Madanapalle Tomato Market: దేశంలో టమాట ధరలు సెంచరీ కొట్టాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఏకంగా కిలో టమాట రూ.190 దాటిపోయింది. వినియోగదారులు టమోటా కొనుగోలు చేసేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసామాన్యంగా టమోటా ధర పెరగడంతో గ్రామీణ ప్రాంతాల్లో అయితే అసలు టమాటా కొనుగోళ్లు నిలిచిపోయాయి. వినియోగదారులకు రాయితీ ధరకు టమాట అందించేందుకు కేంద్ర ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటికే ప్రధాన నగరాల్లో కిలో టమాట రూ.75 కు సరఫరా చేస్తున్నాయి. అయితే కొత్త పంట ఎప్పటికి వస్తుందనే విషయంపై కేంద్ర అధికారుల బృందం ఆరా తీస్తున్నారు. కేంద్ర అధికారులు మదనపల్లె టమాట మార్కెట్ను సందర్శించి, టమాట సరకు వివరాలను సేకరించారు.
ధరలు అదుపు చేయగలరా?
దేశవ్యాప్తంగా టమాటా ధర జనాలకు చుక్కలు చూపిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో టమోటో రూ.200 దాటిపోయింది. రాష్ట్రాల రాజధానుల్లో కిలో టమోటో రూ.190పైనే పలుకుతోంది. మదనపల్లె మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కిలో టమోటో ధర రూ. 160 పలికింది. దీంతో వినియోగదారులకు చేరే సరికి కిలో టమోటో రూ.200 దాటిపోతోంది. దీనిపై ఐదుగురు సభ్యుల కేంద్ర బృందం ఆరా తీసింది. టమోటో రైతులు, వ్యాపారులతో మాట్లాడి వివరాలు నమోదు చేసుకున్నారు. ఎంత పంట సాగు చేస్తున్నారు. దిగుబడులు ఎలా ఉన్నాయి. పంట ఎప్పటి వరకూ వచ్చే అవకాశం ఉంది అనే అంశాలను నోట్ చేసుకున్నారు.
Also Read: Tomato Farmer: టమాట పంటతో ఒకరోజులోనే లక్షాధికారులు అవుతారు..
మరో రెండు నెలలు ఇంతే
వర్షాలకు టమాట పంట దెబ్బ తినడంతో పాటు, కర్నాటకలో తెగుళ్లు రావడంతో టమాట రైతులు తీవ్రంగా నష్టపోయారు. చీడపీడలలు, తెగుళ్లు తట్టుకుని కొద్ది పంట మాత్రమే చేతికి వస్తోంది. దిగుబడులు కూడా గణనీయంగా పడిపోయాయి. దీంతో రోజుకు 15000 క్వింటాళ్లు రావాల్సిన మదనపల్లె మార్కెట్ కు కేవలం 6000 క్వింటాళ్లు మాత్రమే వస్తున్నాయి. దీంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో టమాట కు డిమాండ్ ఏర్పడింది. ఆసియాలోనే అతిపెద్ద టమోటో మార్కెట్ అయిన మదనపల్లి నుంచి దేశంలోని అనేక ప్రాంతాలకు టమాట ఎగుమతి అవుతుంది. దిగుబడులు తగ్గడంతో ధర ఒక్కసారిగా భగ్గుమంది.
విస్తారంగా సాగు చేపట్టారు
టమాట ధరలు ఒక్కసారిగా పరుగులు పెట్టడంతో రైతులు టమాటా సాగుకు నారు సిద్దం చేసుకుంటున్నారు. ఏపీలోనే 2 లక్షల ఎకరాల్లో టమాట సాగు చేసేందుకు రైతులు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే కొందరు నర్సరీల నుంచి టమోటో నారు కొనుగోలు చేసి సాగు మొదలు పెట్టారు. కొత్త పంట చేతికి రావడానికి ఇంకా మూడు నెలల సమయం పడుతుందని రైతులు చెబుతున్నారు. అప్పటిదాకా ధరలు అదుపులోకి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ విషయాలపై కేంద్ర బృందం అధ్యయనం చేస్తుంది.
Also Read: Tomato Farmer Murder: రైతుల ప్రాణాలకి ముప్పుగా మారిన టమాట ధర.!