Spices Board Experts: పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన, పశ్చిమ గోదావరి జిల్లాలో సాగు చేస్తున్న పంటలు ఢిల్లీలోని స్పైసెస్ బోర్డు దృష్టికి వెళ్ళటం, ఇటీవల ఆ సంస్థ బృందం ఆ తోటలను పరిశీలించటం జరిగింది. స్పైసెస్ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ ‘అనాద్ దెబ్బర్మ’ నీతి అయోగ్ అసిస్టెంటు డైరక్టర్లు డా. తుఫాస్ కుమార్ సారంగి, మార్షల్ బిరులయలతో పాటు వారి అనుచర బృందం పశ్చిమ గోదావరి జిల్లా, పెదవేగి మండలం, దిబ్బగూడెం గ్రామాలు సందర్శించి ఇరువుర రైతుల సువాసన ద్రవ్యాల తోటలను పరిశీలించి, ఆ రైతులను ప్రశంసించి వెళ్ళారు. కవ్వగుంటకు దగ్గరలోని దిబ్బగూడెంలో 40 ఎకరాల్లో దావులూరి విజయ సారధి సాగు చేస్తున్న వక్క, మిరియం, వెనిల్లా తోటలను, దానికి దగ్గరలో వున్న ఉప్పలపాటి చక్రపాణికి చెందిన 13 ఎకరాల్లోని వక్క, మిరియం, అరటి, అల్లం, కోకో పంటలను పరిశీలించి వెళ్ళారు. ఈ ఇద్దరి రైతులు తమ పొలంలో సాగు చేస్తున్న పంటలన్నీ సేంద్రియ విధానంలోనివి కావటం వల్ల, స్పైసెస్ బోర్డు అధికారులు ఆశ్చర్యపోయి, ఇతర ప్రాంతాల వారికి ఈ తోటలను ప్రదర్శనా క్షేత్రంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడి వెళ్ళారు. ఈ రైతులను ఆదర్శంగా తీసుకోవాలని ఇతర రైతులకు సూచించి వెళ్ళారు.
విజయ సారధి వెనిల్లా :ఇది సరికొత్త పంట. ఆంధ్రప్రదేశ్లోని అరుదైన పంట. 13 ఎకరాల్లో విజయ సారధి ఈ వెనిల్లా పంటను సాగు చేస్తున్నారు. ఆశాజనకంగా వుంది.వెనిల్లా సుగంధ ద్రవ్య పంట. ఇది ఆర్బిడో కుటుంబానికి చెందినది. దీనిలో పలుజాతులు ఉన్నప్పటికీ, 1. వెనిల్లా ప్లాని-పోలియా (ఆండ్రూస్), 2. వెనిల్లా తాహి తెన్సిష్ (ఆ.ఇ. మూర్), 3. వెనిల్లా-పాంపోనా (హీడ్) రకాలు మాత్రమే వాణిజ్య పరంగా పెంచబడుతుంది. వెనిల్లాకు సువాసన అందజేసే పదార్థాన్ని ‘వెనిల్లిస్’ అంటారు. వెనిల్లిస్తో పాటు అస్థిర తైలాలు, రెజిన్లు, చక్కర పదార్థాలు, జిగురు పదార్థాలు, మైనం, సెల్యులూజ్ లాంటి వాటితో పాటు ఎస్టర్లు, ఆల్కహాలులు, ఆల్జీహైడులు కూడా మిళితమై వుంటాయి. కోతకు సిద్ధమైన వెనిల్లా కాయల్లో గ్లూకో వెనిల్లిస్ను పాల ఉత్పత్తి పరిశ్రమలు ఎక్కువగా ఉపయోగిస్తాయని ఢల్లీి నుంచి వచ్చిన ప్రతినిధి వర్గం వివరించింది. పదార్థాలు సువాసనగా వుండటం కోసం ఈ వెనిల్లాను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఐస్ క్రీముల్లో, కేకుల్లో, సిరప్పులలో దీని వాడకం అధికమట. ఒక వెనిల్లా కాయలోని గింజల పొడి 600 గ్రాముల చాక్లెట్లలో కలపటానికి సరిపొతుందట. అంతేకాదు, కోలా పానీయాలు, విస్కీ, కార్డియల్, కాక్టైల్ లాంటి మత్తు పానీయాల్లో వాడటం వల్ల వాటికి మంచి ధర లభిస్తుంది.
