Brinjal Price Reached Rs.150 కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రెండు వారాల క్రితం రూ. 200 పెడితే తీసుకెళ్లిన సంచి నిండేది. కానీ ఇప్పుడు రూ.500 ఖర్చు చేసిన సంచి నిండే పరిస్థితి లేదు. ఒక్కసారిగా కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో సామాన్యుడు కొనలేని పరిస్థితి నెలకొంది. పెట్రోల్, డీజిల్ రేట్లకే ఆగమాగమైన సామాన్యుడు ప్రస్తుతం కూరగాయల ధరల్ని చూసి ఆందోళన చెందుతున్నాడు. మార్కెట్ కి వెళ్లాలంటేనే వణికిపోయేలా ధరలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే టమోటా మోతమోగించగా ఇప్పుడు వంకాయ ధర సెంచరీ కొట్టేసింది.
Brinjal Price హోల్‌సెల్ మార్కెట్ లో కిలో వంకాయ ధర రూ.100కు చేరింది.. ఇక, బహిరంగ మార్కెట్‌కు వచ్చేసరికి కిలో రూ.150 వరకు పలుకుతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం మడి అంత ర్రాష్ట్ర కూరగాయల మార్కెట్లో రికార్డు స్థాయికి చేరింది వంకాయ ధర. హోల్‌సేల్ మార్కెట్‌లో 10 కిలోల వంకాయలు రూ.1000గా పలికాయి.. ఇక, బహిరంగ మార్కెట్‌కు వెళ్లేసరికి కిలో రూ.150పైమాటే అని చెబుతున్నారు.. ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో తోటలు దెబ్బతిని దిగుబడులు తగ్గిపోవడం ఓ కారణం అయితే.. కార్తీక మాసంలో వంకాయకు డిమాండ్ ఉండడం కూడా మరో కారణంగా చెబుతున్నారు.. కార్తీక మాసంలో పూజలు, శుభకార్యాలు, అయ్యప్ప పడిపూజలు.. ఇలా అన్నింటికీ వంకాయను వాడుతూ ఉంటారు.. దీనికి పంట దిగుబడి తగ్గిపోవడం తోడు కావడంతో.. వంకాయ ధర అమాంతం పెరిగినట్టు చెబుతున్నారు. మరోవైపు.. కొంత పంట నష్టపోయినా.. మిగిలిన పంటకు మంచి ధర పలకవడంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు రైతులు.
కూరగాయల ధరలపై ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వరుసగా కూరగాయ ధరలు పెరుగుతుండటంతో అంత మొత్తంలో పెట్టలేమని వాపోతున్నారు. కార్తీకమాసంలో కూరగాయల ధరలు అధికంగా ఉండటం సహజమే. కానీ మునుపెన్నడూ లేని ధరలు ఈసారి చూస్తున్నామని వినియోగదారులు వాపోతున్నారు. మొత్తంగా కూరగాయల్లో రారాజుగా పిలవబడే వంకాయల ధరలు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి.