⦁ ఆ తర్వాతి రోజుల్లో జ్వరం తీవ్రత తగ్గి పశువుల నాలుక,నోటిలో,ముక్కుపైన,కాలిగిట్టల మధ్య బొబ్బలు/పొక్కులు ఏర్పడతాయి.
⦁ క్రమంగా పొక్కులు చితికి, పుండ్లుగా తయారవుతాయి.
⦁ నోటిలోని పుండ్ల వల్ల మేత తినలేక పోవడం, నోటి నుంచి రక్తంతో కూడిన చొంగ కారటం, కాలి పుండ్ల వల్ల నడవలేకపోవటం లాంటి లక్షణాలు గమనించవచ్చు.
⦁ వ్యాధి తీవ్రంగా ఉన్నప్పుడు పశువు చనిపోతుంది.
⦁ ఈ వ్యాధి నుంచి కోలుకున్న కొన్ని పశువులు సాధారణ ఉష్ణోగ్రతను తట్టుకోలేక పోవడం, వేగంగా శ్వాస తీసుకోవడం,నోరుతెరిచి నాలుకను బయట చాచి కుక్కలాగా శ్వాస తీసుకోవడం వంటివి గమనించవచ్చు.

చికిత్స :

⦁ నోటిలోని పుండ్లకు బోరిక్ పౌడర్,గ్లిజరిన్ కలిపి పూయలి.
⦁ కాలిగిట్టల మధ్య పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో కడిగి ఈగలు వాలకుండా వేపనూనె పూయలి.
⦁ వ్యాధి లక్షణాలు గమనించిన వెంటనే పశువైద్యున్ని సంప్రదించి తగు చికిత్స చేయిస్తే మంచి ఫలితం ఉంటుంది.

నివారణ చర్యలు :

⦁ వ్యాధి సోకిన పశువులను ఆరోగ్యవంతమైన పశువుల నుంచి వేరు చేసి దూరంగా కట్టి ఉంచాలి.
⦁ పశువుల పాకలను వాషింగ్ సోడాతో కడగాలి.
⦁ వ్యాధి సోకిన పశువులు తినగా మిగిలిన గడ్డిని కాల్చివేయాలి.
⦁ వ్యాధి సోకిన పశువుల పాలను దూడలకు తాగించకూడదు.
⦁ తప్పనిసరిగా మార్చి లేదా ఏప్రిల్, ఆగష్టు లేదా సెప్టెంబర్ నెలలకు ముందుగా పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేయించాలి.

గమనిక : గొంతువాపు, జబ్బవాపు,గాలికుంటు వ్యాధి నివారణకు మార్కెట్లో “ఓకే” టీకా అందుబాటులో ఉంది. కావున రైతులు తమ పశువులకు ఈ ఒక్క టీకాను వేయించడం ద్వారా మూడుసార్లు విడివిడిగా మూడు టీకాలను ఇప్పించాల్సిన అవసరం ఉండదు.

Leave Your Comments

Methods To Increase Soil Carbon: నేలలో కర్బన ప్రతిక్షేపణ నిల్వలు పెంచే పద్ధతులు`ఆవశ్యకత

Previous article

Sugarcane: చెరకులో సమస్యల పరిష్కారానికి రకాల ఎంపిక ముఖ్యం

Next article

You may also like