ఈ వెనిల్లా ఎక్కడిది?
నిపుణుల బృందంతో పాటు విజయసారధి తోటకు విచ్చేసిన రైతులకు ‘ఈ వెనిల్లా ఎక్కడిది? ఎక్కడ నుంచి తెచ్చారు?’ అనే సందేహాలు తలెత్తాయి. దీనికి సుమారు 4 వందల సంవత్సరాల చరిత్ర వుంది. ఇది మన దేశపు పంట కాదని విజయసారధి చెబుతూ, మెక్సికో, ఇంగ్లాండ్, వెస్టిండీస్ లాంటి దేశాలతో పాటు మడగాస్కర్, ఉగాండాలలో పెంచబడుతుండేది. 1835లో తమిళనాడులోని కల్లార్లోను, పశ్చిమబెంగాల్లోని కలకత్తాలోను, పాండిచ్చేరి, అస్సాంలలో వెనిల్లా సాగును చేపట్టగా, 1960 నాటికి కేరళ రాష్ట్రంలోని మయనాడ్ జిల్లా, అంబల్ వాయల్ పరిశోధనా కేంద్రంలో దీనిపై పరిశోధన ప్రారంభించబడి, అక్కడి ఫలితాలు సంతృప్తిగా వుండటంతో, క్రమ క్రమంగా సాగు విస్తరించి, ప్రస్తుతం 200 ఎకరాల వరకు కర్ణాటకలో సాగులో వున్నట్లు చెపుతున్నారు. కొత్త పంటల సాగు పట్ల మమకారం పెంచుకున్న విజయసారధి కేరళ నుంచే వెనిల్లా తీగలు తెప్పించి, తన తోటలో నాటించి, క్రమక్రమంగా సాగు విస్తీర్ణం పెంచుకుంటూ రావటం స్పైసెస్ బోర్డు నిపుణులకు తెలియటం, వారు విజయసారధికి ముందస్తు సమాచారం పంపి, జూన్ నెల 1న వచ్చి, ఆ తోటను పరిశీలించారు. తెలుగు రాష్ట్రాల్లో 13 ఎకరాల్లో వెనిల్లాను పెంచుతున్న రైతును తానొక్కడినేనని ఆయన గర్వంగా చెప్పుకున్నారు. తన 40 ఎకరాల తోటలో ప్రస్తుతానికి 13 ఎకరాలకు దాన్ని విస్తరించిగలిగినట్లు చెప్పారు. దీని పెంపకం గురించి సమగ్ర సమాచారం రైతులకు అందుబాటులో లేకపోవటం వల్ల సాగు విస్తీర్ణం పెరగటం లేదని వివరించారు. సుగంధ ద్రవ్యాల సంస్థ, వెనిల్లా అభివృద్ధి ట్రస్టు (హరియడ్కా-ఉడిపి జిల్లా కర్ణాటక), ఇండియన్ అసోసియేట్స్ (కొప్ప-చిక్క మంగళూరు జిల్లా, కర్ణాటక) లాంటి సంస్థల సహకారంతో వెనిల్లా సాగు విస్తరిస్తుందని, తాను కూడా అక్కడ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగానే తన పొలంలో వెనిల్లా సాగును విస్తరిస్తున్నానని చెప్పారు.
Also Read: Spice Crops: సుగంధ ద్రవ్యాల పంటల సాగులో బుర్హాన్పూర్ ప్రత్యేక స్థానం
ఖర్చెంత? ఆదాయం ఎంత?
