కేరళ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ ప్రసాద్ గారిని కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కె అచ్చెన్నాయుడు గారు
ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ సాగు విధానం నచ్చి కేరళ రాష్త్ర వ్యవసాయ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ సాగు విధానాన్ని కేరళలో అమలుపరచడం కోసం ఎన్టీఆర్ జిల్లాలో ప్రకృతి వ్యవసాయ అధికారులు మరియు కేరళ రాష్త్ర మంత్రులు సందర్శించారు. అందులో భాగంగా విజయవాడ డివి మినార్ హోటల్లో మంత్రులు ప్రకృతి సాగు విధానాల మీద చర్చలు జరిపారు.
కేరళ రాష్ట్రంలో 64 గుర్తించిన క్షేత్రాలలో ప్రకృతి వ్యవసాయం ప్రారంభించేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు కేరళ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పి. ప్రసాద్ స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సుస్థిరమైన ప్రకృతి వ్యవసాయం చేయడం అభినందించదగ్గ విషయం అని కొనియాడారు. విజయవాడ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ అచ్చెన్నాయుడు కేరళ మంత్రిని కలిసిన సంధర్భంగా ఏర్పాటైన సమావేశంలో కేరళ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయం పట్ల ఎంతో ఆకర్షితులైనట్లు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ మద్దతు బాగా ఉన్నదని , సుస్థిరమైన మరియు పర్యావరణ అనుకూల వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఇక్కడ ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. శ్రీ పి. ప్రసాద్ గారు ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అభినందనలు తెలిపారు.
ఈ సంధర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో ధృవీకరణ (సర్టిఫికేషన్) మరియు ట్రేసబిలిటీ చాలా ముఖ్యమైనదని అన్నారు. నాణ్యత నియంత్రణ మరియు బాధ్యతాయుత వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దూర దృష్టికి అనుగుణంగా వ్యవసాయ విధానాలను అమలు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక మట్టి నమూనాల సేకరణ పై శ్రీ అచ్చెన్నాయుడు గారు ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ మట్టి ఆరోగ్యాన్ని విశ్లేషించడానికి మరియు ప్రకృతి వ్యవసాయ విధానాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ సమావేశం కీలకమైనదని తెలిపారు. కేరళకు అధికారిక పర్యటన చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయవలసిందిగా సూచించగా అదే రోజు కేరళలో ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలను ప్రారంభించాలని కేరళ మంత్రి శ్రీ. పీ. ప్రసాద్ గారు కోరారు.
ఈ సంధర్భంగా కేరళకు చెందిన ఆర్గానిక్ అగ్రికల్చర్ కళాశాల హెడ్ డా. అపర్ణ . బి మాట్లాడుతూ వెల్లయాని వ్యవసాయ కళాశాలలో ప్రకృతి వ్యవసాయం పై పీజీ డిప్లొమా కోర్సు ప్రవేశపెట్టాలని సూచించారు. ఈ చర్య స్థిరమైన వ్యవసాయానికి విద్యాపరంగా బలమైన పునాది వేయడానికి తోడ్పడుతుందన్నారు.
ఈ సంధర్భంగా రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ శ్రీ టి. విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రకృతి అనుకూలమైన వ్యవసాయ విధానాలను అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ యొక్క నిబద్ధతను వివరించారు. ఇటీవల జరిగిన డావోస్ సదస్సు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రైతు-శాస్త్రవేత్త కోర్సు గురించి చర్చించిన విషయం పంచుకొన్నారు. ఈ కార్యక్రమం రైతులు మరియు శాస్త్రీయ పరిశోధనల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు దోహదం చేస్తుందని అన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్,కేరళ, డా. శ్రీరామ్ వెంకిట్తరమణ, , అదనపు డైరెక్టర్ శ్రీ. థామస్ శామ్యూల్ తదితర కీలక అధికారులు పాల్గొన్నారు.