వార్తలు

చాక్లెట్ పంట సాగు విస్తీర్ణం పెంచేందుకు ఏపీ ప్రభుత్వ ప్రణాళికలు..

0

కోకో పంటను చాక్లెట్ పంటగా కూడా పిలుస్తారు. కోకో సాగును ఏపీ రాష్ట్రంలో మరింతగా విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. చాక్లెట్స్, బిస్కెట్స్, ఇతర తినుబండారాలతో పాటు పానీయాలు, ఔషధాలు, సౌందర్య సాధనాల తయారీలో ఉపయోగించే కోకోకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. కోకో సాగుతో పాటు ఉత్పాదకతలోనూ మన రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. గడిచిన రెండేళ్లలో కొత్తగా 8 వేల హెక్టార్లలో విస్తరించిన ఈ సాగును రానున్న మూడేళ్ళలో కనీసం 15 వేల హెక్టార్లలో పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. 1990 తోటల్లో అంతర పంటగా ప్రారంభించిన కోకోను ఆ తర్వాత ఆయిల్ పామ్ తోటల్లోనూ రైతులు సాగు చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా సాగవుతున్న ఈ పంట తాజాగా కోస్తా, రాయలసీమ జిల్లాలకూ విస్తరించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 29,199హెక్టార్లలో ఇది సాగవుతుండగా ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే 22,015 హెక్టార్లలో విస్తరించింది.
నాటిన మూడో ఏడాది నుంచి మొదలయ్యే కోకో దిగుబడి కనీసం 40 ఏళ్లపాటు కొనసాగుతుంది. కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటగా సాగు చేసే కోకో చెట్ల నుంచి ఏటా టన్ను నుంచి రెండు టన్నుల ఆకులు రాలి నేలలో కలిసిపోతాయి. దీనివల్ల భూసారం పెరుగుతుంది. భూమిపై ఏర్పడే ఆకుల పొర వల్ల కలుపు శాశ్యతంగా నిర్మూలించబడుతుంది. ఇదే సందర్భంలో తోటల్లోని భూమిలో తేమ శాతం నిలిచి ఉండి ప్రధాన పంటకు నీటి కొరత లేకుండా చేస్తుంది. పైగా కొబ్బరి, ఆయిల్ పామ్ లో పిందె రాలిపోవడాన్ని నివారిస్తుంది. అంతర పంటగా కోకో సాగు చేయడం వల్ల ప్రధాన పంటల్లో 20 శాతం దిగుబడి పెరుగుతుందని సీటీఆర్ ఐ స్పష్టం చేసింది.
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కోకో రైతులకు సాగు ఖర్చుల కింద మూడేళ్ళ పాటు హెక్టారుకు రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తోంది. సూక్ష్మ సేద్య పరికరాలపై చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం, ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం సబ్సీడీ అందిస్తోంది. ఇదిలావుండగా ఏలూరులో రూ.75 కోట్లతో కోకోవా, వెనీలా ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయబోతుంది.

Leave Your Comments

ఏజెన్సీలో కాఫీ తోటల పెంపకం ఆశాజనకం..

Previous article

రోగ రహిత చీని అంట్లకు ఆదరణ..

Next article

You may also like