ప్రతి పంటకు రైతు ఖర్చు, ఆదాయాలను పరిగణనకు తీసుకునే రైతు ముందుకు సాగాలి. విజయసారధి తోటను పరిశీలించిన ఢల్లీి బృందం ఆయన నుంచే ఆ వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెనిల్లా నాటటానికి భారీ పెట్టుబడి అవసరమని చెపుతూ, వాతావరణం అనుకూలిస్తే పెట్టుబడికి మూడిరతలు మూడేళ్ళలో రైతుకు అందివస్తుందని చెప్పారు. వెనిల్లా సాగులో అధిక పెట్టుబడి విత్తనం తీగ కొనుగోలు చేయటం. మీటరు పొడవున్న వెనిల్లా విత్తనం తీగ ముక్క ఖరీదు 100 నుంచి 150 రూపాయలుంటుంది. అలాంటి ముక్కలు ఎకరానికి 1000 వరకూ అవసరమౌతాయి. తాను చాలాకాలం క్రితమే ఇతర రాష్ట్రాల నుంచి కొద్దిగా మొక్కల ముక్కలు తెచ్చాను. వాటిని పెంచుకుంటూ, విత్తనంగా వాడుకుంటూ, విస్తీర్ణం పెంచుకుంటూ వస్తున్నాను. చాలా కాలం క్రితం నేను విత్తనం తీగ కొని సాగు విస్తీర్ణం పెంచుకుంటూ వచ్చాను. కాబట్టి ప్రస్తుతం 13 ఎకరాల్లో ఆ పైరు సాగులో వున్నా, పెద్ద భారమనిపించటం లేదు. అటు తర్వాత దీని పెంపకం కొంచెం కష్టమని చెప్పక తప్పదు. వెనిల్లా మొక్కలు బాగా పెరగటానికి పాక్షికమైన నీడ అవసరం. నీడతో పాటు వీటికి ఆధారాలు కూడా అవసరం. కాబట్టి వెనిల్లాను నాటబోయే పొలంలో ముందుగా ఆధార వృక్షాలు విధిగా నాటాలి. ఆధార వృక్షాల ఆకులు చిన్నవిగా వుండి, సాధారణ వెలుతురు (సూర్యరశ్మి)ను 50 శాతం మాత్రమే నిరోధించేలా వుండాలి. ఆధార వృక్షాలు బెరడుతో వున్నప్పుడు దాని ఆధారంగా వెనిల్లా తీగలు త్వరితగతిని పెరుగుతూ వుంటాయి. ఈ ఆధార వృక్షాలు లెగ్యూమ్స్ జాతికి చెందినవైతే నేల నుంచి నత్రజనిని స్వీకరించి, వెనిల్లా పెరగటానికి దోహదపడతాయి. ఆధార వృక్షాల నుండి రాలిన ఆకులు, అవసరాన్ని బట్టి నరికిన కొమ్మలు నేలను కప్పి వుంచి తేమను ఆరకుండా చేస్తాయి. కాలక్రమంలో అవి కుళ్ళి సేంద్రియ పదార్థంగా మార్పు చెంది, మొక్కలకు బలం చేకూరుస్తాయి. వక్క కాయలను ఎండబెట్టటం కోసం తన తోటలో సారధి ఏర్పాటు చేసిన డ్రయ్యర్ యంత్రం వేడిని అమితంగా ఆకట్టుకుంటుంది. వక్క పెంపకంలో పెద్ద ప్రతిబంధకం వక్క కాయలు ఎండబెట్టటమని, ఖర్చుకు వెనుకాడకుండా విజయసారధి డ్రయ్యర్ ఏర్పాట్లు చేసి, అటు రైతులకు మార్గదర్శకులయ్యారని ప్రశంసించారు.
ఉప్పలపాటి చక్రపాణి తోటలు పరిశీలన : విజయసారధి తోటను పరిశీలించిన అనంతరం అక్కడికి దగ్గరలో వున్న ఉప్పలపాటి చక్రపాణి తోటను పరిశీలించింది. స్పైసెస్ బోర్డు బృందం చక్రపాణి తోటలోని పంటలన్నీ గోఆధారిత సాగువే కావటం విశేషం. 1997లో ఆయన 10 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. వివధ రకాల పంటలు పండిరచారు. గిట్టుబాటు గాలేక గోఆధారిత వ్యవసాయంలోకి అడుగు పెట్టారు. అందుకోసం ఆవులను కొనుగోలు చేసి పంచగవ్య, జీవామృతం, ఘన జీవామృతం లాంటివి స్వంతంగా తయారు చేయించి మొక్కలకు వాడటం ప్రారంభించారు. ప్రారంభంలో దిగుబడులు తక్కువగా వున్నా మంచి ధర రావటంతో తాను సాగుచేసే ప్రతి పంటకు గోఆధారిత ద్రవాలను వాడటం ఆనవాయితీగా చేసుకున్నారు. తన పామాయిల్ తోటలోని షెడ్డులో 10కి పైగా ఆవులు, గిత్తలు వుండటం విశేషం.
