ANGRAU Foundation Day: ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఎ.ఎన్.జి.ఆర్.ఎ.యు) ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా (ఎ.పి.ఎ.యు) జూన్ 12, 1964న ఎ.పి.ఎ.యు చట్టం 1963 ద్వారా స్థాపించబడింది. తదుపరి ప్రముఖ పార్లమెంటేరియన్ మరియు రైతు నాయకుడైన ఆచార్య ఎన్జీరంగా గారి గౌరవార్థం మరియు జ్ఞాపకార్థం నవంబర్ 7, 1996న ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంగా పేరు మార్చబడింది. రాష్ట్ర విభజన తర్వాత ఈ విశ్వవిద్యాలయం యొక్క ప్రధాన కార్యాలయం రాజేంద్రనగర్ హైదరాబాద్ నుండి లాం, గుంటూరు కు మే 2016న మార్చబడింది. ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఒక రాష్ట్రస్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయంగా విద్యార్థులకు, రైతులకు ఎంతో ఆసక్తితో మరియు అంకితభావంతో సేవలు అందిస్తుంది.
ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జూన్ 12వ తేదీన మన రాష్ట్రంలో “మన రైతు కోసం మన నాణ్యమైన విత్తనం కొరకు మన వ్యవసాయ విశ్వవిద్యాలయం అనే నినాదంతో విత్తన మహోత్సవం (మెగా సీడ్ మేళ) అనేది లాం, గుంటూరు నందు నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ విశ్వవిద్యాలయం గౌరవ ఉపకులపతి డాక్టర్ ఆదాల విష్ణువర్ధన్ రెడ్డి గారు తెలియజేశారు. రానున్న తొలకరిలో పంటల సాగుకు సన్నద్ధమవుతున్న రైతులకు నాణ్యమైన విత్తనాలు విక్రయానికి అందుబాటులో ఉంచుతున్నట్లు తెలియజేశారు.
ఈ విత్తన మహోత్సవం లో మన రాష్ట్రంలో సాగు చేస్తున్న ప్రధాన పంటలైన వరి, కంది, మినుము, పెసర, సెనగ, వేరుశనగ, నువ్వులు, రాగి, కొర్ర, జొన్న లలో కొత్త వంగడాల విత్తనాలు మరియు మామిడి, జీడిమామిడి అంట్లు, అడవి బాదం, పండ్ల మొక్కలైన నిమ్మ, డ్రాగన్ ఫ్రూట్, బొప్పాయి మొదలగు మేలైన నారుమొక్కలు విక్రయానికి అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. వరిలో బిపిటి 5204, 2270, 2295, 2782, 2595, 2411, 2846,2841; ఎం.టి.యు. 1224, 1262, 1293, 1318, 1156, 1075 మచిలీపట్నం నుండి చౌడును తట్టుకునే ఎం సి ఎం 100, 125; నెల్లూరు నుండి ఎన్.ఎల్.ఆర్ 34449 అందుబాటులో ఉంటాయి.
కందిలో ఎల్ ఆర్ జి 105, 133-33, 52, తిరుపతికి చెందిన టి ఆర్ జి 59; మినుములో ఎల్బీజీ 752, 884, 787, 904, 932, టీబీజీ 129, ఘంటసాల నుంచి జిబిజి 1; పెసర లో లాం నుంచి ఎల్ జి జి 460, 607, 574, ఐపిఎం- టు-14; నంద్యాల నుండి శనగ రకాలైన ఎం బి ఎన్ బి ఈ జి 810, 452, 119, 857, 776, 49; వేరుశనగ నుంచి ధరణి, ధీరజ్, నిత్య హరిత, నారాయణి, కదిరి ఆరు, కదిరి లేపాక్షి, వశిష్ట; నువ్వుల నుంచి వై ఎల్ ఎం 66, రాగి నుంచి వకుళ, తిరుమల, శ్రీ చైతన్య, వేగావతి, ఇంద్రావతి, కొర్ర నుండి ఎస్ ఐ ఏ 3156, రేనాడు, మహానంది; జొన్నల నుండి ఎన్టిజే ఐదు రకాలు విక్రయానికి అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలియజేశారు. వివిధ ప్రైవేట్ విత్తన కంపనిల నుండి విత్తనాలను విక్రయానికి అమ్మకానికి ఉంచడం. జరుగుతుంది. వ్యవసాయ సాంకేతిక ప్రదర్శనతో పాటు వివిధ వ్యవసాయ ఉత్పత్తులు, సేంద్రీయ ఉత్పత్తులు (వరి,కంది, మినుము, పెసర తదితరులు), తేనె తదితర వస్తువులు విక్రయానికి అందుబాటులో ఉంటాయి. ఈ సదవాకాసమును రైతు సోదరులు అందరు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసారు. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన టోల్ ఫ్రీ ఫోన్ నెంబర్ 1800 425 0430. గుంటూరు పరిసర ప్రాంతాల వ్యక్తులు మరియు విద్యార్థులు సాయంత్రం వేళలో సందర్శించడానికి ఏర్పాట్లు చేయడం జరిగినది.