వర్షాధారంగా సాగుచేస్తున్నపప్పుదినుసుల పంటల్లో కంది ముఖ్యమైంది. ఈ పంటను వర్షాధారంగా అధిక విస్తీర్ణంలో సాగుచేస్తారు. ఈ సంవత్సరం వర్షాలు ఆలస్యంగా రావడంతో ఏపీలో రైతులు కందిని ఆలస్యంగా విత్తుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 2024 ఖరీఫ్ లో 8 లక్షల 93 వేల ఎకరాల్లో కంది సాగులో ఉంది. వర్షాలు ఆలస్యమైనా ఆగస్టు చివరి వరకు కూడా అందరు కందినే విత్తుకున్నారు. తొలకరి వర్షాలకు విత్తుకున్నపంట ప్రస్తుతం పూతదశలో ఉంది. కంది సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలం. మరి సాగులో అధిక దిగుబడులు పొందాలంటే సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపడితే అధిక దిగుబడులు పొందవచ్చు. వర్షపాతం లేనిచోట పూతకు ముందు ఒకసారి 19:19:19 ఎరువును లీటరు నీటికి 5 గ్రా.చొప్పున కలిపి పిచికారి చేయాలి. నీటి వసతి ఉన్నవారు ఒక రక్షక నీటి తడిని పూత ఏర్పడే దశలో ఇవ్వాలి. పప్పుదినుసుల పంటలు పూతదశలో నీటి ఎద్దడికి గురైనా, పూతదశలో నీరు ఎక్కువైనా పూత అంతా రాలిపోతుంది. కాబట్టి సరైన సమయంలో నీటితడులు ఇవ్వాలి. కొన్నిచోట్ల పూత రాలిపోవడం ప్రధాన సమస్య. ఈ సమస్య ముఖ్యంగా ఇసుక నేలల్లో సాగుచేసిన పంటలో కనిపిస్తుంది. ప్లానోఫిక్స్ 0.2 మి.లీ. చొప్పున లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేసుకున్నట్లయితే పూత, పిందె రాలటాన్ని అదుపు చేసుకోవచ్చు. కాయ ఏర్పడే దశలో బెట్ట పరిస్థితులను అధిగమించేందుకు ఒకసారి పొటాషియం నైట్రేట్ 10 గ్రా. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. అధిక వర్షాలకు తెగులు ఆశించినప్పుడు మెటాలాక్సిల్ లేదా మాంకోజెబ్ అనే మందు రెండు గ్రాముల చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ఎక్కడైతే మొక్కలు చనిపోతాయో వాటిని తీసివేసి వాటి చుట్టూ ఉండే మొక్కల మొదళ్లలో తడిసే విధంగా మందు పిచికారి చేయాలి.
కందిని పూత దశలో ఆశించే పురగులు:
మారుకా మచ్చల పురుగు: ముఖ్యంగా పూత దశలో మారుకా మచ్చల పురుగు ఆశించే ప్రమాదం ఉంటుంది. ఈ పురుగు ఆశించిన మొక్కల్లో ఎదుగుదల లోపిస్తుంది. ఈ పురుగు లేత ఆకులు, అప్పుడే ఏర్పడుతున్న పూత మీద గుడ్లను పెడుతుంది. గుడ్ల నుంచి పొదిగిన లార్వాలు ఆకులు, పూతను గూడుగా చేసుకొని అందులో ఉన్నపచ్చదనాన్నితింటాయి. దీని వల్ల పూత రాలిపోతుంది. కాయ ఎదుగుదల లోపిస్తుంది. అందుకే మారుకా మచ్చల పురుగును గమనించినట్లయితే ముందుగా వేప గింజల కషాయం 5 శాతం లేదా వేపనూనె (అజాడిరాక్టిన్ 1500 పి.పి.ఎం) 5 మి.లీ./ లీటరు నీటికి కలిపి చల్లాలి. పురుగు ఉధృతి ఆర్థిక నష్టపరిమితి స్థాయిని దాటినప్పుడు ఒకసారి స్పైనోశాడ్ 0.3 మి.లీ. లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రా. లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మి. లీ.చొప్పున లీటరు నీటికి కలిపి మొక్క అంతా తడిచేలా పిచికారి చేయాలి.
శనగపచ్చ పురుగు: ఈ పురుగు లేత కాయ, పూత దశలో ఆశిస్తుంది. పూత, పూమొగ్గల మీద విడిగా గుడ్లను పెడుతుంది. తొలిదశలో లేత ఆకులను పూలను తింటుంది. ఆ తర్వాత కాయలు ఏర్పడే దశలో ఆశించినట్లయితే కాయలలోకి సగభాగం చొచ్చుకొని పోయి మిగిలిన భాగం బయటకు ఉంచి గింజలను తింటుంది. దీని వల్ల గింజల పరిమాణం తగ్గి నాణ్యత దెబ్బతినడం, గింజలు రాలిపోవడం జరుగుతుంది. నివారణకు పూత ఏర్పడే దశలో ఎకరాకు 20 ‘వై’ ఆకారపు పంగల కర్రలను అమర్చుకోవాలి. పురుగు ఉధృతిని గమనించడానికి ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలను పెట్టాలి. పురుగు ఉధృతి ఆర్ధిక నష్టపరిమితి స్థాయిని దాటినప్పుడు ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.5గ్రా. లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మి.లీ. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
కాయతొలిచే ఈగ: బెట్ట వాతావరణ పరిస్థితులు, ఏదైనా కారణం వల్ల పంట కాలం పొడిగించినప్పుడు ఉధృతి అధికంగా కనిపిస్తుంది. పూత, లేత కాయలు లేదా పిందెల్లోకి గుడ్లను పెడుతుంది. వీటి నుంచి పొదిగిన తెల్లని పిల్లపురుగులు గింజలను తింటూ గింజల మీద తెల్లని చారలను ఏర్పరుస్తాయి. ఈ పురుగు ముఖ్యంగా దీర్ఘకాలిక రకాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీని నివారణకు గింజ గట్టి పడే దశలో డైమిథోయేట్ 2 మి. లీ లేదా ప్రొఫెనోఫాస్ 2 మి. లీ లేదా థయాక్లోప్రిడ్ 0.7 మి.లీ లేదా థయోమిథాక్సమ్ 25 డబ్లూ.జి. 0.4 గ్రాములు లేదా లుఫెన్యూరాన్ ఒక మి.లీచొప్పున.లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
మరింత సమాచారం కోసం ఫోన్ నెం: 9989623825 లో సంప్రదించవచ్చు.
డా. బి.కె. కిషోర్ రెడ్డి, డా. ఎస్. మల్లేశ్వరి సాదినేని,
కృషి విజ్ఞాన కేంద్రం, రెడ్డిపల్లి,
డా. జి. నారాయణ స్వామి, డా. కె.సి. నటరాజ, వ్యవసాయ పరిశోధన స్థానం, రేకులకుంట, అనంతపురం.
Leave Your Comments