వాటి పోషణ పెద్ద భారమనిపించదు గాని, అవి అందించే మలమూత్రాల ద్వారా తయారు చేసే ఎరువులు ఖర్చును భారీగా తగ్గిస్తున్నాయి. ఆ పశువులు అందించే మలమూత్రాలను ద్రవంగా మార్చటానికి సుమారు 15 లీటర్ల నీటిని నింపే ట్యాంకరును ఏర్పాటు చేశారు. ఆ పశువుల ఆధారంగా తయారయ్యే ఉత్పత్తులను చెట్లకు లిఫ్ట్ ద్వారా అందిస్తున్నారు. విద్యుత్ వినియోగం, ఇద్దరు మనుషులతో వైర్లు మార్పిడికి అయ్యే ఖర్చు తప్పితే అదనపు ఖర్చు లేకుండా వుంది. ఎరువుల ఖర్చు, క్రిమిసంహారక మందుల ఖర్చు అసల్లేకుండా వివిధ రకాల పంటలు సాగుచేస్తున్న చక్రపాణి సాగు విధానం చూసి ఢల్లీి బృందం ఆశ్చర్యపడిరది.
కొబ్బరిలో అంతర పంటగా వేసిన వక్క, మిరియం, పామాయిల్ కోతకు వచ్చాయి. అంతర పంటల ప్రయోగం మంచి ఫలితాలనిస్తుందని చక్రపాణి ఘంటాపథంగా చెపుతున్నారు. ఏ పంట ఫలయాసం యిచ్చిన ఖర్చు తక్కువలోనే పూర్తి చేయగలుగుతున్నారు. కొబ్బరి, వక్క, మిరియం, పామాయిల్ దీర్ఘకాలిక పంటలు. వాటిలో వీలును బట్టి అల్లం, పసుపు, అరటి లాంటి స్వల్పకాలిక పంటలు కూడా వేసి ఆశాజనకమైన దిగుబడులు సాధిస్తున్నారు. తన పొలంలో తయారైన అల్లంను ఉడకబెట్టి, శొంఠిగా మార్చి అమ్మటం వల్ల మంచి ఆదాయం సమకూరుతుందని ఆయన వివరించారు. ఈ గోఆధారిత సేద్యం, అంతర పంట సాగు కూలీల ఖర్చును గణనీయంగా తగ్గించింది. అరటి గెలలు, పామాయిల్ గెలలు కోయటానికి మాత్రమే కూలీల కోసం ఎదురు చూడాలి. ఆలశ్యమైతే వాటి నాణ్యత చెడి పోతుంది. కొబ్బరి, మిరియం, వక్క లాంటివి తయారై రాలిపోతున్నా పెద్దగా ఆదుర్దా చెందవలసిన అవసరం వుండదు. కూలీలు సజావుగా అందుబాటులోకి వచ్చినపుడే వాటిని ఏరించి భద్రపరచుకుంటారు. వీటన్నింటినీ మించిన విశేషం మరొకటి వుంది. పొలంలో కూలీలతో కలుపు తీయించే ప్రసక్తే వుండదు. ఏ పైరు మధ్య, ఏ విధమైన కలుపు మొలకెత్తినా, దాన్ని నివారించటానికి మందులు చల్లటం, మనుష్యుల చేత కలుపు మొక్కలు తీయించటం అనేది అసలుండదు. పుట్టిన కలుపు నీడకు చనిపోతుంది. అలా చనిపోయిన కలుపు సేంద్రియ ఎరువుగా మారి మొక్కలకు బలం ఇస్తుందని వివరించారు చక్రపాణి.
Also Read: Spices Benefits: కూరలలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలు ఎన్నో వ్యాధులకు ఔషధాలు
Must Watch: