రెండు తెలుగు రాష్ట్రాల్లో రబి సీజన్లో ప్రధానంగా నూనెగింజల పంటలైనటువంటి వేరుశనగ, నువ్వులు మరియు ప్రొద్దుతిరుగుడును అరుతడి పంటలుగా సాగు చేస్తుంటారు. ఈ పంటల్లో దిగుబడులను ప్రభావితం చేసే అంశాల్లో కలుపు ప్రధానమైనది. కలుపు మొక్కలు పంటల ఎదుగుదలకు అడ్డంకి గా మారి తద్వారా దిగుబడులను తగ్గించి, రైతులకు నష్టాన్ని కలగజేస్తుంటుంది. ప్రధానంగా పోషకాలు, సూర్యరశ్మి మరియు నీటి కొరకు కలుపు మొక్కలు పంటలతో పోటీ పడుతుంటాయి. అలాగే చీడ పీడలకు ఆశ్రయం ఇవ్వడం ద్వారా వాటి ఉద్ధృతిని పెంచి, పంటలు చీడ పీడల బారిన పడేలా చేస్తుంటాయి. సాధారణంగా ఈ పంటల్లో మొదటి దశల్లో పెరుగుదల తక్కువ ఉండటం చేత కలుపు మొక్కలు అదిపత్యాన్ని ప్రదర్శించి, తక్కువ దిగుబడులకు కారణమవుతుంటాయి. అలానే కలుపుకు సున్నిత వ్యవదిలో సరైన యాజమాన్యం చేపట్టకపోవడం వలన గణనీయంగా దిగుబడులు తగ్గిపోతుంటాయి. ప్రస్తుతం యాసంగిలో సాగుచేస్తున్న ముఖ్యమైన నూనెగింజల పంటల్లో చేపట్టవలసిన కలుపు యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం..
వేరుశనగ : విత్తనం విత్తిన 24 – 48 గంటల్లోపు 12.4 గ్రా. డైక్లోసులామ్ 84% డబ్ల్యూ.డి.జి. (స్ట్రాంగ్ ఆర్మ్/మార్క్) మందును ఎకరానికి 200 లీ. నీటిలో కలిపి పిచికారి చేయడం ద్వారా 30 రోజుల వరకు దాదాపు అన్ని రకాల కలుపు మొక్కలను సమర్థవంతంగా నివారణ చేయవచ్చు లేదా పెండిమిథాలిన్ 38.7% సి.యస్. (స్టాంప్ ఎక్సట్రా) @ 700 మి.లీ. లేదా పెండిమిథాలిన్ 30% ఇ.సి. (స్టాంప్) @ 1 లీ. మందును ఎకరానికి 200 లీ. నీటిలో కలిపి పిచికారి చేయడం ద్వారా 20 రోజుల వరకు కలుపును నివారించవచ్చు.
విత్తిన 25-35 రోజల సమయంలో గొర్రుతో అంతరకృషి చేసి మొక్క మొదళ్ళకు మట్టిని ఎగదోయడం వలన కలుపును నిర్మూలించడంతో పాటు మట్టిలోకి వేరుశనగ ఊడలు దిగడానికి తోడ్పడవచ్చు. అంతరకృషి సాద్యం కానీ పక్షంలో, కలుపు 2-4 ఆకుల దశలో ఉన్నప్పుడు, ఎక్కువగా గడ్డి జాతి కలుపు మొక్కలు ఉన్నట్లయితే : క్విజాలొఫాప్ ఇథైల్ 5 % ఇ. సి (టార్గా సూపర్) @ 400 మి. లీ (లేదా) ప్రోపాక్విజాఫాప్ 10% ఇ. సి (ఏజిల్) @ 250 మి.లీ. మందును ఎకరానికి 200 లీ. నీటి లో కలిపి పిచికారి చేయవలెను. పొలంలో గడ్డి జాతి మరియు
వెడెల్పాకు కలుపు ఎక్కువగా ఉన్న యెడల: ఎకరానికి 40 గ్రా. ఇమజితపైర్ 35% + ఇమజామ్యాక్స్ 35% డబ్ల్యూ. జి. (ఒడిస్సి) లేదా 800 మి. లీ. ప్రోపాక్విజాఫాప్ 2.5% + ఇమజితపైర్ 3.75% w/w ద్రావకం (షాకెడ్) లేదా 175 మి.లీ. క్విజాలొఫాప్ ఇథైల్ 7.5% + ఇమజితపైర్ 15% ద్రావకం (హచిమాన్) మందును ఎకరానికి 200 లీ. నీటిలో కలిపి పిచికారి చేయవలెను.
నువ్వులు: విత్తిన 24-48 గంటల్లోపు ఎకరానికి 700 మి.లీ. పెండిమిథాలిన్ 30% ఇ.సి. (స్టాంప్) మందును 200 లీ నీటిలో కలిపి పిచికారి చేయడం ద్వారా 20 రోజుల వరకు కలుపును నివారించవచ్చు. పంట 30-40 రోజుల వయసులో ఉన్నప్పుడు, అనగా కలుపుకు సున్నిత దశలో, కలుపు తీయడం లేదా అంతరకృషి చేయడం ద్వారా కలుపును సమర్థవంతంగా అరికట్టవచ్చు. అయితే అంతరకృషి సాధ్యం కానీ పరిస్తితుల్లో గడ్డి జాతి కలుపును నివారించడానికి ఎకరానికి 400 మి.లీ. క్విజాలొఫాప్ ఇథైల్ 5 % ఇ. సి (టార్గా సూపర్) లేదా 250 మి.లీ. ప్రోపాక్విజాఫాప్ 10% ఇ.సి. (ఏజిల్) మందును ఎకరానికి 200 లీ నీటిలో కలిపి కలుపు 2-4 ఆకుల దశలో ఉన్నప్పుడు పిచికారి చేయవలెను. వెడెల్పాకు కలుపు నివారణ కొరకు ప్రస్తుతం మార్కెట్ లో కలుపు మందులు అందుబాటులో లేవు.
ప్రొద్దుతిరుగుడు: విత్తిన తర్వాత 24-48 గంటల్లోపు ఎకరానికి 1 లీ. పెండిమిథాలిన్ 30% ఇ.సి. రసాయనాన్ని 200 లీ. నీటిలో కలిపి పిచికారి చేయడం ద్వారా 20 రోజుల వరకు కలుపును నివారించవచ్చు. పంట 30-40 రోజుల దశలో ఉన్నప్పుడు, కలుపు తీయడం లేదా అంతరకృషి చేయడం ద్వారా కలుపును సమర్థవంతంగా అరికట్టవచ్చు. అంతరకృషి సాధ్యం కానీ పరిస్థితుల్లో గడ్డి జాతి కలుపును నివారించడానికి ఎకరానికి 400 మి.లీ. క్విజాలొఫాప్ ఇథైల్ 5 % ఇ.సి. (టార్గా సూపర్) లేదా 250 మి.లీ. ప్రోపాక్విజాఫాప్ 10% ఇ.సి. (ఏజిల్) మందును ఎకరానికి 200 లీ. నీటి లో కలిపి కలుపు 2-4 ఆకుల దశలో ఉన్నప్పుడు పిచికారి చేయవలెను. వెడెల్పాకు కలుపు నివారణ కొరకు ప్రస్తుతం మార్కెట్ లో కలుపు మందులు అందుబాటులో లేవు.
కలుపు మందులు పిచికారి చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు
ఏ పంటకు సిఫార్సు చేసిన కలుపు మందులను ఆ పంటలో మాత్రమే సరైన మోతాదులో ఉపయోగించవలెను
కలుపు మందులను ఫ్లాట్ ఫ్యాన్ లేదా ఫ్లడ్ జెట్ నాజిల్ ను ఉపయోగించి పిచికారి చేయవలెను
కలుపు మందులను ఇతర రసాయనాలతో (కీటకనాశినులు/శిలీంద్రనాశినులు/పోషకాలు) కలిపి ఉపయోగించడం వలన కలుపు మందుల సామర్థ్యం తగ్గే అవకాశం ఉన్నందువలన ఇతర రసాయనాలతో కలిపి ఉపయోగించరాదు.
విత్తనం విత్తిన 1-2 రోజుల్లోపు ఉపయోగించే కలుపు మందులను వెనక్కి నడుస్తూ పిచికారీ చేయవలెను
పంట మొలకెత్తిన తర్వాత ఉపయోగించే కలుపు మందులను, కలుపు 2-4 ఆకుల దశలో ఉన్నప్పుడు పిచికారి చేసినచో కలుపును సమర్థవంతంగ అరికట్టవచ్చు.
1, ఐ.సి.ఎ.ఆర్ – భారతీయ నూనెగింజల పరిశోధన సంస్థ, హైదరాబాదు – 030
2 ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాదు – 030
3 ఐ.సి.ఎ.ఆర్ – కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ, హైదరాబాదు – 059చరణ్ బాబు అంకెల 1 అరుణ శ్రీ 2 మరియు జయకిషోర్ రెడ్డి
3 .పీ.హెచ్.డి. స్కాలర్స్